వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు పాచిక: కొండను తవ్వి ఎలుకను బట్టినట్లు..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీ.. రాత్రి 9 గంటలు! 'నేటి నుంచి పెద్దనోట్లు రద్దు' అని ప్రధాని మోదీ ప్రకటించగానే సామాన్యులు సంబరపడ్డారు. ఇక 'డబ్బున్నోళ్ల పని అయిపోయినట్లే' అని అనుకున్నారు. ఆ డబ్బు ప్రధాని మోదీ తమ జన్‌ధన్‌ ఖాతాల్లో వేస్తారని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి.

'పెద్దనోట్ల రద్దు ఒక విఫల ప్రయోగం కానున్నది' అని జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల విశ్లేషణే ఇప్పుడు నిజమవుతోంది. రద్దయిన నోట్లు 99 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. రాని సొమ్ము విలువ కేవలం రూ.16 వేల కోట్లేనని తేల్చింది. ఉన్న వాడి డబ్బు పోలేదు. లేని వాడి వద్దకు రాలేదు. అసలు నల్లధనమన్నది ఉందో? లేదో? అని తెలియని మాయగా మారింది.

రద్దయిన పాత 500, వెయ్యి నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు! ఇందులో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు నల్లధనం ఉంటుందని, అదంతా తిరిగి రాదని భావించింది మోదీ సర్కార్. ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు బ్యాంకులకు రాని రూ.3/4 లక్షల కోట్ల నగదు ప్రభుత్వానికి మిగిలినట్లేనని భావించారు ఈ మొత్తాన్ని ఆర్బీఐ డివిడెండ్‌ రూపంలో సర్కార్‌కు అందజేస్తుందని లెక్కలు వేశారు.

సుప్రీంలో ఇలా పిటిషన్ వేసిన కేంద్రం

సుప్రీంలో ఇలా పిటిషన్ వేసిన కేంద్రం

రూ. 3 నుంచి రూ. 4 లక్షల కోట్ల నగదు తిరిగి రాదని ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఇప్పుడా లెక్కలన్నీ ఘోరంగా తప్పాయి. ప్రభుత్వానికి మిగిలింది 16వేల కోట్లే! రద్దయిన నోట్లలో దాదాపు 99 శాతం బ్యాంకింగ్‌లోకి తిరిగి వచ్చిందంటే, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ పెద్దలు అంచనావేసిన స్థాయిలో ఆర్థిక రంగంలో నల్లధనం నగదు రూపంలో లేదని భావించాలి. 500, 1000 రూపాయల నోట్ల రూపంలోని నల్లధనాన్ని అక్రమార్కులు విజయవంతంగా ఆర్థిక రంగంలోకి ప్రవేశపెట్టారని అనుకోవాలి. ఇందులో ఏది నిజమైనా సర్కార్ ఘోర వైఫల్యాన్నే అది సూచిస్తుంది. తప్పుడు అంచనాతో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి ఉంటే ప్రజలకూ, ఆర్థిక రంగానికి జరిగిన నష్టానికి ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉంటుంది.

ఇతర మార్గాల్లో ఆదాయం పెంపునకు ఐటీ నజర్

ఇతర మార్గాల్లో ఆదాయం పెంపునకు ఐటీ నజర్

ఇంకో గమ్మత్తేమిటంటే పాత రూ.500 నోట్లు ఎన్ని తిరిగి బ్యాంకుకు వచ్చాయన్న సంగతే ఆర్బీఐ బయట పెట్టలేదు. అంటే ఇందులో ఏదో మతలబు ఉన్నదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘నోట్ల రద్దు' నిర్ణయం ఆశించిన ఫలితాలివ్వకపోవడంతో ఖజానాను భారీగా నింపుకునే మార్గాలపై ద్రుష్టి సారించింది కేంద్ర ఆర్థికశాఖ. ఇప్పటివరకు ఆదాయం పన్ను శాఖకు ఏటేటా ‘ఐటీ రిటర్న్స్' దాఖలు చేసిన వారి వివరాలపై ‘నిఘా నేత్రం' పెట్టింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బీమా సంస్థల్లో దాచి పెట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా, వాటిపై వచ్చే ఆదాయంపైనా ఐటీ శాఖ కన్నుపడింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఏటా రూ. 5 లక్షలు దాటిన వారిపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైంది. కొందరికి ఈ - మెయిల్స్, లేఖలు వెళ్లాయి కూడా.

