లాక్ డౌన్ వేళ ఆ బీర్ల కోసం కొట్లాట ... వాటికీ కొరతే !!
దేశ వ్యాప్తంగా మద్యం దొరక్క మందుబాబులు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు . ఇక ఈ క్రమంలో బీర్లకు బదులుగా జీరో ఆల్కాహాల్ బీర్లు , ఆల్కాహాల్ ఫ్రీ బీర్లు సూపర్ మార్కెట్ లలో దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్ ల వద్ద లైన్ లో వేచి ఉండి మరీ జనాలు జీరో ఆల్కాహాల్ బీర్ల కోసం ఎగబడుతున్నారు. స్టాక్ వచ్చిందంటే చాలు నిముషాల మీద ఖాళీ చేస్తున్నారు. నిత్యావసరాలు, అత్యవసరాలు మినహా మద్యం షాపులతో సహా అన్ని బంద్ కొనసాగుతున్న నేపధ్యంలో బీర్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న జీరో ఆల్కాహాల్ బీర్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు.
గూగుల్ తల్లిని నమ్ముకుని తెగబడ్డ మందుబాబులు .. ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ !!
జీరో ఆల్కాహాల్ బీర్స్, ఆల్కహాల్ ఫ్రీ బీర్స్ కు విపరీతమైన డిమాండ్
కరోనా రాక ముందుతో పోలిస్తే జీరో ఆల్కహాల్ బీర్స్, ఆల్కహాల్ ఫ్రీ బీర్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక ఇప్పటి వరకు చాలా మందికి ఆల్కాహాల్ ఫ్రీ బీర్లు ఉంటాయని కూడా తెలీదు . కానీ ఇప్పుడు అందరూ బీర్లకు ప్రత్యామ్నాయం ఇవే అని తెలుసుకుని తెలియని జనాలు కూడా ఇప్పుడు వాటిని ఎగబడి కొంటున్నారు. సూపర్ మార్కెట్ల లో కూల్ డ్రింక్స్ లాగా ఉండే ఈ జీరో ఆల్కాహాల్ బీర్లు ఇప్పుడు ఎక్కడా కనిపించని పరిస్థితి. బెస్ట్ ప్రైజ్ వంటి పెద్ద సూపర్ మార్కెట్ లలో కూడా వచ్చిన స్టాక్ వచ్చినట్టే క్షణాల్లో మాయమవుతున్నాయి.
ఒకప్పుడు నాన్ ఆల్కాహాలిక్ లు మాత్రమే తాగిన బీర్లకు ఇప్పుడు పెద్ద పోటీ
వైన్స్ ల్లో దొరికే బీర్ బ్రాండ్స్ తరహాలో జీరో ఆల్కహాల్ బీర్లు మార్కెట్లో ఉన్నా ఏ కొద్దిమందికో తెలుసు , కానీ ఇప్పుడు వాటి కోసమే షాపులకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కింగ్ ఫిషర్, హెన్ కెయిన్, కూల్ బర్గ్ , బడ్ వైజర్ ... వంటి బ్రాండ్స్ రకరకాల పేర్లతో రకరకాల ఫ్లేవర్లలో ఆల్కహాల్ ఫ్రీ బీర్లను తయారు చేశాయి. మింట్ , మాల్ట్, స్ట్రాబెర్రీ , క్రాన్ బెర్రీ ఫ్లేవర్ లలో ఆల్కాహాల్ పర్సంటేజ్ ఏమాత్రం లేకుండా కూల్ డ్రింక్స్ మాదిరిగా వీటిని తయారుచేసి మార్కెట్ లో విక్రయిస్తున్నా ఇంత కాలం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
అచ్చం బీర్ తాగిన ఫీలింగ్ కలిగించే జీరో ఆల్కాహాల్ బీర్స్
ఎవరో కొద్ది మంది నాన్ ఆల్కాహాలిక్ లు మాత్రమే వీటిని కొనుగోలు చేసేవారు.లాక్ డౌన్ తో నెలరోజులకు పైగా వైన్స్ లు, బార్లు మూతపడిన నేపధ్యంలో మద్యం చుక్క దొరకాలంటే కష్టంగా మారిపోయింది. నాలుగు రెట్లు ధరలు పెంచి బ్లాక్ లో విక్రయిస్తున్నారు. దీంతో మద్యం కొనుగోలు చేసేలా లేరు. ఇక ప్రత్యామ్నాయంగా కల్లును,ఈ జీరో ఆల్కాహాల్ బీర్ లపై దృష్టి పెడుతున్న మందుబాబులు కిక్కు ఇవ్వకపోయినా తాగుతుంటే మాత్రం అచ్చం బీర్ తాగిన ఫీలింగ్ కలిగించే ఈ జీరో ఆల్కాహాల్ బీర్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఫ్లేవర్ , టేస్ట్ , వాసన ఉంటే కిక్కు లేకున్నా ఓకే
70,80 రూపాయలకు ఒక టిన్ మార్కెట్లో లభిస్తున్న కారణంగా ఈ బీర్లనూ తెచ్చి ఇంట్లో పెట్టుకుని తాగుతున్న వాళ్ళు కొందరైతే, కేవలం వీటికోసమే ఎక్కడ స్టాక్ ఉందొ కనుక్కుని మరీ వెళ్తున్న వారు పెరిగిపోయారంటే ఈ బీర్లకు ఉన్న డిమాండ్ అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మందుబాబులు మాత్రం ఆల్కాహాల్ అయినా నాన్ ఆల్కాహాల్ అయినా ఆ ఫ్లేవర్ ఉంటే చాలు,వాసన వస్తే చాలు అన్న ఫీలింగ్ లో ఉన్నారు.