loksabha polls 2019 petrol prices crude oil india diesel లోక్‌సభ ఎన్నికలు 2019 పెట్రోల్ ధరలు భారత్ డీజిల్
ఇదే ఆ రహస్యం: అక్కడ ముడిచమురు ధరలు పెరిగినా ఇక్కడ పెరగని పెట్రోల్ డీజిల్ ధరలు
సంవత్సరం పొడవునా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్క ఎన్నికల సమయంలో మాత్రమే స్థిరత్వాన్ని పాటిస్తున్నాయి. ఒక్కసారి అంతర్జాతీయ ఇంధనం ధరల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంటేనే మనదేశంలో కొండెక్కి కూర్చునే పెట్రోల్ డీజిల్ ధరలు... ఇప్పుడు పెద్ద మార్జిన్‌తో అంతర్జాతీయంగా ఇంధనం ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

భారత్‌లో ప్రభావం చూపని అంతర్జాతీయ ముడిచమురు ధరల పెరుగుదల
ఈ ఏడాది మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు అంతర్జాతీయ ఆయిల్ ధరలు ముడిచమురు బ్యారల్ ధర 71.73 డాలర్లుగా ఉంది. అయితే భారత్‌లో మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కేవలం 1శాతం కంటే తక్కువగా భారత్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ పరిస్థితి ఇంతకుముందెన్నడూ కనిపించలేదు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుదల లేదా తగ్గుదలపైనే భారత్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. అయితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అంతర్జాతీయ ఇంధనం ధరల ప్రభావం మనదేశంలోని పెట్రోల్, డీజిల్ ధరపై చూపదు.

పెట్రోల్ డీజిల్ ధరల విశ్లేషణ
జూలై 2017 నుంచి ఏప్రిల్ 2018 వరకు దేశంలోని ఇంధనం ధరలను విశ్లేషిస్తే.... ఆ సమయంలో అంతర్జాతీయ ముడిచమురు ధరల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా భారత్‌లో ఇంధనం ధరలు పెరిగిపోయాయి. ప్రతి నెలా 10వ తేదీ నుంచి మరుసటి నెల 10వ తేదీవరకు తీసుకున్న గణాంకాల ప్రకారం ఒక్కసారి అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో మాత్రమే ధరలు పెరగలేదు. ఆ తర్వాత మళ్లీ ధరల్లో వ్యత్యాసం కనిపించింది. ఇక 2018లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే ఏప్రిల్ మే నెలల మధ్య కూడా ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ సమయంలో అంతర్జాతీయ ముడిచమురు ధరలు 11శాతం పెరిగాయి. ఇక గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా అంటే డిసెంబర్ 2017లో అంతర్జాతీయ ముడిచమురు ధరలు 10శాతం పెరిగాయి. అయితే భారత్‌లో ఇంధన ధరలు మాత్రం పెరగలేదు. అక్టోబర్-నవంబర్ నెల మధ్య 2శాతం పెరిగిన పెట్రోల్ ధరలు ఆ తర్వాత నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో మళ్లీ 1శాతం తగ్గాయి.

ఇంధనం ధరలను నియంత్రణ కోసం ఎక్సైస్ సుంకం తొలగింపు
ఇక 2018 సెప్టెంబర్ -అక్టోబర్ మధ్యకాలంలో అంతర్జాతీయ చమురు ధరలు 8శాతం పెరిగాయి. అయితే దేశీయంగా పెట్రోల్ ధరలు 2శాతం పెరుగుదల నమోదు చేశాయి. అయితే లీటరుకు రూ. 2.50 ఎక్సైస్ సుంకం కేంద్రం తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో ధరల్లో తగ్గుదల కనిపించిందని చెప్పొచ్చు. పెరుగుతున్న ఇంధనం ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఎక్సైస్ సుంకాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ఆధారంగానే ఢిల్లీలో పెట్రోల్ ధరల మూవ్‌మెంట్‌ను విశ్లేషించడం జరిగింది.