• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీర్‌: 'కొన ఊపిరితో ప్రజాస్వామ్యం... స్తంభించిన రాజకీయ ప్రక్రియ' : విశ్లేషణ

By BBC News తెలుగు
|
కశ్మీర్ రాజకీయాలు

గత ఏడాది ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచీ. అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.

2015 మార్చిలో జమ్ము-కశ్మీర్‌లో విరుద్ధ భావజాలాలు ఉన్నబీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు, దానిని ప్రజాస్వామ్యంలో ఒక కొత్త ప్రయోగంలా చూశారు. 2018 జూన్‌లో ఆ పొత్తు తెగిపోయింది. రాష్ట్రం మరోసారి గవర్నర్ పాలనలోకి వెళ్లింది. 2018 డిసెంబర్‌లో ఇక్కడ రాష్ట్రపతి పాలన అమలు చేశారు.

ఒకవైపు జమ్ము-కశ్మీర్ ఎన్నికలు జరపాలని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరుగుతుంటే, మరోవైపు దిల్లీలో వేరే స్క్రిప్ర్ రాస్తూ వచ్చారు. తర్వాత హఠాత్తుగా 2019 ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్రం, దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండే నేతలను అదుపులోకి తీసుకుని వారిని నిర్బంధంలో ఉంచారు. కఠిన లాక్‌డౌన్ అమలు చేశారు.

ఆగస్టు తర్వాత జమ్ము-కశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. దానిని దిల్లీ నుంచి నియమించిన ప్రతినిధి పాలిస్తున్నారు. అసెంబ్లీ ఉనికిలో లేకపోవడంతో అక్కడ రాజకీయాలకు ఎలాంటి కేంద్రం లేకుండా పోయింది.

ఇప్పుడు ఏడాది తర్వాత కశ్మీర్‌లో అసలు ప్రజాస్వామ్యం ఇంకా మిగిలి ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన. అంటే ప్రజలు తమ కోసం ఒక నిర్ణయం తీసుకోవడం. వారు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చట్టాలు చేసి, ప్రభుత్వాన్ని నడుపుతారు.

“కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం ఇప్పుడు కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది”. అని కశ్మీర్ సీనియర్ జర్నలిస్ట్, కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనూరాధా భసీన్ భావిస్తున్నారు.

రాజ్యసభలో అమిత్ షా

నేతలు జైల్లో, రాజకీయ వర్గాల మౌనం

“గత ఏడాదిగా కశ్మీర్‌లో పూర్తి నిశ్శబ్దం ఉంది. ఆ తర్వాత కొంతమంది మెల్లమెల్లగా మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ ప్రధాన రాజకీయాలు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచిన రాజకీయ నేతలు ఇప్పటికీ అదుపులో లేదా గృహనిర్బంధంలో ఉన్నారు” అని భసీన్ చెప్పారు.

“కొంతమందికి మాట్లాడే అనుమతులే ఉన్నాయి. కొంతమందికి అది కూడా లేదు. మాట్లాడేవారు కూడా పరిమితంగా ఉన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడం అనేది ప్రధాన అంశం. కానీ, దానిపై ఎవరూ మాట్లాడ్డం లేదు. రాజకీయ వ్యక్తీకరణపై నిషేధం ఉన్నంతవరకూ, దాని పరిధి పరిమితంగానే ఉంటుంది. కొంతమందికి కొన్ని అంశాలపై మాట్లాడ్డానికే అనుమతి ఉంది. అలాంటప్పుడు ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే, రాజకీయ ప్రక్రియ ఎక్కడ నుంచి మొదలవుతుంది అనే ఆశలే కనిపించవు” అన్నారు.

ఆమెతో ఏకీభవించిన శ్రీనగర్‌ బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ కశ్మీర్లో అతిపెద్ద అంశంపైనే ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. ఇక రాజకీయాలు, ప్రజాస్వామ్యం గురించి ఎవరు పట్టించుకుంటారు అన్నారు.

