కానరాని కాంగ్రెస్: 63 చోట్ల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు, అందులో అల్కా లాంబా కూడా..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాడ కనిపించలేదు. భూతద్దం పెట్టుకొని చూసిన ఆ పార్టీ నేతల జాడ ఆగుపించలేదు. 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ 2015లో మాదిరిగానే ఖాతా తెరవలేదు. అయితే ఈ సారి ఆ పార్టీకి చెందిన 63 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం విశేషం. ఆప్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన అల్కా లాంబాకు కూడా డిపాజిట్ దక్కలేదు. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్ దక్కించుకొన్నారు.

15 ఏళ్లు అధికారం..
ఢిల్లీలో కాంగ్రెస్ రాజ్యమేలింది. షీలా దీక్షిత్ హయాంలో వరుసగా మూడుసార్లు గెలుపొందింది. కానీ ఆప్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రభ మెల్ల మెల్లగా తగ్గిపోతుంది. ఈ ఎన్నికల్లో మాత్రం మంచి రోజులు వస్తాయయని.. కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ అదీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. 63 మందికి డిపాజిట్ దక్కకపోవడంతో ఆశ్చర్యానికి గురిచేసింది.

63 మంది డిపాజిట్ గల్లంతు.
నియోజకవర్గంలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో ఆరోవంతు ఓట్లు రావాలి. లేదంటే సదరు అభ్యర్థి డిపాజిట్ కోల్పోతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నుంచి రూ.10 వేల తీసుకున్నారు. డిపాజిట్ దక్కనివారికి ఆ నగదు అందజేయరు. డిపాజిట్ వచ్చి.. ఓడిపోయిన వారికి మాత్రమే నగదు అందజేస్తారు. అయితే గాంధీనగర్, బడ్లీ, కస్తూర్బా నగర్ తప్ప మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకోలేదు. ఆప్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అల్కా లాంబా కూడా చాందినిచౌక్లో డిపాజిట్ దక్కకపోవడం విశేషం.

బీజేపీ ఓటమితో..
కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కాదు డిపాజిట్ రాకున్నా కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఎందుకంటే తమ ప్రత్యర్థి బీజేపీ కూడా ఓడిపోవడంతో సంబరాలు చేసుకున్నారు. దేశాన్ని విభజించి పాలించే బీజేపీ విధానాన్ని ప్రజలు తిరస్కరించారని చిదంబరం పేర్కొన్నారు. ఢిల్లీ ఫలితాలు ఇతర ఎన్నికలకు నిదర్శనంగా నిలువనున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.

కేజ్రీవాల్‌కు విష్
ఢిల్లీలో అభివృద్ధి నినాదమే గెలిచిందన్నారు కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అదిర్ రంజన్ చౌదరి. అఖండ విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.