వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్లీ: రింకూ శర్మ హత్యకు కారణాలేంటి... సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

Click here to see the BBC interactive

వాయువ్య దిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో రింకూ శర్మ అనే యువకుడి హత్య చర్చనీయాంశమైంది. ఈ హత్య వెనుక కారణాలేంటని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చిస్తున్నారు.

రింకూ శర్మ హిందువు అని, ఆయనకు బజరంగ దళ్‌, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)తో సంబంధాలు ఉండడమే హత్యకు కారణమని పలువురు భావిస్తున్నారు.

ఇది మత హింసకు సంబంధించిన కేసు కాదని, పరస్పరం జరిగిన గొడవలే హత్యకు దారి తీసాయని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగా పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.

ఆరోజు ఏం జరిగింది?

దిల్లీ అడిషనల్ డీసీపీ సుధాంశు ధామా అందించిన వివరాల ప్రకారం...

"అంతకుముందు రోజు రాత్రి ఒక బర్త్ డే పార్టీ కోసం కొంతమంది అబ్బాయిలు మంగోల్పురి ప్రాంతంలో కలుసుకున్నారు. పార్టీ జరుగుతుండగా, ఒక రెస్టారెంట్ విషయమై వీళ్ల మధ్య గొడవ మొదలైంది. రెండు వర్గాలుగా చీలిపోయి గొడవపడ్డారు.

రింకూ శర్మ మిత్రులు సచిన్, ఆకాశ్‌లకు ఒక రెస్టారెంట్ ఉంది. వీళ్లతో పాటుగా చింగూ ఉరఫ్ జాహిద్ రోహిణీలో ఒక రెస్టారెంట్ తెరిచారు. రింకూ శర్మకు ఈ రెండింటితోనూ సంబంధం లేదు. అతనికి ఈ రెస్టారెంట్లలో వాటా లేదు.

లాక్‌డౌన్ కారణంగా రింకూ శర్మ మిత్రుల రెస్టారెంట్ మూత పడింది. ఈ విషయంలో వారి మధ్య గొడవ మొదలైంది. గొడవ పెరుగుతుండడంతో జాహిద్ అక్కడినుంచీ బయలుదేరి వెళ్లిపోయారు.

మంగోల్‌పురి

తరువాత తన మావయ్య, మరో నలుగురు బంధువులతో కలిసి జాహిద్, రింకూ శర్మ ఇంటికి వెళ్లారు. జాహిద్ మామ దానిష్ ఉరఫ్ లాలీ ఇల్లు, రింకూ ఇల్లు ఉన్న వీధిలోనే ఉంది. అక్కడే వారి మధ్య గొడవ మొదలైంది. గొడవ పడుతూ, పడుతూ రింకూ శర్మను కత్తితో పొడిచేశారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స జరుగుతుండగా రింకూ చనిపోయారు.

అప్పుడే, అక్కడే నలుగురిని అరెస్ట్ చేశారు. వీళ్ల నలుగురికీ కూడా నేర చరిత్ర ఏమీ లేదు.

ఇప్పటివరకూ ఈ కేసులో మతపరమైన కోణం ఏదీ వెలుగులోకి రాలేదు. ఇది పూర్తిగా వ్యాపారానికి సంబంధించిన విరోధమే.

వీళ్లందరూ కూడా ఇరుగు పొరుగు వాళ్లు. పరస్పరం బాగా పరిచయం ఉన్నవాళ్లు. వీళ్ల మధ్య మత సంబంధమైన సమస్యలేం లేవు."

అయితే, రింకూ హిందువు కావడమే ఈ హత్యకు కారణమని అతని బంధువులు ఆరోపించారు. రింకూ బజరంగదళ్ సభ్యుడు. రామ మందిర నిర్మాణానికి చందాలు వసూలు చేస్తున్నారు. ఈ కారణాల వల్లే తనని పొడిచి చంపేశారని రింకూ బంధువులు అంటున్నారు. అలా చెప్పినవారిలో రింకూ తమ్ముడు కూడా ఉన్నారు.

చుట్టుపక్కల వాళ్లు ఏమంటున్నారు?

రింకూ హత్య వార్త తెలిసిన తరువాత పలువురు రాజకీయ నాయకులు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఖీ బిర్లా, దిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా మృతుడి ఇంటికి చేరుకున్నారు.

బీబీసీ ప్రతినిధి కూడా మృతుడి ఇంటి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే రాజకీయ నాయకులు వచ్చి ఉండడంతో జనం భారీగా గుమికూడారు. అప్పుడు చుట్టుపక్కల వారితో బీబీసీ ప్రతినిధి మాట్లాడారు.

"దీనికి హిందూ-ముస్లింల రంగు పులుముతున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది ముస్లింలు నివసిస్తున్నారు. నేనిక్కడ 40-45 ఏళ్లుగా ఉంటున్నాను. ఇక్కడ మతపరమైన కలహాలు ఎప్పుడూ జరగలేదు" అని రింకూ ఇంటి పక్కన నివసించే ఒక వ్యక్తి చెప్పారు.

