ఢిల్లీలో తగ్గుతున్న కోవిడ్ కేసులు- వారాంతపు కర్ఫ్యూ ఎత్తేసేందుకు ప్రభుత్వం సిద్ధం
ఢిల్లీలో కోవిడ్ కేసుల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. ఈ నెల ఆరంభం వరకూ భారీ ఎత్తున కేసులు నమోదైన జాతీయ రాజధానిలో కొన్ని రోజులుగా కరోనా ఆంక్షలు అమల్లోకి రావడంతో కేసుల సంఖ్యలోనూ ఆ మేరకు తగ్గుదల నమోదవుతోంది ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దీంతో కర్ఫ్యూ ఎత్తివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
దేశ రాజధానిలో కొన్నిరోజులుగా తక్కువ కోవిడ్ -19 కేసులు నమోదవుతుండడంతో, వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేయడంతో పాటు ఆంక్షల్ని సడలించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లు, మాల్స్‌లోని దుకాణాలకు వర్తించే సరి-బేసి విధానం కూడా ఎత్తేయాలని భావిస్తోంది. ప్రైవేట్ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించనున్నారు.

నగరంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో మినహాయింపు పొందిన కేటగిరీలు మినహా అన్ని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం గతంలో ఆదేశించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆమోదం కోసం పంపారు.
ఢిల్లీలో నిన్న 12,306 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, బుధవారం నాటికి 13,785 మంది కోలుకున్నారు. 10 రోజుల వ్యవధిలో, రోజువారీ కేసులు గరిష్టంగా 28,000 నుంచి భారీగా తగ్గాయి. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా తగ్గిందని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. గత వారం, జాతీయ రాజధానిలో ఐదో కోవిడ్ -19 వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుందని, ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని జైన్ చెప్పారు. వారాంతపు కర్ఫ్యూ, ముందస్తు పరిమితులు వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడతాయని అప్పట్లో తెలిపారు. అనుకున్నట్లుగా ఆంక్షల ప్రభావం పనిచేసింది.