• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా

By BBC News తెలుగు
|

డెల్టా వేరియంట్‌ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

భారత్ మరో కోవిడ్ వేరియంట్‌ను ఆందోళనకరమైన రకంగా గుర్తించింది. దీన్ని మొట్టమొదట యూరప్‌లో గుర్తించారు.

సులభంగా సోకడం, తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించడం, యాంటీబాడీలతో అదుపు చేయడం కష్టమవడం, వైరస్‌తో నియంత్రించడం.. చికిత్సతో నయం చేయడం కష్టమడం వంటి ప్రమాదకర లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌కి ఉన్నాయి.

డెల్టా ప్లస్ వేరియంట్ అని.. ఏవై1 అని పిలిచే ఈ కొత్త వేరియంట్ చాలా తొందరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని, ఊపిరితిత్తుల కణాలకు ఇట్టే అతుక్కుని దాడి చేస్తుందని, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి లొంగదని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి.

భారత్‌లో ప్రాణాంతకంగా పరిణమించి సెకండ్ వేవ్‌కి కారణమని భావిస్తున్న డెల్టా వేరియంట్‌కి ఈ కొత్త డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధం ఉంది.

మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని 6 జిల్లాల నుంచి సేకరించిన శాంపిళ్లలోని 22 శాంపిళ్లలో ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఏప్రిల్‌లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ 22లో 16 శాంపిళ్లు మహారాష్ట్రవే.

ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, రష్యా, చైనాల్లోనూ కనిపించింది.

డెల్టా ప్లస్‌ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కేటగిరీలో చేర్చడాన్ని వైరాలజిస్టులు కొందరు ప్రశ్నిస్తున్నారు. డెల్టా ప్లస్ మరింత ప్రమాదకరం అనడానికి ఆధారంగా ఇంకా తగినంత డాటా అందుబాటులో లేదని వారు వాదిస్తున్నారు

వైరస్‌లు నిత్యం మ్యుటేట్ అవుతూనే ఉంటాయి. కొన్ని మార్పులు స్వయంగా ఆ వైరస్‌కు కూడా హాని చేసేలా ఉండొచ్చు.

ఇలాంటి మ్యుటేషన్లలో కొన్ని ఆ వైరస్ వల్ల కలిగే వ్యాధిని మరింత ప్రాణాంతకంగా మార్చడం, సంక్రమణ శక్తిని పెంచడం చేస్తాయి. ఇలాంటి ప్రమాదకర మ్యుటేషన్లే ప్రబలుతాయి.

అయితే, డెల్టా ప్లస్‌ను 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' కేటగిరీలో చేర్చడాన్ని వైరాలజిస్టులు కొందరు ప్రశ్నిస్తున్నారు. డెల్టా ప్లస్ మరింత ప్రమాదకరం అనడానికి ఆధారంగా ఇంకా తగినంత డాటా అందుబాటులో లేదని వారు వాదిస్తున్నారు.

''22 డాటా సీక్వెన్స్‌ల ఆధారంగా దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా చెప్పలేం'' అని వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ అన్నారు.

''వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా దీన్ని పరిగణించాలంటే మరింత క్లినికల్, బయలాజికల్ సమాచారం అవసరం'' అన్నారామె.

డెల్టా ప్లస్ వేరియంట్ ను ప్రమాదకరమైనదిగా పరిగణించాలంటే మరికొన్ని ఆధారాలు కావాలని వైరాలజిస్టులు అంటున్నారు.

''ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల కోవిడ్‌ బారిన పడిన వందల మంది రోగులపై అధ్యయనం చేసి వారిలో వ్యాధి తీవ్రత డెల్టా వేరియంట్ బాధితుల కంటే ఎక్కువ ఉందా.. వారి నుంచి సంక్రమణం కూడా ఎక్కువగా ఉందా? అనేది అధ్యయనం చేయాలి'' అన్నారు డాక్టర్ కాంగ్.

ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌లో కే417ఎన్ అనే మరో మ్యుటేషన్ ఉంది. ఈ మ్యుటేషన్ బీటా, గామా వేరియంట్లలోనూ కనిపించింది.

దక్షిణాఫ్రికాలో మొదటి వేవ్ సమయంలో బీటా వేరియంట్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రి పాలవడం, చనిపోవడం గుర్తించారు.

బ్రెజిల్‌లో ప్రబలిన గామా వేరియంట్ మిగతావాటి కంటే ఎక్కువగా సంక్రమించింది.

డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించి సీఐఎస్ఏఐడీ డాటా బేస్‌లో 166 ఉదాహరణలున్నాయి. అయితే, లూసియానా స్టేట్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్‌కు చెందిన సైంటిస్ట్ డాక్టర్ జెరెమీ కామిల్ మాత్రం ''డెల్టా వేరియంట్‌‌తో పోల్చితే డెల్టా ప్లస్ మరింత ప్రమాదకరం అనడానికి తగిన కారణం కనిపించడం లేదు'' అన్నారు.

''గతంలో కరోనా వైరస్ సోకినవారు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, టీకా తీసుకోని వారికి ఇది సోకే అవకాశాలు ఎక్కువ''ని కామిల్ అన్నారు.

డెల్టా ప్లస్ వేరియంట్ గురించి ఆందోళన అవసరం లేకపోయినా జాగ్రత్తగా ఉండటం మంచిదేనని కొందరు నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో జినోమ్ సీక్వెన్సింగ్ చేసే 28 ల్యాబ్‌లలో ఒకటైన దిల్లీలోని సీఎస్ఐఆర్-ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ''డెల్టా వేరియంట్ పరంపర మొత్తం ఆందోళనకరమైనదే.. కాబట్టి డెల్టా ప్లస్‌ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా పరిగణించడం అసాధారమేమీ కాదు'' అన్నారు.

''డెల్టా ప్లస్ వేరియంట్ ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోందనడానికి ఆధారంగా మా దగ్గర సూచికలేమీ లేవు ప్రస్తుతానికి.. అంత ఆందోళనకరమైన పరిణామాలేవీ లేవు ఇప్పటికి.. కానీ, దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నాం. ప్రజారోగ్య వ్యవస్థలన్నిటినీ బలోపేతం చేస్తున్నాం'' అన్నారు అనురాగ్ అగర్వాల్.

''డెల్టా వేరియంట్ ప్రబలినప్పుడు చేతులెత్తేసిన భారత్ ఇప్పుడు అలా జరగకుండా కాస్త ఎక్కువగా స్పందిస్తోంది'' అన్నారు డాక్టర్ కామిల్.

''నేనేమీ దీని విషయంలో ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. అయతే, దీనిపై ఒక కన్నేసి ఉంచడంలో తప్పేమీ లేదు'' అన్నారు కామిల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Delta Plus: Should the world be afraid of this new variant of the Covid-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X