నల్లధనం వెలికితీతకు జైట్లీ వివరణ ఇలా

నల్లధనం వెలికితీతకు జైట్లీ వివరణ ఇలా

ఇక న్యాయవాదులు, వైద్యులు తదితర నిపుణులు తమ సేవలకు నగదుపై రుసుము పొందే నిపుణుల ఆదాయాన్ని కూడా వదిలి పెట్టడం లేదు. ప్రత్యేకించి వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గున్యా తదితర వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన వారు రూ. లక్షల్లో ఫీజులు చెల్లించుకుంటే గానీ జబ్బు నయం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఫీజులన్నీ దాదాపుగా నగదు రూపంలోనే చెల్లిస్తున్నారు. కనుక సదరు డాక్టర్లు తమ ఆదాయం పూర్తి వివరాలను ఐటీ రిటర్న్స్ లో చూపడం లేదని ఐటీ శాఖ ఇటీవల జరిపిన దాడుల్లో గుర్తించిందన్న మాట. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం అమలుజేస్తున్నవిధానాల తీరు. నోట్ల రద్దు వల్ల జరిగిన మేలేమీ లేకపోయినా రెండు నెలల పాటు సామాన్యుడు రోజువారీ ఖర్చుల కోసం పడ్డ అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు.

కానీ 99 శాతం నోట్లు బ్యాంకుకు వచ్చాయని ఆర్బీఐ ప్రకటించిన తర్వాత ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలేమిటని సహజంగానే విపక్షాలు ప్రశ్నిస్తాయి. అదే పని చేసిన విపక్షాలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ కూడా వింతగానే ఉంది మరి. నోట్ల రద్దు ఆశయం నల్లధనాన్ని అరికట్టడమేనని, ప్రజల సొమ్మును తీసుకోవడం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఆర్బీఐ నివేదికపై ఆయన స్పందిస్తూ కేవలం ఒక్క లక్ష్యంతోనే కాకుండా పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పన్నులు వసూళ్లు పెరగడం ద్వారా మిగిలిన లక్ష్యాలన్నీ నెరవేరాయని అన్నారు. ‘ఎంత సొమ్ము తిరిగి వచ్చిందన్నది' నోట్ల రద్దు అసలు లక్ష్యం కాదన్నారు. కానీ ఆ అసలు లక్ష్యమేమిటో స్పష్టంగా ఇప్పటికీ బయటపెట్టలేదు. డిపాజిట్‌ అయిన పెద్ద నోట్లలో గణనీయమైన భాగం లెక్కల్లో వెల్లడించని సొమ్ము/నల్లధనం కావచ్చన్నారు.

విపక్షాలపై జైట్లీ ఇలా ఎదురుదాడి

విపక్షాలపై జైట్లీ ఇలా ఎదురుదాడి

నల్లధనాన్ని వెలికితీయడం, నకిలీ నోట్లను నిర్మూలించడం, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం, పెద్దమొత్తంలో నగదుతో నడిచే భారత ఆర్థిక వ్యవస్థను నగదు రహితం దిశగా మళ్లించడమేనని అరుణ్ జైట్లీ తెలిపారు. పన్ను రిటర్నులతో సంబంధం లేకుండా పెద్ద మొత్తంలో నగదు జమ చేసినవారి గుట్టు రట్టు అయిందని, అలాంటి 18 లక్షల ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ దృష్టిసారించిందని గుర్తుచేశారు. ‘‘నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు, దేశంలో పన్ను విస్తృతిని పెంచడానికి మేం ప్రయత్నించాం. దానికి తగ్గట్టుగానే నోట్ల రద్దు అనంతరం ప్రత్యక్ష పన్ను పరిధిని విస్తరణ మొదలైంది'' అన్నారు. ఎన్నికల్లో నల్లధనం వినియోగాన్ని అడ్డుకోవడమే తాము చేపట్టబోయే తదుపరి చర్య అని చెప్పారు. నల్లధనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనివారే నోట్లరద్దును వెనుకకు వచ్చిన కరెన్సీతో పోల్చి చూస్తున్నారని ఎదురుదాడికి దిగారు. నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదులకు అందే నిధుల్లో తగ్గుదల కనిపించిందని వివరించారు.

‘క్యాష్‌ లెస్‌' ఎక్కడ!

‘క్యాష్‌ లెస్‌' ఎక్కడ!

