• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్‌19: భారత్‌లో కోవిడ్‌ను ఎదుర్కొంటున్న తీరు మోదీ ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందా?

By BBC News తెలుగు
|

రోగులకు ఆసుపత్రుల్లో బెడ్ దొరకడం, ఆక్సిజన్ ఉన్న బెడ్ దొరకడం ఒక సవాలుగా మారింది

భారత్‌లో గత వారం రోజుల్లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కోవిడ్‌19 కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్‌ బాధిత మరణాల వాస్తవ లెక్కలు అధికారిక లెక్కల కన్నా ఎక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయంలో కొందరు అడిగిన ప్రశ్నలకు నిపుణులు అందిస్తున్న సమాధానాలు ఇవీ.

ప్రశ్న: భారత్‌లో సెకండ్ వేవ్ విధ్వంసకరంగా ఎందుకుంది?: జబ్రన్ అలీ ఖాన్

సమాధానం: డాక్టర్ ఓం శ్రీవాస్తవ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్, విజిటింగ్ ప్రొఫెసర్, ముంబయి

దేశంలో మొదటివేవ్ తలెత్తినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ముంబయిలోని ధారావి మురికివాడలో ఇన్ఫెక్షన్లను నియంత్రించడమే దానికి ఓ చక్కని ఉదాహరణ. ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి విధానాన్నే అవలంబించారు. కానీ, గత సంవత్సరం నవంబర్ నుంచి మన జీవితాల నుంచి కరోనా వెళ్లిపోయిందని భావించి, కాస్త సాధారణ జీవితానికి మళ్లీ అలవాటుపడ్డాం.

అలా చేస్తూ భౌతిక దూరం పాటించడం కూడా మానేశాం. ఆ తర్వాత భౌతిక దూరం పాటించడం వీలు కాని ఎన్నికల ప్రచార ర్యాలీలు, కుంభమేళా వంటివి కూడా చోటు చేసుకున్నాయి.

అలాంటి పరిస్థితి మనకు సమస్యలను సృష్టించడానికి మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటుంది. దీనికి ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి.

చరిత్రలో మహమ్మారులు సెకండ్ వేవ్‌లు తలెత్తిన తీరును పరిశీలిస్తే అవి ఎప్పుడూ తీవ్ర స్థాయిలోనే చోటు చేసుకున్నాయి.

ఈసారి రోగులకు హాస్పటల్‌లో చేరడం, ఆక్సిజన్ ఉన్న బెడ్ దొరకడం ఓ సవాలుగా మారింది. హాస్పటల్‌లో బెడ్ దొరకకపోవడం అనేది మరో ఆందోళన.

అందరికీ హాస్పటల్ బెడ్ దొరకకపోవచ్చు. కానీ, బెడ్ దొరికితే సురక్షితంగా ఉంటామనే చాలా మంది అనుకుంటారు.

ఎన్నికల ప్రచార ర్యాలీలు, కుంభ మేళాలు కూడా భారతదేశంలో చోటు చేసుకున్నాయి.

ప్రశ్న: భారత జనాభాకు సరిపడా వైద్య పరమైన మౌలిక సదుపాయాలున్నాయా?: ఎలియాస్ సింగపూర్

సమాధానం: యోగితా లిమాయె, బీబీసీ ప్రతినిధి

భారత్‌ 2018లో స్థూల జాతీయోత్పత్తిలో 1.28 శాతాన్ని వైద్య రంగంపై వెచ్చించింది. అమెరికా ఆ దేశ వైద్య రంగంపై 17 శాతం ఖర్చు చేసింది.

దేశంలో ప్రతి 1456 మంది ప్రజలకు ఒక డాక్టర్ ఉన్నట్లు భారత ప్రభుత్వం 2019-20లో ప్రకటించిన లెక్కలు చెబుతున్నాయి.

వైద్య రంగంపై ఇంత తక్కువ మొత్తంలో వెచ్చించడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది.

ఇటీవలి ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించలేదు.

చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆసుపత్రుల్లో తగినన్ని వైద్య సౌకర్యాలు, సిబ్బంది లేరు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా మంది వైద్య సేవలను పొందడానికి కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది.

ప్రశ్న: ఈ సంక్షోభాన్ని భారత ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది?: శ్రీ, అమెరికా

సమాధానం: యోగితా లిమాయె, బీబీసీ ప్రతినిధి

దేశంలో ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచే మార్గాల గురించి, వైద్యరంగంలో మౌలిక సదుపాయాల గురించి చర్చించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 27న మూడు సమావేశాలు నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేయడానికి మిలిటరీ సిబ్బందిని, రైళ్లను రంగంలోకి దించారు. కానీ, క్షేత్ర స్థాయిలో నిజానికి ఆక్సిజన్ అవసరమైన వారికి అది అందటం లేదు.

