• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్ లాక్‌డౌన్ మీ జ్ఞాపకశక్తిని దెబ్బ తీసిందా... ఎలాగో తెలుసుకుంటారా?

By BBC News తెలుగు
|

నలుగురితో కలవనివ్వని లాక్ డౌన్ కాలం మెదడుపై ప్రభావం చూపిందని పరిశోధనలు చెబుతున్నాయి

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మనం చాలా పనులు చేశాం. లాక్‌డౌన్‌ ఇప్పుడు లేదు. కానీ మన మెదళ్లు మాత్రం ఇబ్బందుల్లో పడ్డాయి.

ఈ లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత మీలో ఎవరైనా మెయిల్స్‌ పంపడం, పాలు కొనుక్కురావడంలాంటి పనులేవైనా మరిచిపోయారా? ఏదైనా ఒక పదం గుర్తుకు రాక ఇబ్బంది పడ్డారా ? అయితే అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నది మీరొక్కరే కాదు. జ్జాపకశక్తి దెబ్బతిన్నదని నా స్నేహితులు చాలామంది నాకు చెప్పారు.

కోవిడ్‌-19కు ముందు తర్వాత అంటూ జ్జాపకశక్తిలో వచ్చిన మార్పుల గురించి ఇప్పటికప్పుడు గణాంకాలతో సహా వివరించడం సాధ్యం కాకపోవచ్చు.

కానీ అల్జీమర్స్‌ సొసైటీ నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్నవారిలో సగంమంది తమ ప్రియమైన వాళ్లకు సంబంధించిన జ్జాపకాలను కోల్పోయామని వెల్లడించారు.

కరోనా కారణంగా కేర్‌హోమ్‌లలో కూడా ఒకరినొకరు కలుసుకోలేక పోవడం, నెలల తరబడి విజిటర్లకు కూడా అనుమతి ఇవ్వకపోవడంలాంటివి ఈ పరిస్థితికి దారి తీశాయని చెప్పవచ్చు.

లాక్‌డౌన్‌ కారణంగా మనుషులలో జ్జాపకశక్తి ఎలా దెబ్బతిన్నది-అన్న అంశంపై యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ఇర్విన్‌ పరిశోధన మొదలుపెట్టింది.

ఓ ఇరవైయేళ్ల కిందట కొన్న సినిమా టిక్కెట్‌ను కూడా గుర్తు పెట్టుకోగల మెమరీ పవర్‌ ఉన్నవారు కూడా ఈ మధ్యకాలంలో తాము చాలా విషయాలను మర్చిపోతున్నామని గుర్తించారు.

జ్జాపకశక్తి అనేక విధాలుగా ఉంటుంది. మనం కొనాలనుకున్న వస్తువు ఏదో గుర్తుకు రాకపోవడంలాంటివి ఒకరకమైతే, పేర్లు మర్చిపోవడం, గతవారంలో ఏం పనులు చేశామో గుర్తు తెచ్చుకోలేకపోవడం మరొక రకం.

అయితే ఈ నిర్బంధ సమయంలో జ్జాపకశక్తిపై ఎలాంటి ప్రభావం పడింది అన్నదానిపై పరిశోధనలు ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది.

ఏకాంతంతో వచ్చే ప్రమాదం

జ్జాపకశక్తి మీద ప్రభావం చూపినవాటిలో అన్నింటికన్నా కీలకమైంది ఏకాంతంలో గడపాల్సి రావడం. సమాజంలోని ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోకపోవడం మెదడుపై ప్రభావం చూపిస్తుందని మనలో చాలామందికి తెలుసు.

ముఖ్యంగా ఇప్పటికే జ్జాపక శక్తికి సంబంధించిన సమస్యలున్న వారిపై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కరోనా సందర్భంగా అందరూ ఒంటరిగా ఉండకపోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఒంటరితనపు స్థాయిలు కాలం గడుస్తున్న కొద్దీ మారుతుంటాయి.