"రింకూ చాలా మంచి కుర్రాడు. పండిట్ వంశం నుంచీ వచ్చారు. గుడికి వచ్చి పూజలు, ప్రార్థనలు చేసేవారు. అప్పుడప్పుడూ ఇక్కడ జెండా ఎగురవేస్తూ ఉండేవారు. ఎదురు పడినప్పుడల్లా క్షేమ సమాచారాలు అడుగుతూ ఉండేవారు. బాగా తెసిన వ్యక్తి. వాళ్లింట్లో వాళ్లు కూడా చాలా మంచివాళ్లు. చాలా దారుణం జరిగింది" అని ఆ పక్కనే ఉన్న గుడి దగ్గర కూర్చున్న ఒక యాభై ఏళ్ల పెద్దావిడ చెప్పారు.

అరెస్ట్ అయిన వారి గురించి ఆ పెద్దావిడను అడిగితే.. "మేము కాయస్థులం. మేము వారితో ఏ సంబంధాలు పెట్టుకోం. వాళ్లు చిన్న కులం వాళ్లు. మా వీధిలో కూడా రెండు కుటుంబాలవాళ్లు ఉన్నారు. మేం ఎవరితోనూ పెద్దగా సంబంధాలు పెట్టుకోం. ఈ ప్రాంతంలో వాళ్లు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో నలుగురేసి కుర్రాళ్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా గొడవలు పడడంలో, కొట్లాటల్లో ముందుంటారు" అని ఆమె చెప్పారు.

ఈ పెద్దావిడే అరెస్ట్ అయిన వారి ఇంటికి తోవ చూపించారు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో ఉన్నవారందరూ పారిపోయారని చుట్టుపక్కలవాళ్లు చెప్పారు.

దేవుడి పేరెత్తితే చంపేస్తారేమోనని ఇప్పుడు అందరికీ భయం పట్టుకుందని వాళ్లంతా ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడుగానీ, ఇతరత్రాగానీ వాళ్ల మధ్య ఏ గొడవలూ లేవని, ఎప్పుడూ ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని వారు చెప్పారు.

ఈ ఘటనలో ఉపయోగించిన కత్తి రింకూ శర్మదే అని వాళ్లంతా చెప్పారు. హత్య సమయంలో రికార్డ్ చేసిన వీడియోలో సాక్ష్యం ఉందని చెప్పారు.

మంగోల్పురి

కోపంతో కొందరు దాడి చేశారు

ఆ చుట్టుపక్కల వారితో బీబీసీ ప్రతినిధి మాట్లాడుతుంటే ఎరుపు, బూడిద రంగు స్వెట్టర్లు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు చుట్టుముట్టారు. గట్టిగా అరుస్తూ బెదిరించారు. బిగ్గరగా కేకలేస్తూ మరికొంతమందిని పోగు చేశారు.

కాళ్లు, చేతులు విరగ్గొట్టేస్తామని, ఇక్కడినుంచీ వెళ్లకపోతే కాళ్ల కింద భూమిని పెకిలించేస్తామని బెదిరించారు. ప్రెస్ కార్డ్ మీద బీబీసీ పేరు చూడగానే వీళ్లు మరింత కోపంతో ఊగిపోయారు.

ఇదంతా ప్రధాన రహదారికి ఒక 15 మీటర్ల దూరంలోనే జరిగింది. రోడ్డు మీదకి వెళ్ళడానికి దారి లేనంతమంది జనం అక్కడ గుమికూడారు. ముందుకి వెళుతుంటే వెనుక నుంచీ పెద్ద పెద్దగా తిడుతూ అరుస్తున్నారు. ఆ వీధినుంచీ బయటపడుతుంటే వెనుకనుంచి కొట్టారు కూడా. ఆ కొద్ది దూరం నడవగానే, బీఎస్ఎఫ్ జవాన్లు కనిపించారు. దాంతో బీబీసీ ప్రతినిధి ఊపిరి పీల్చుకున్నారు.

జవాన్లకు ప్రెస్ కార్డ్ చూపించి సహాయం అడిగారు. అయితే, కొడుతున్నవాళ్లను జవాన్లు ఏమీ అనలేదు. ఎలాగోలా తప్పించుకుని ప్రధాన రహదారి చేరుకున్నారు. కానీ అక్కడికి కూడా కొంతమంది వచ్చి, చెయ్యి పట్టుకుని మళ్లీ ఆ వీధిలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అప్పుడే మరో టీవీ విలేఖరి, బీబీసీ ప్రతినిధి చెయ్యి పట్టుకుని లాగి అక్కడనుంచీ తీసుకెళిపోయారు.

సాధారణ ప్రజలకు తమ వాదన చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఆ గుంపు దాడి చేసింది. రెండు వర్గాల గురించీ తెలిసిన ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోయారు. నిజాలు తెలుసుకుందామని వచ్చిన జర్నలిస్టుకు, జాగ్రత్త ఇక్కడనుంచీ వెళిపొమ్మని సలహా ఇవ్వడం తప్ప ఏమీ చేయలేకపోయారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the reason for Rinku Sharma's murder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X