దిల్లీలో ఆక్సిజన్ బెడ్ల కోసం కాల్ చేయమని చెప్పిన హెల్ప్ లైన్లు కూడా పని చేయడం లేదు. నిజానికి ఇక్కడ ఒక బెడ్ కూడా దొరకని పరిస్థితి నెలకొని ఉంది.

ప్రజలకు చాలా కోపంగా ఉంది. మేం కొంత మంది కోవిడ్ రోగుల కుటుంబాలను కలిసినప్పుడు "ప్రభుత్వం ఎక్కడుంది? ఏం చేస్తోంది" అని ప్రశ్నించారు.

సైన్యం, డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బందిని రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన ఫీల్డ్ ఆసుపత్రులు ఎందుకు నిర్మించట్లేదని చాలా మంది అడుగుతున్నారు.

దేశంలో ప్రజలను ఎవరి కష్టాలు వారు పడమని వదిలేసినట్లు అనిపిస్తున్న భావనలోనే చాలా మంది ఉన్నారు.

రోగులకు ల్లో బెడ్ దొరకడం, ఆక్సిజన్ ఉన్న బెడ్ దొరకడం ఒక సవాలుగా మారింది.

ప్రశ్న: వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో బ్రిటన్‌తో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లేనా?: మైక్

సమాధానం: జేమ్స్ గల్లాఘర్, బీబీసీ సైన్స్‌ కరెస్పాండెంట్

దేశ జనాభా 100 కోట్లకు పైనే ఉంటుంది. కానీ, ఈ రెండు దేశాలను పోల్చే ముందు చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

మొదటిది వైద్య రంగ సామర్థ్యం. భారత్‌లో ఆసుపత్రులు నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితి బ్రిటన్‌లో తలెత్తలేదు.

భారత్‌లో ఇన్ఫెక్షన్ల సంఖ్యను సరిగ్గా నమోదు చేయడం లేదనే వాదన కూడా ఉంది.

బ్రిటన్‌లో జనవరి వరకు పతాక స్థాయిలో కేసులు నమోదైనా ఆ తర్వాత 97 శాతం తగ్గిపోయాయి. కానీ, భారత్‌లో కేసులు నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి.

ఇప్పుడు దేశంలో మరణిస్తున్నవారు కొన్ని వారాల క్రితం ఇన్ఫెక్షన్ సోకినవారు. అప్పటి నుంచి వైరస్ పెరుగుతూ రావడం వల్ల మరణాలు కూడా అదే సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి.

ప్రశ్న: బ్రిటన్‌ నుంచి మేమెలా సహాయం చేయగలం?: కేట్, బ్రిటన్‌

సమాధానం: సీమ కొటేచా, న్యూస్ నైట్ కరెస్పాండెంట్, బీబీసీ న్యూస్

ఇక్కడున్న దక్షిణాసియా సంస్కృతి ప్రజల్లో భరించలేనంత వేదన ఉంది. మాతృదేశం నుంచి వస్తున్న భయానకమైన చిత్రాలను చూస్తుంటే హృదయవిదారకంగా ఉంటోంది. ఇది చాలా ఆవేదనకు గురిచేస్తోంది.

చాలా మంది సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొని స్వదేశానికి పంపించడానికి బ్రిటన్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాలను సేకరిస్తున్నాయి.

కొంత మంది బ్రిటిష్ ఇండియా డాక్టర్లు ఇండియాలో కోవిడ్ రోగులకు ఫోన్ ద్వారా వైద్య సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు.

లండన్‌లో అనేకసార్లు వైరస్ విజృంభించడంతో వారికి మరింత అనుభవం, పరిజ్ఞానం ఉందని అక్కడి డాక్టర్లు అంటున్నారు.

బ్రిటన్‌లోని హిందువులు కొన్ని దేవాలయాల్లో భారత్‌లోని వారి కోసం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దిల్లీలో తల్లిదండ్రులున్న ఓ భారతీయ అమ్మాయి "నా దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయి. నేను చేయగలిగింది ప్రార్థన మాత్రమే" అన్నారు.

ప్రశ్న: ఎలక్ట్రిసిటీ లేకపోయినా ఆక్సిజన్ ఉత్పత్తికి ఆఫ్రికా లాంటి దేశాలు అవలంబిస్తున్న పద్ధతులను భారత్‌ ఎందుకు పాటించకూడదు?: జి.డోయిల్

సమాధానం: డాక్టర్ ఓం శ్రీవాస్తవ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్, విజిటింగ్ ప్రొఫెసర్, ముంబయి

మన ఆక్సిజన్ అవసరాలను ఈ విధంగా చూస్తాం. నాసల్ ప్రాంగ్ ద్వారా 2 - 3 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయవచ్చు.