“కశ్మీర్‌ రాజకీయాల్లో అతిపెద్ద అంశం జమ్ము-కశ్మీర్‌కు రాజ్యాంగం ద్వారా లభించిన ప్రత్యేక ప్రతిపత్తి. దానిపై ఇప్పుడు ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. 2019, ఆగస్టు 5న ఒక పెద్ద భవనం నిట్టనిలువునా కూలినట్టు అనిపించింది. స్వయం ప్రతిపత్తి లేదా ఇండియన్ యూనియన్ కింద లభించిన జమ్ము-కశ్మీర్ ప్రత్యేక హోదాను కాపాడుకోవడం కశ్మీర్ రాజకీయాల్లో అతిపెద్ద అంశం” అన్నారు.

ఒమర్ అబ్దుల్లా

ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది?

“కశ్మీర్‌లో అగ్ర నేతలు ఇదే అంశంపై రాజకీయం చేస్తూ వచ్చారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయగానే, వారందరూ పూర్తిగా మౌనం దాల్చారు. వారిని గృహనిర్బంధంలో ఉంచారు. లేదంటే అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని జైళ్లలో కూడా పెట్టార”ని రియాజ్ చెప్పారు.

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. అక్కడి నేతలు దానికి వ్యతిరేకంగా నిరసనలు చేయలేకపోయారు. ఆ అంశం గురించి మాట్లాడవద్దని వారిదగ్గర బాండ్ రాయించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు రాజకీయాలు చేయగలరు. అవి ఎలా నడుస్తాయి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగించగలదు.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, తీవ్రవాదం అంతమైందని భారత ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వం వాదనకు సమాధానంగా “కశ్మీర్‌లో మిలిటెన్సీ(తీవ్రవాదం) వల్లే ఆర్టికల్ 370 ఉందని వారు వాదించారు. ఇప్పుడు ఆ ఆర్టికల్ తొలగించాక, ఆ మిలిటెన్సీ అంతం కాలేదు, బదులుగా మరింత పెరిగింది. గణాంకాలను చూస్తే తీవ్రవాదం పెరిగినట్లే కనిపిస్తోంది” అని భసీన్ చెప్పారు.

కశ్మీర్

తీవ్రవాదులను చంపితే, తీవ్రవాదం అంతం కాదు

తీవ్రవాదులను చంపినంత మాత్రాన తీవ్రవాదం అంతం కాదని భసీన్ భావిస్తున్నారు.

“ప్రభుత్వం 150 మందికి పైగా మిలిటెంట్లను కాల్చిచంపామని, అందుకే తీవ్రవాదం తగ్గిపోయిందని చెబుతోంది. కానీ అదే సంఖ్యలో మిలిటెంట్లు పెరుగుతున్నారు. చాలా మంది యువకులు కనిపించడం లేదు, కొంతమందిని ఎన్‌కౌంటర్లో కాల్చి చంపారు” అన్నారు.

జమ్ము-కశ్మీర్‌లో గ్రాస్‌రూట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని, దానికోసం పంచాయతీ స్థాయి నుంచి పై వరకూ రాజకీయ నేతల కొత్త తరాన్ని సిద్ధం చేస్తామని దేశ హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలాసార్లు చెప్పారు.

“గత రెండు నెలల్లో ఇద్దరు పంచాయతీ సభ్యులు చనిపోయారు. ఒకవైపు ప్రభుత్వం పంచాయతీ స్థాయిలో రాజకీయాలను బలోపేతం చేస్తామని చెబుతున్నా, అక్కడ అసలు భద్రతే ఉండడం లేదు” అని అనూరాధా భసీన్ అంటున్నారు.

జమ్ము-కశ్మీర్ ఈమధ్య రాజకీయ ఔత్సాహికులు పూర్తిగా కనిపించడ లేదు. చురుగ్గా కనిపించే నేతలు కూడా ప్రకటనలకే పరిమితం అయ్యారు.

