రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకునే వరకు కదిలేది లేదు: సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీ , ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఇప్పుడు మూడు చట్టాలను రద్దు చేసిన తరువాత కూడా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తమ ఆందోళన సందర్భంగా తమపై నమోదు చేసిన కేసులను కేంద్రం ఉపసంహరించుకునే వరకు ఢిల్లీ సరిహద్దుల్లోని ప్రదర్శన స్థలాల నుండి కదలబోమని తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) శనివారం ప్రకటన విడుదల చేసింది. తమ డిమాండ్ లను కేంద్రం ముందు పెట్టిన రైతు సంఘం నాయకులు రైతుల మిగతా సమస్యలను కూడా పరిష్కరించాలని పట్టు బడుతున్నారు.

రైతులపై పెట్టిన అన్ని కేసులు వెనక్కు తీసుకోవాలని రైతు సంఘాల డిమాండ్
రైతుల నిరసనల భవిష్యత్తు గమనంపై చర్చించేందుకు హర్యానా మరియు ఢిల్లీ మధ్య సింగు సరిహద్దు సమీపంలో రైతు సంఘాల కిసాన్ సంయుక్త మోర్చా సమావేశం నిర్వహించిన తర్వాత తాజా ప్రకటన వచ్చింది. రైతు నాయకుడు దర్శన్ పాల్ సింగ్, మాట్లాడుతూ, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోని పక్షంలో అన్ని రైతు సంఘాల నాయకులు వెనక్కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని అన్నారు. రైతులపై ఉన్న అన్ని కేసులను వెనక్కి తీసుకుంటే తప్ప తాము ఆందోళనను వెనక్కి తీసుకోబోమని ఈ రోజు ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపబడ్డాయి అని ఆయన పేర్కొన్నారు

కనీస మద్దతు ధర, మరణించిన రైతు కుటుంబాల పరిహారం, కేసుల ఎత్తివేత డిమాండ్ లతో రైతుల ఆందోళన
సోమవారం, నిరసనలు చేస్తున్న రైతుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బిల్లు ఆమోదించబడింది. అయినప్పటికీ, పెండింగ్‌లో ఉన్న ఇతర డిమాండ్ల కోసం నిరసనకారులు ఒత్తిడి చేయడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది . ఇందులో కనీస విక్రయ ధర (MSP) చట్టం చెయ్యాలన్న డిమాండ్ ప్రధానంగా ఉంది , ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారంగా చెల్లించాల్సిన డబ్బుపై కూడా రైతులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నిరసనకారులపై కేసుల ఉపసంహరణ కూడా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రధాన అంశాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది.

మిగిలిన డిమాండ్ లపై ప్రభుత్వంతో చర్చించటానికి ఐదుగురు సభ్యుల ప్యానెల్
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా, ఇప్పుడు తమ మిగిలిన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. రైతు నాయకులు బల్బీర్ సింగ్ రాజేవాల్, అశోక్ ధావ్లే, శివకుమార్ కక్కా, గుర్నామ్ సింగ్ చదుని, యుధ్వీర్ సింగ్‌లను కమిటీ సభ్యులుగా నియమించారు.భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ ప్రకారం, సంయుక్త కిసాన్ మోర్చా యొక్క తదుపరి సమావేశం డిసెంబర్ 7 ఉదయం 11 గంటలకు జరుగుతుంది. అక్కడ వారు ఉద్యమం యొక్క భవిష్యత్తు గమనంపై మరింత చర్చించనున్నారు

ప్రభుత్వంతో తేల్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయన్న రైతు సంఘం నాయకులు
రైతు నాయకుడు మరియు సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు అశోక్ ధావ్లే మాట్లాడుతూ, అమరవీరులైన రైతులకు పరిహారం, రైతులపై "తప్పుడు కేసులు" మరియు లఖింపూర్ ఖేరీ హింస వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చించబడ్డాయని, ప్రభుత్వంతో రైతులు తేల్చుకోవాల్సిన మరికొన్ని అంశాలు ఉన్నాయని, వాటి పైన కూడా తెలుసుకున్న తర్వాతనే ఉద్యమాన్ని విరమిస్తామని వెల్లడించారు. మరి ప్రభుత్వంతో మళ్ళీ చర్చలు జరపనున్న నేపధ్యంలో ఈసారి చర్చల్లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.