ఐసీయూలో ఎవరైనా ఉంటే వారికి హై ఫ్లో నాసల్ కాన్యులాలు అవసరమవుతాయి. అంటే వారికి 10 - 40 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది.

ఆసుపత్రులన్నీ కోవిడ్ హాస్పటళ్లుగా మారితే ఆక్సిజన్ వినియోగం ఊహించిన దాని కంటే ఎక్కువే ఉంటుంది.

కానీ, ఆక్సిజన్ ఉత్పత్తికి అవలంబించిన విధానాలు ఏవైనా... అవన్నీ సమయం తీసుకుంటాయి.

ప్రస్తుతం ఆక్సిజన్ వినియోగం అవసరానికి మించి ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కంటే సరఫరా చేయవలసిన ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది.

దీనిని సరైన సమయంలో ఉత్పత్తి చేస్తే అవసరమైనప్పుడు రోగులకు అందించడానికి వీలవుతుంది.

మీడియా ఆక్సిజన్ కొరతపై దృష్టి పెడుతోంది. అయితే డాక్టర్లు, నర్సులు, వార్డ్ అటెండెంట్లు, ఇతర వైద్య సిబ్బంది అవసరం కూడా ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రశ్న: భారత్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంత వరకు జరిగింది?: మోసెస్ బొంబాక, యుగాండా

సమాధానం: యోగితా లిమాయె, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో130కోట్ల జనాభా ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 10.5 కోట్ల వ్యాక్సీన్ డోసులను మాత్రమే ఇచ్చారు.

ప్రస్తుతం భారత్‌లో వ్యాక్సీన్ నిల్వలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో తెలియదు.

ప్రశ్న: ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విధానం... మోదీ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు?: పూర్విక, లండన్

సమాధానం: వికాస్ పాండే, బీబీసీ ఇండియా, ఎడిటర్

ఈ సంక్షోభ నిర్వహణ తీరుపై మోదీ ప్రభుత్వంపై గాని, రాష్ట్ర ప్రభుత్వాలపై గాని, ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం.

కానీ, సెకండ్ వేవ్‌లో కేసులు చిన్న చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కొద్దీ ప్రజలు రాజకీయ నాయకులపై, వైద్య అధికారులు, పరిపాలనాధికారులపై చాలా ఆగ్రహంతో ఉన్నారని మాత్రం అర్థమవుతోంది.

ప్రశ్న: భారత్ వ్యాక్సీన్ ఎగుమతులను నిలిపి, దేశీయ అవసరాలకు వాడుకుంటే, దాని ప్రభావం బ్రిటన్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియపై పడుతుందా?

సమాధానం: జేమ్స్ గల్లాఘర్, బీబీసీ సైన్స్‌ ప్రతినిధి

బ్రిటన్‌ ఇప్పటికే 50 కోట్ల వ్యాక్సీన్ డోసులను కొనుగోలు చేసింది.

దీనివల్ల బ్రిటన్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడకపోవచ్చు.

ప్రశ్న: భారత్‌లో వచ్చిన కోవిడ్ స్ట్రెయిన్ యూకే స్ట్రెయిన్ కంటే భిన్నమైనదా? భారత్‌లో అంత మంది ఎందుకు మరణిస్తున్నారు?: జోవన్, బ్రిటన్‌

సమాధానం: జేమ్స్ గల్లాఘర్, బీబీసీ సైన్స్‌ ప్రతినిధి

భారత్‌లో పెరుగుతున్న కేసులకు చికిత్స అందించేందుకు తగినన్ని ఆసుపత్రులు లేవు.

అత్యుత్తమ వైద్య సేవలు అందించినప్పుడు కూడా కోవిడ్ చాలా తీవ్ర ప్రభావం చూపింది. అలాంటిది ఆక్సిజన్ దొరకక, తగినంత మంది వైద్యులు దొరకటం లేనప్పుడు మరణాలు ఎక్కువ చోటుచేసుకునే అవకాశం ఉంది.

వేరియంట్లు విభిన్న పాత్ర పోషించవచ్చు. కానీ దానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.

బ్రిటన్‌లో ముందు బి117 వేరియంట్‌ కనిపించింది. కానీ, భారత్‌లో కనిపించిన బి1617 వేరియంట్‌ తొలిసారి అక్టోబర్‌లో కనిపించింది.

కానీ, కేసులు పెరగడంలో ఈ వేరియంట్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid19: Will Modi Govt have the impact on the way covid is dealt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X