షా ఫైజల్

కొత్త రాజకీయ నిర్మాణం

కశ్మీర్‌లో ఒక కొత్త పార్టీ ఉనికిలోకి వచ్చింది. దాని పేరు 'అప్నా పార్టీ’. ఇంతకు ముందు పీడీపీలో కార్యకర్తల నుంచి మంత్రుల వరకూ ఉన్నవారు ఈ పార్టీలోకి వచ్చేశారు. పీడీపీ నుంచి విడిపోయిన వీరంతా ఒక ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు. దీనికి నాయకుడు అల్తాఫ్ బుఖారీ.

బుఖారీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. కొన్నిసార్లు ఆయన గొంతు కచ్చితంగా వినిపిస్తుంటుంది. కానీ, ఆయన రాజకీయాలు తను చేసిన ప్రకటనలు పత్రికల్లో వచ్చే వరకే పరిమితం అయ్యాయి.

బుఖారీ రోడ్లు వేయించడం, ఉపాధి కల్పించడం లాంటి ప్రకటనలకే పరిమితం అవుతారు. ఆయన కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి లేదా ప్రజాస్వామ్య స్వతంత్రం గురించి మాట్లాడడం ఎప్పుడూ వినిపించదు.

కశ్మీర్‌లో మిలిటెన్సీని అంతం చేయడం ద్వారా ఒక కొత్త రాజకీయ నిర్మాణాన్ని సిద్ధం చేస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు.

“మీరు ప్రతి అంశాన్ని దిల్లీ నుంచి నియంత్రించే రాజకీయ నిర్మాణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే, అలాంటి రాజకీయాలకు, ప్రజాస్వామ్యంతో సమన్వయం కుదరదు. రాజకీయ ప్రక్రియ ప్రారంభించడం ఎంత ఆలస్యం అయితే, ప్రజల్లో అంత ఆగ్రహం పెరుగుతుంది” అని అనూరాధా భసీన్ భావిస్తున్నారు.

కశ్మీర్ లోయలో రాజీవ్ గాంధీ కాలం నుంచి ప్రజల సెంటిమెంట్, దిల్లీ ప్రభుత్వ విధానాల మధ్య పొసగడం లేదు. రాష్ట్రంలో ఒకసారి వ్యతిరేకత అణచివేస్తే, మరోసారి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కానీ, అది పూర్తిగా ఎప్పుడూ అంతం కాలేదు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కూడా అది అణచివేతకు గురైంది. అంతం కాలేదు.

కశ్మీర్ ప్రజల్లో గత ఏడాది తీసుకున్న నిర్ణయాల్లో ఏ స్థాయిలోనూ తమను చేర్చలేదని కశ్మీర్ ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఆ నిర్ణయాలు సరైనవేనా, తప్పా అనేది వేరే విషయం. కానీ ఎక్కడా కశ్మీర్ ప్రజలను అందులో చేర్చలేదు.

“ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఆ ప్రభుత్వంలో భాగం కావడం. కశ్మీర్‌లో ఇప్పుడు అలా అసలు లేదు. కశ్మీర్‌లో ఇద్దరు ముగ్గురు సలహాదారులు గవర్నర్‌తో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. చట్టాలు చేయడంలో, ప్రభుత్వ నిర్ణయాలలో ప్రజలకు ఎలాంటి భాగస్వామ్యం లేదు” అని రియాజ్ మస్రూర్ అన్నారు.

మెహబూబా ముఫ్తీ

వేర్పాటువాదులు, ప్రధాన రాజకీయాలు

2018 జూన్‌లో గవర్నర్ పాలనతోపాటూ అసెంబ్లీని కూడా రద్దు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌లో ఇప్పటివరకూ ఎన్నికలు జరిగే అవకాశాలేవీ కనిపించడం లేదు. అసలు భవిష్యత్తులో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలవుతుందా, దాని స్వరూపం ఎలా ఉంటుందో కూడా తెలీడం లేదు.

“కశ్మీర్‌లో భారత్‌కు మద్దతిచ్చే నేతలందరినీ గృహనిర్బంధంలో ఉంచారు, లేదంటే అదుపులోకి తీసుకున్నారు. బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వం నడిపిన మెహబూబా ముఫ్తీ ఇప్పటికీ విడుదల కాలేదు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఆమె కస్టడీని మూడు నెలలు పొడిగించారు. అలాంటప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజకీయాలు ఎలా సాధ్యం అవుతాయి” అని రియాజ్ ప్రశ్నించారు.

