కోవాగ్జిన్ వద్దు... కోవీషీల్డ్ ఇవ్వండి... ఢిల్లీ వైద్యుల ట్విస్ట్... ఆ వ్యాక్సిన్‌పై ఆందోళన...
దేశవ్యాప్తంగా శనివారం(జనవరి 16) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ.. ఇప్పటికీ చాలామందిని ఒక డైలామా వెంటాడుతోంది. కోవాగ్జిన్,కోవీషీల్డ్లలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలన్న ఆప్షన్ లేకపోవడంతో వ్యాక్సినేషన్ పట్ల చాలామందిలో అపోహలు,సందేహాలు నెలకొన్నాయి. సామాన్యులే కాదు ఆఖరికి వైద్యులు సైతం వ్యాక్సిన్ విషయంలో తమకు ఆప్షన్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. తాజాగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన వైద్యులు తమకు కోవాగ్జిన్ వద్దని కోవీషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలని సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం గమనార్హం.

కోవాగ్జిన్ పట్ల వైద్యుల ఆందోళన...
రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తమకు భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ ఇవ్వొద్దని... సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవీషీల్డ్నే ఇవ్వాలని సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.కోవాగ్జిన్ ట్రయల్స్ ఇంకా పూర్తి కానందునా ఆ వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల తాము ఆందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న కోవీషీల్డ్ వ్యాక్సినే తమకు ఇవ్వాలని కోరారు.

అదే వ్యాక్సిన్ తీసుకున్న సూపరింటెండెంట్..
వైద్యుల మాట ఇలా ఉంటే అదే రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన సూపరింటెండెంట్ శనివారం కోవాగ్జిన్ తీసుకోవడం గమనార్హం. నిజానికి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతుండగానే కోవాగ్జిన్‌కు అనుమతినివ్వడంపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. పూర్తి స్థాయి డేటా సమర్పించకుండానే ఆ వ్యాక్సిన్‌కు ఎలా అనుమతిస్తారని విపక్షాలు కూడా ప్రశ్నించాయి. ఆఖరికి సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో పూనమ్ వాలా కూడా కోవాగ్జిన్‌పై పరోక్షంగా సెటైర్స్ వేశారు. కోవీషీల్డ్,మోడెర్నా,ఫైజర్ మినహా మిగతావి నీళ్లంత సేఫ్ అని వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత మళ్లీ తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

సేఫ్ అని చెప్పిన కేంద్రం...
మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఈ రెండు వ్యాక్సిన్లు పూర్తి సేఫ్ అని ఇది వరకే ప్రకటించారు. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వి.కె పౌల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే వేలాదిమంది వలంటీర్లపై వాటిని ప్రయోగించారని... సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లన్నీ ఎమర్జెన్సీ అవసరాల కోసమేనని... భారత్‌లోనూ ఎమర్జెన్సీ వినియోగానికే అనుమతినిచ్చామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లను ఇస్తున్నారని... వ్యాక్సిన్ విషయంలో ఆయా దేశాల్లోనూ ఆప్షన్ ఇవ్వలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ గతంలోనే వెల్లడించారు.