‘పెద్దనోట్ల రద్దు వల్ల మొత్తం డబ్బులు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయి' అని కేంద్రం సమర్థించుకోవచ్చు. కానీ... దీనికోసం నోట్ల రద్దువంటి సంచలన ప్రయోగం చేయనక్కర్లేదు. ఒకేసారి కోట్ల మంది భారతీయులను ‘రోడ్లపైకి' లాగక్కర్లేదు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడిలాంటి పథకాలను మళ్లీ మళ్లీ ప్రకటించవచ్చు. ‘‘ఫలానా తేదీ నుంచి పెద్దనోట్లు చెల్లవు. . ఆ తర్వాత ఐటీ, సీబీఐ దాడులతో విరుచుకుపడతాం. మీదగ్గరున్న లెక్కల్లేని సొమ్మును జమ చేయండి. 35 శాతం పన్నుతో వదిలేస్తాం'' అని చెబితే ఇంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేదని, ప్రజలకు కష్టాలు కూడా తప్పేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలంటూ హడావుడి సృష్టించారు. ఏటీఎంలను నింపకుండా, బ్యాంకుల్లో విత్‌డ్రాకు అనుమతించకుండా... డబ్బులు దొరక్కుండా చేసి జనానికి నరకం చూపించారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ‘క్యాష్‌ లెస్‌' నినాదాన్ని కాస్తా.. ‘లెస్‌ క్యాష్‌'గా మార్చారు. కొన్నాళ్లకు అది కూడా పోయింది. ఇప్పుడు అన్నిచోట్లా పుష్కలంగా నగదు అందుబాటులో ఉంటోంది. వెరసి... నగదు రహితమూ ప్రయోజన రహితంగానే మారినట్లే!

నకిలీ కరెన్సీ మాటేమిటి?

నకిలీ కరెన్సీ మాటేమిటి?

‘పెద్దనోట్లను రద్దు చేసిన వెంటనే కశ్మీర్‌లో రాళ్లు రువ్వడం ఆగిపోయింది' అని కేంద్రం ప్రకటించింది. అది ఎంత నిజమో... నోట్ల రద్దు జరిగిన వారానికే ఉగ్రవాదుల చేతికి కొత్త 2వేల నోట్లు దక్కడమూ అంతే నిజం! భద్రతా సిబ్బంది నిఘా పెరగడం, మిలిటెంట్లపై విరుచుకుపడటంవల్లే కశ్మీర్‌లో ఉగ్రవాదానికి కళ్లెం పడుతోంది. పాత నోట్ల రద్దు వల్ల మార్కెట్‌లో చలామణిలో ఉన్న నకిలీ కరెన్సీ మొత్తం మాయమైపోతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మాత్రం అక్షరాలా నిజమైంది! కేవలం నకిలీ కరెన్సీ అంతానికి ఇంత కసరత్తు చేయనక్కర్లేదన్నది నిపుణుల మాట! దశలవారీగా పాత నోట్లను రద్దు చేసి... వాటి స్థానంలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో కొత్తనోట్లను ప్రవేశపెడితే సరిపోయేదని వీరు అభిప్రాయపడుతున్నారు.

అవినీతిపరులు కొత్త నోట్లను లంచాల రూపంలో తీసుకుంటూనే ఉన్నారు. మొత్తంగా చూస్తే... పెద్దనోట్ల రద్దుతో ‘నల్లధనం నియంత్రణ' అనే ప్రాథమిక ఉద్దేశం అస్సలు నెరవేరలేదు. మిగిలిన ప్రయోజనాలూ పాక్షికంగానో, స్వల్పంగానో నెరవేరాయి. అందుకే... ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద విఫల ప్రయోగంగా నిలిచిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘గంప లాభం చిల్లి తీసింది' అని సామెత! నోట్ల రద్దుతో జరిగిందిదే. ఆర్బీఐ లెక్కల ప్రకారం పెద్దనోట్ల రద్దువల్ల ప్రభుత్వానికి మిగిలింది 16,050 కోట్లు. కానీ కొత్త 500, 2000 ముద్రణకు అయిన ఖర్చు సుమారు 8వేల కోట్లు! వాటి రవాణా, ఇతర ఏర్పాట్లకోసం మరో 2వేల దాకా ఖర్చయింది. అంటే... 16వేల కోట్లు మిగిలితే, 10వేల కోట్లు ఖర్చయిపోయాయన్న మాట! బ్యాంకుల సిబ్బంది శ్రమ, ప్రజల కష్టాలకు విలువ కట్టలేం.

ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్

ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్

నోట్ల రద్దు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి అవమానకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. ఆర్బీఐ నివేదికపై ఆయన ట్వీట్ల వర్షం కురిపించారు. ‘99 శాతం నోట్లను చట్టబద్ధంగా మార్చుకున్నారు. నల్లధనాన్ని సక్రమైనదిగా మార్చుకోవడానికే నోట్లను రద్దు చేశారా?.రూ.15,44,000 కోట్లను రద్దు చేస్తే అందులో రూ.16,000 కోట్లు మాత్రమే తిరిగి రాలేదు. ఇది 1% మాత్రమే. నోట్ల రద్దును సిఫార్సు చేసిన రిజర్వు బ్యాంకుకు ఇది సిగ్గుచేటు. ఆర్బీఐ రూ.16,000 కోట్ల మేర లబ్ధి పొందింది. కానీ కొత్త నోట్ల రద్దుతో రూ.21,000 కోట్లు నష్టపోయింది. ఆ ఆర్థిక శాస్త్రవేత్తలు నోబెల్‌ పురస్కారానికి అర్హులు' అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఆనంద శర్మ స్పందిస్తూ నోట్ల రద్దుకు సంబంధించిన లక్ష్యాల్లో ఒక్కటీ నెరవేరలేదన్నారు. కేంద్రం నిర్ణయం దేశంలో ఆర్థిక అరాచకాన్ని సృష్టించిందని మండిపడ్డారు. నల్లధనం ఎక్కడికి పోయిందో ఇప్పుడు ప్రధాని చెప్పగలరా?'' అని ప్రశ్నించారు. ప్రధాని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్ చేశారు.

ఆర్బీఐ గవర్నర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌కు ఎస్పీ రెడీ

ఆర్బీఐ గవర్నర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌కు ఎస్పీ రెడీ

నోట్ల రద్దుకు ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని జాతి క్షమించదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ట్వీట్ చేశారు. ‘99.9 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయి. వందలాది మంది క్యూ లైన్లలో చనిపోయారు. పేదలు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ప్రాణాలు, జీవికలు నష్టమయ్యాయి.. ఆర్థిక వ్యవస్థ షాక్‌కు గురైంది. కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇదంతా ఎందుకోసం? ఆర్థిక వ్యవస్థ షాక్‌కు గురయింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ జాతి వ్యతిరేక చర్యలను భారత్‌ ఎప్పుడూ క్షమించదు' అని పేర్కొన్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ స్పందిస్తూ 'రిజర్వు బ్యాంకు గవర్నర్‌ వూర్జిత్‌ పటేల్‌పై హక్కుల తీర్మానం ప్రవేశపెడుతాం. తిరిగి వచ్చిన నోట్ల సమాచారం ఇవ్వకుండా ఆయన పార్లమెంటరీ కమిటీని తప్పుదోవ పట్టించార''ని చెప్పారు.

ఐదు లక్ష్యాలు ప్రకటించిన ఆర్థికశాఖ

ఐదు లక్ష్యాలు ప్రకటించిన ఆర్థికశాఖ

‘‘నోట్ల రద్దే పెద్ద కుంభకోణం. దీని వెనుక రహస్య అజెండా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇదో పెద్ద వైఫల్యం'' అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘‘తిరిగి వచ్చిన నోట్లపై ఈ రోజు రిజర్వు బ్యాంకు లెక్కలు వెల్లడించింది. ఆ కార్యక్రమం (నోట్ల రద్దు) విజయవంతంగా అమలయింది. అందువల్ల దీనిపై చర్చను ముగింపు పలకాలి'' అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ట్వీట్ చేశారు. నోట్ల రద్దుకు అయిదు లక్ష్యాలు ఉన్నాయన్నది. నల్లధనాన్ని పారదోలి, నకిలీ నోట్లు ఏరివేసి, ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదుల నిధులు అందజేస్తున్న మూలాలను పెకిలించడం తమ నోట్ల రద్దు నిర్ణయానికి కారణాలని తెలిపింది. అసంఘటిత ఆర్థిక వ్యవస్థను సంఘటితంగా మార్చి, పన్ను చెల్లింపుదార్లు, ఉద్యోగాల విస్తృతిని పెంచడంతోపాటు నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రక్రియలో భాగంగా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడమని వివరించింది.

English summary
Nearly 10 months after Prime Minister Narendra Modi announced demonetisation, the Reserve Bank of India (RBI) has finally come out with provisional figures on the count of old Rs 500, Rs 1000 notes that were returned to the banking system. Evidently, the number would make neither the government, nor the central bank happy. It shows nearly all money has returned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X