గత 73 ఏళ్లలో కశ్మీర్ రాజకీయాలు రెండు భావజాలాలుగా విడిపోయాయి. ఒకరు వేర్పాటువాదులు అయితే, మరొకరు భారత్‌కు మద్దతు ఇచ్చే వారు. ఇప్పుడు వేర్పాటువాదులు, ప్రధాన రాజకీయాల్లో ఉన్నవారికి ఏ తేడా లేకుండా పోయింది. అలాంటప్పుడు కశ్మీర్‌లో మళ్లీ రాజకీయ ప్రక్రియ మొదలవడం అంత సులభం కాదు.

పార్టీల్లో ఉన్నవారికి గ్రామాల నుంచి పట్టణాల వరకూ ప్రతి స్థాయిలో ఒక కనెక్షన్ ఉంటుంది. ఆగస్టు 5 తర్వాత అది లేకుండా పోయింది. ఇప్పుడు నేతలెవరూ కనిపించడం లేదు. ఏ నేతా ఎవరినీ కలవడం లేదు. ప్రజలకు, నేతలకు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి” అంటారు రియాజ్.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సైఫుద్దీన్ సోజ్‌ గురించి సుప్రీంకోర్టుకు వివరించిన ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, కానీ, ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని తెలిపింది.

“కశ్మీర్‌లో హింస ఉంది, తీవ్రవాదం ఉంది. మా పార్టీకి చెందిన చాలామంది కార్యకర్తలు హత్యకు కూడా గురయ్యారు. అయినా నేను భారత్‌కు మద్దతిస్తూనే వచ్చాను. ఇప్పుడు, నన్ను కూడా నిర్బంధంలో ఉంచారు” అని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే చెప్పారు.

ఒమర్ అబ్దుల్లా

ప్రజల నమ్మకం గెలుచుకోవాలి

ప్రస్తుత సమయంలో ప్రభుత్వం, ప్రజల మధ్య నమ్మకం అనేదే లేకుండా పోయింది. ఆ నమ్మకం ఏర్పడేలా చేసేవరకూ అక్కడ ప్రజాస్వామ్యాన్ని బతికించడం సాధ్య కాదు అని అనూరాధా భసీన్ అభిప్రాయపడ్డారు.

“కశ్మీర్ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం పోయింది. కశ్మీర్ ప్రజలకు పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చేవరకూ, వారికి మళ్లీ నమ్మకం ఏర్పడదు. కనీసం అగ్ర నేతలకైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటే, ప్రజలపై సానుకూల ప్రభావం పడుతుంది” అన్నారు.

“రాజకీయ నేతలు ఆరు నెలలు, తొమ్మిది నెలలపాటు అదుపులో ఉండి వచ్చారు. వారిలో ఒక రకమైన భయం ఉండచ్చు. నేతలు మాత్రమే మౌనంగా లేరు, ఇక్కడ అధికారుల్లో కూడా ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. అధికారులు ఎవరూ, ఏ ప్రశ్నకూ.. ఏ రూపంలోనూ సమాధానం ఇవ్వడం లేదు” అంటారు భసీన్.

మీడియా స్వేచ్ఛ కూడా బలమైన ప్రజాస్వామ్యానికి సంకేతం. కశ్మీర్‌లో ప్రస్తుతం మీడియాపై కూడా చాలా రకాల ఆంక్షలు ఉన్నాయి. సమాచారం సేకరించడం చాలా కష్టంగా మారింది.

“పరిస్థితులు ఎలా మారాయంటే, ఎంత సీనియర్ జర్నలిస్టైనా అధికారులను కలిసి, దీనికి సంబంధించి ఏదైనా ప్రశ్నిస్తే, వారు అసలు పట్టించుకోవడం లేదు. ఏదీ జరగనట్టే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఎలా ఊపిరి తీసుకోగలదు” అంటారు అనూరాధ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Democracy in danger in Kashmir,Political procees comes to a freeze
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X