COVID: కోటి దాటిన రికవరీలు, మరోసారి కరోనా భరతనాట్యం, రెండు రాష్ట్రాల్లో 55%, ఒక్క రోజులో 20 వేలు !
న్యూఢిల్లీ/ హైదరాబాద్/ బెంగళూరు: భారతదేశంలో మరోసారి కరోనా వైరస్ (COVID-19)మహమ్మారి ప్రతాపం చూపించింది. ఐదు రోజుల తరువాత కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజలతో పాటు ప్రభుత్వాలు హడలిపోయాయి. భారతదేశంలో మరోసారి 24 గంటల వ్యవధిలో 20, 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. భారతదేశంలో కరోనా వైరస్ బారినపడిన కోలుకున్న వారి సంఖ్య కోటి దాటిపోయింది. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ తాండవం చేసిన దేశాల జాబితాలో భారతదేశం 12వ స్థానంలో నిలిచింది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి వ్యాధికి మరో 222 మంది బలి అయ్యారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కరోనా భరతనాట్యం చేస్తోందా ?
భారతదేశంలో గత 24 గంటల్లో 20, 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బుధవారం దేశవ్యాప్తంగా 18, 587 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దేశంలో కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారికంటే సుమారు 700 మందికి పైగా ఆ వ్యాదిబారినపడ్డారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాధి కోసం చికిత్స పొందుతున్న వారిలో చికిత్స విఫలమై 222 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కోటి దాటిన రికవరీలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి సోకి ఆసుపత్రిలో చికిత్స పొంది వ్యాధి నయం చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,95,278 మంది కరోనాతో వ్యాధి బారినపడ్డారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తో పోరాటం చేసి వ్యాధి నయం చేసుకుని 1,00, 16,859 మంది వారివారి ఇళ్లకు చేరుకున్నారు.

లక్షా 50 వేలు దాటిన మరణాల సంఖ్య
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారిలో సామాన్య ప్రజలతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1, 50, 336 మంది కరోనా వైరస్ కు బలి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 2, 28, 083 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

17.84 కోట్ల మందికి కరోనా పరీక్షలు
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 17, 84, 00, 995 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. భారతదేశంలో జనవరి 6వ తేదీ మాత్రమే 9, 37, 590 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ బారినపడిన దేశాల జాబితాలో భారతదేశం 12వ స్థానంలో ఉంది.

కేరళ, మహారాష్ట్రలో 53% కరోనా కేసులు
నవంబర్ 27వ తేదీ తరువాత భారతదేశంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. కేరళ, మహారాష్ట్రలో 53% కరోనా కేసులు నమోదు కావడంతో ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 66 మంది, కేరళలో 25 మంది, పశ్చిమ బెంగాల్ లో 22 మంది కరోనా దెబ్బతో చనిపోయారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 7.81 లక్షల మంది కరోనా వైరస్ వ్యాధి బారినపడ్డారు.