
మహా సంక్షోభం: కశ్మీర్ పండిట్లకు సెక్యూరిటీ ఇవ్వండి..పారిపోయిన ఎమ్మెల్యేలకు కాదు:ఆదిత్య
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది. షిండే అండ్ కో గురించి ఉద్దవ్ సంప్రదింపులు చేసి చాలించుకున్నారు. ఆయన భార్య రష్మి థాకరే, కుమారుడు ఆదిత్య థాకరే వంతు వచ్చింది. రష్మి.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో సంప్రదింపులు జరుపుతుండగా.. ఆదిత్య థాకరే మాత్రం ఫైర్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా మండి పడుతున్నారు.
రెబల్ ఎమ్మెల్యేలు 15 మందికి వై ప్లస్ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదిత్య థాకరే స్పందించారు. కేంద్రం సెక్యూరిటీ కల్పించాల్సింది కశ్మీర్ పండిట్లకు.. వారి కుటుంబాలకు అని చెప్పారు. సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ వారికి కల్పిస్తే బాగుంటుందని చెప్పారు. కానీ పారిపోయిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు, కార్యాలయాలకు భద్రత కల్పించడం ఏంటీ అని ఆదిత్య థాకరే అడిగారు.కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టారు. రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత పెంచి ఎలాంటి సందేశం ఇస్తోందని ఫైరయ్యారు. ఇదీ మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

అంతకుముందు వర్షను వదిలి వెళుతున్నందుకు బాధపడటం లేదని సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు. ఇదీ తనది కాదని తనకు తెలుసు అని చెప్పారు. ఇదివరకు చాలా మంది కూడా అలాగే వెళ్లారని గుర్తుచేశారు. తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. తనతో శివ సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలకు శివ సైనికుల నుంచి థ్రెట్ ఉంది. ఇప్పటికే కొందరి కార్యాలయాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీంతోనే కేంద్ర ప్రభుత్వం భద్రతను కల్పించింది. దీనిని ఆదిత్య థాకరే తప్పుపట్టారు.