సమాజంలో నలుగురితో కలవలేకపోతున్నామన్న బాధ అందరిలో లేకున్నా, అలా బాధపడే వారి సంఖ్య గతంకన్నా కచ్చితంగా పెరిగింది. ఆఫీసులో వాటర్‌ కూలర్‌ దగ్గర నిలబడి మాట్లాడుకోవడం, పార్టీలో గుంపులు గుంపులుగా చేరి, మన సాధించిన కార్యాలన్నింటినీ కథలుగా చెప్పుకోవడంలాంటివి చాలామంది మిస్సవుతున్నారు.

ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం అనేది మన జ్జాపక శక్తికి జరిగన నష్టమేంటో చెప్పకనే చెబుతుంది. వీటినే ఎపిసోడిక్‌ మెమోరీస్‌ అంటారు. పదిమందితో తరచూ కలుస్తుండటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడవు.

మనం ఒకరినొకరు కలుసుకుంటుంటే, మాట్లాడుకుంటుంటే కొత్త కొత్త విషయాలు బైటికి వస్తుంటాయి. సెలవులు లేకపోవడం, పెళ్లిళ్లు వాయిదా పడటం, ఆటపాటల కార్యక్రమాలన్నీ మనుషుల్లేకుండానే నడుస్తుండటంతో పక్కవాడితో మాట్లాడే అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

ఇతరులతో కలవలేకపోతున్నామన్న కొరతను ఆన్‌లైన్‌ కొంత వరకు తీర్చింది. కానీ వాటిలో సహజత్వం కనిపించదు. అసంభవమనిపించే పనుల గురించి ఆన్‌లైన్‌లో మాట్లాడటం చాలా వరకు తగ్గిస్తాం. కానీ వాటిని మనలో మనం దాచుకోవడంకన్నాఎవరో ఒకరితో పంచుకోవడం మేలు. అలా పంచుకోవాల్సిన వాటి సంఖ్య పెరిగితే మిగిలిన జ్జాపకాలను మీరు మిస్సవుతారు.

అయితే నలుగురితో కలవలేకపోవడంకన్నా మించిన సమస్య మరొకటి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతావారికన్నా మనం మెరుగ్గానే ఉన్నామనే భావన్నకన్నా, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి మరింత ఆందోళనను మిగుల్చుతోంది.

కరోనా లాక్‌డౌన్

పెరుగుతున్న ఆందోళన, కుంగుబాటు

కరోనా మహమ్మారి కాలంలో ప్రజలు ఎలాంటి ఆలోచనలు చేశారు అన్నదానిపై యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు చెందిన సైకోబయాలజిస్ట్‌ డైసీ ఫాన్‌కోర్ట్‌, తన బృందంతో ఒక పరిశోధన నిర్వహించారు. లాక్‌డౌన్‌ మొదలైన తొలిరోజుల్లో ఆందోళన (యాంగ్జైటీ) స్థాయి ఎక్కువగా ఉన్నా, క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే సరాసరి ఆందోళన స్థాయిని పరిశీలిస్తే సాధారణ సమయంలో ఉండేదానికన్నా ఎక్కువగానే ఉన్నట్లు తేలింది.

ఈ ధోరణి యువకులు, ఒంటరిగా ఉండేవాళ్లు, పిల్లలతో కలిసి ఉండేవాళ్లు, ఆర్ధికంగా దిగువ స్థాయిలో ఉన్న వారిలో ఎక్కువగా కనబడింది.

కరోనా కారణంగా ప్రజల్లో కుంగుబాటు (డిప్రెషన్‌) రేటు రెండింతలైందని యూకేలోని ఆఫీస్‌ ఆఫ్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడించింది. కుంగుబాటు, ఆందోళనలు రెండూ మనిషి జ్జాపకశక్తిపై ప్రభావం చూపిస్తాయి.

