ఢిల్లీలో కరోనా కల్లోలం: ఏకంగా 28వేలకుపైగా కొత్త కేసులు, ఒక్కరోజులో ఇదే అత్యధికం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. దేశ రాజధానిలో తాజాగా, కరోనావైరస్ కేసులు ఉప్పెనలా పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీలో రికార్డు స్థాయిలో 28,867 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇక కరోనా వైరస్ పాజిటివిటీ రేటు 29 శాతానికి పెరిగింది. కరోనా పరీక్షలు చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్ తేలుతుండటం గమనార్హం.
కాగా, ఢిల్లీలో ఒకరోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత ఏప్రిల్ 20న ఢిల్లీలో అత్యధికంగా ఒక్కరోజే 28,395 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రానికి ముంబైలో 13,702 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 21 శాతం ఉన్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. బుధవారం ముంబైలో 16వేల కేసులు నమోదయ్యాయి. జనవరి 7న అత్యధికంగా 20వేల కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కర్ణాటక రాష్ట్రంలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 25వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 12.3 శాతంగా ఉంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,47,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో గత రోజు కంటే 50 వేల కేసులు పెరిగాయి.
గడిచిన ఎనిమిది నెలల కాలంలో తొలి సారిగా భారత్ రెండు లక్షల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాటింది. రాజస్థాన్ లో ఒకే రోజు 10 వేలకు పైగా కరోనా కేసులను గుర్తించారు. ప్రయాగ్ రాజ్ లో 38 మందిని కరోనా పాజిటివ్ బాధితులుగా నిర్దారణ అయింది. దీని ద్వారా దేశంలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 11,17,531 కాగా, పాజిటివిటీ రేటు 13.11 శాతానికి చేరింది. జనవరి నెలాఖరుకు కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓమిక్రాన్ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ఫ్లూ ను సాధారణంగా తీసుకోవద్దంటూ హెచ్చరించింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 కు చేరింది.