మనకున్న ఆందోళనలు మెదడు మీద ప్రభావం చూపి చిన్నచిన్న విషయాలను మరిచిపోయేలా చేస్తాయి. జ్జాపకశక్తి పదిలంగా ఉండాలంటే దానికి కొంత సహకారం అవసరం. మనం బైటికి వెళితే కనిపించే వివిధ దృశ్యాలు, ఘటనలు, ఆఫీసులో తీసుకునే విరామాలు మనలోని ఆందోళనను కొంత వరకు దూరం చేస్తాయి. ఇలాంటి వాటివల్ల మన జ్జాపకశక్తిని నిలుపుకోవడం సాధ్యమవుతుంది.

ఈ ఆన్‌లైన్‌ యుగంలో రోజూ జరిగే మీటింగ్‌లు ఒకే రకంగా ఉంటున్నాయి. కొత్తదనం లేదు. ఒకే సీట్లో కూర్చుని కనిపించాలి. ఇలాంటి వాటివల్ల మెదడుకు రిఫ్రెష్‌మెంట్‌ లేక జ్జాపకశక్తి సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

“ రెండు భిన్నమైన రోజుల్లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడం నలుపురంగు 'కీ’లు లేకుండానే పియానో వాయించడానికి ప్రయత్నించడంలాంటిది’’ అని అభివర్ణించారు యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌ మినిస్టర్‌లో కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేథరిన్‌ లవ్‌డే.

ఆఫీసులో ఉన్నప్పుడు మీరు ఏ మీటింగ్‌ రూమ్‌కో వెళ్లేటప్పుడు ఈ మీటింగ్‌కు సంబంధించి ఎవరికో మెయిల్ పంపాలన్న విషయం గుర్తుకు వస్తుంది. కానీ ఇంట్లో అలాంటి పరిస్థితి ఉండదు. ఎంతసేపైనా కంప్యూటర్‌ ముందుకు కూర్చునే స్మరణకు తెచ్చుకోవాలి.

ఆఫీసులో ఎవరైనా ఒక విషయం చెబితే ఆ వ్యక్తి ఆ విషయం చెప్పిన ప్రదేశం రాగానే అది మళ్లీ గుర్తుకు రావచ్చు. అది లిఫ్ట్ కావచ్చు, క్యాంటిన్‌ కావచ్చు, మరేదైనా కావచ్చు. కొన్ని ప్రదేశాలు మీకు జ్జాపకశక్తి నిలబడటానికి సహకరిస్తాయి.

కరోనా లాక్‌డౌన్

వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ప్రభావం చూపుతోంది?

అలసట కూడా మన జ్జాపకశక్తి మందగించడానికి కారణమవుతుంది. జూమ్‌ మీటింగ్‌లు తీవ్రమైన అలసటకు కారణమవుతాయి. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లో ఎక్కువసేపు పని చేయాల్సి రావచ్చు. చాలాసార్లు సెలవులు రద్దవుతుంటాయి. ఆఫీసులో ఉండే సదుపాయాలు ఇంట్లో లేకపోవడం, యాంగ్జయిటీ పెరగడంతో నిద్ర కరువవుతుంది. ఇవన్నీ మరింత అలసటకు దారితీస్తాయి.

అలసట, ఆందోళన, నిద్రలేమి, నలుగురితో కలవలేకపోవడం ఇవన్నీ కలిసి మెదడుపైనా, తద్వారా జ్జాపక శక్తిపైనా ప్రభావం చూపుతాయి.

మనకు కనిపించని మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయంటారు ప్రొఫెసర్‌ లవ్‌డే. వివిధ ప్రదేశాలలో గడపటం, తిరగడం కూడా మెదడుపై ప్రభావం చూపుతుందంటారామె.

తిరిగి ఇంటికి చేరుకోవాలన్న కాంక్ష మనిషి అస్తిత్వంలో కీలకమైన అంశం. మనం ఇంటి నుంచి బయలుదేరగానే ఆలోచనలు మొదలువుతాయి. మనం అడవిగుండా వెళుతున్నా, పట్టణం మధ్యలో ప్రయాణిస్తున్నా, మన మెదడులోని హిప్పోక్యాంపస్‌ (మెదడులో ఒక భాగం) పని చేస్తూనే ఉంటుంది.

లండన్‌లోని బ్లాక్‌ క్యాబ్‌ డ్రైవర్లపై జరిగి అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. లండన్‌లోని క్యాబ్‌ డ్రైవర్లకు హిప్పోక్యాంపస్‌ సైజ్‌ ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది.

ఎక్కువ కొత్త విషయాలను స్టోర్‌ చేసుకోడానికి హిప్పోక్యాంపస్‌ ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఒకేచోట గడిపే వారికి హిప్పోక్యాంపస్‌ ప్రయోజనం తగ్గిపోతుందని కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీకిలో న్యూరో సైటింటిస్టుగా పని చేస్తున్న వెరోంకీ భాబోట్‌ వెల్లడించారు.

శాటిలైట్‌ నేవిగేషన్‌ మీద ఆధారపడే లండన్‌ డ్రైవర్లకన్నా, సొంతంగా కారు నడిపే క్యాబ్‌ డ్రైవర్లలోనే ఎక్కువ జ్జాపకశక్తి ఉంటుందని, దీనిక హిప్పోక్యాంపస్‌ కారణమని ప్రొఫెసర్‌ భాబోట్‌ వెల్లడించారు.

జ్జాపకశక్తిని ఎలా నిలబెట్టుకోవాలి?

కరోనా కారణంగా ఎక్కువకాలం ఇంటి దగ్గరే ఉండటం వల్ల ఇలాంటి జ్జాపకశక్తి సమస్యలు ఏర్పడతాయని, మెదడుకు అవసరమైన అదనపు ఎక్సర్‌సైజ్‌ అందదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

దీని నుంచి బైటపడటానికి మార్గం కూడా ఉంది. రోజూ కాసేపు వాకింగ్‌కు వెళ్లడం, ముఖ్యంగా ఇంతకు ముందు మనం ఎప్పుడూ వెళ్లని ప్రదేశాలలో వాకింగ్‌ చేయడం వల్ల మెదడుకు రిఫ్రెష్‌మెంట్‌ లభిస్తుంది. నడక కూడా కొంత మార్పుకు కారణమవుతుంది.

మీటింగ్‌ కోసం రోజంతా ఇంట్లోనే కూర్చోవడంకన్నా, అలా బయటకు వెళ్లి నడుచుకుంటూ ఫోన్‌ మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

వారాంతాలు కూడా ఎప్పుడూ ఒకేలా కాకుండా, కాస్త భిన్నంగా ప్లాన్‌ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. రోజువారీకి భిన్నంగా, కొన్ని సృజనాత్మక కార్యక్రమాలవైపు దృష్టి మళ్లించడం మంచిదని ప్రొఫెసర్‌ లవ్‌డే చెప్పారు. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే, ఇంట్లోనే ఏదైనా కొత్త యాక్టివిటీకి శ్రీకారం చుట్టమంటారామె. ఇలాంటి వాటిని తర్వాత ఇతరులకు చెప్పుకోవడం ద్వారా ఒక జ్జాపకంగా మిగుల్చుకోవచ్చు.

ఈ రోజంతా జరిగిన పనులను సాయంత్రం ఒక డైరీలో రాయడం వల్ల కూడా జ్జాపకాలు పదిలమవుతాయి. అవి చిన్నచిన్న విషయాలే కావొచ్చు. కానీ మీ జ్జాపక శక్తిని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.

మీరు చేయాల్సిన పనులను తరచూ మరిచిపోతుంటే, మీ ఫోన్‌లో అలర్ట్‌గా మార్చుకోవడం మంచిది. ఇది కచ్చితంగా ప్రయోజనకరమే.

తరచూ పాలు, గుడ్లు, ఇతర వస్తువులు కొనుక్కురావడం మరచిపోతుంటే, మీరు ఎప్పుడూ వెళ్లే షాపులోని అన్ని షెల్ఫ్‌లను మనసులో ఊహించుకోండి. ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్లినప్పుడు మీరు కొనాల్సిన సరుకులు చాలావరకు గుర్తుకొస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Lockdown damaged memory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X