వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు లోయలో నివసించిన ప్రజలు అధికశాతం గొడ్డు మాంసం, గేదె, మేక మాంసాలను తినేవారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

సింధు లోయలో దొరికిన కుండ పెంకుల్లోని ఆహార అవశేషాలను విశ్లేషించిన మీదట.. ఆ కాలంలో విరివిగా గొడ్డు మాంసం తినేవారని శాస్త్రవేత్తలు నిర్థారించారు.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ఆర్కియాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేసిన అక్ష్యేతా సూర్యనారాయణ్ సింధు లోయ ప్రజల ఆహారపు అలవాట్లపై అధ్యయనం చేశారు.

ఇందులో భాగంగా అక్కడ దొరికిన అనేక మట్టి పాత్రలు, పింగాణీ పాత్రల అవశేషాలపై లిపిడ్ రెసిడ్యువల్ పరీక్షలు జరుపగా.. వాయువ్య భారతదేశంలో (ప్రస్తుత హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు) పట్టణ, పల్లె ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా మాంసాహారం మీదే ఆధారపడేవారని తేలింది.

సింధు నాగరికత

ఈ అధ్యయన ఫలితాలు 'లిపిడ్ రెసిడ్యూస్ ఇన్ పోటరీ ఫ్రమ్ ది ఇండస్ సివిలైజేషన్ ఇన్ నార్త్‌వెస్ట్ ఇండియా’ పేరుతో 'జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్‌’లో ప్రచురితమయ్యాయి. అక్ష్యేతా ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని సీఈపీఈఎంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా ఉన్నారు.

"సింధు లోయ ప్రజల ఆహార అలవాట్ల గురించి ప్రశ్న వచినప్పుడల్లా మనం వారు పండించిన పంటల గురించే పరిశోధించాం. కానీ వారు పండించిన పంటలు, అప్పటి జంతువులు, ఆహారంకోసం వారు ఉపయోగించిన పాత్రలు.. వీటన్నిటినీ పరిశీలిస్తే తప్ప వారి ఆహరపు అలవాట్ల గురించి మనకు సమగ్రమైన సమాచారం లభించదు" అనే ప్రతిపాదన ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది.

సింధు నాగరికత

సింధు లోయ ప్రజలు ఉపయోగించిన పింగాణీ పాత్రల్లో జంతువుల కొవ్వు అవశేషాలను గుర్తించారు.

దీన్నిబట్టి వారు మాంసాహరం తీసుకునేవారనే నిర్థారణకు వచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా, పురాతన ప్రజలు ఆహారంకోసం ఉపయోగించిన పాత్రలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

అదే దిశలో సింధు ప్రజల ఆహార అలవాట్లను తెలుసుకునేందుకు వారు ఉపయోగించిన కుండలను, పింగాణీ పాత్రలను అధ్యయనం చేస్తున్నారు.

సింధు నాగరికత కాలంలో పాడిపంటలు

సింధు లోయలో ప్రజలు బార్లీ, గోధుమ, వరి, తృణధాన్యాలు, శెనగలు, బఠాణీలు, పప్పులు పండించేవారని అధ్యయనాల్లో తేలింది. ఇవే కాకుండా, దోసకాయ, వంకాయ లాంటి కూరగాయలు, పళ్లు, పసుపు, జనపనార, పత్తి, నువ్వులు, ఆవాలు వంటి నూనె గింజెలు సాగు చేసేవారు.

ఇక, జంతువుల విషయానికొస్తే పశువులను ఎక్కువగా పెంచేవారని తెలుస్తోంది. ఇక్కడ జరిపిన పురావస్తు తవ్వకాల్లో 50% నుంచీ 60% ఆవులు, గేదెల ఎముకలు బయటపడగా, 10% మేకలు, గొర్రెల ఎముకలు బయటపడ్డాయి. "దీన్నిబట్టి సింధులోయలోని ప్రజలు గొడ్డు మాంసానికి ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తోంది. అదనంగా, మటన్ కూడా తినేవారని తెలుస్తోంది" అని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.

ఇవే కాకుండా, పందుల ఎముకలు, జింకలు, పక్షులు, క్షీరదాలు, చేపల అవశేషాలు కూడా కొద్ది స్థాయిలో బయటపడ్డాయి.

పాడి అవసరాలకు పశువులను 3 నుంచీ 3.5 సంవత్సరాలవరకూ పెంచేవారు. ఎద్దులను వ్యవసాయానికి ఉపయోగించేవారు. పందుల ఎముకలు స్వల్పస్థాయిలో బయటపడినప్పటికీ వాటి ఇతర అవసరాలు ఏమిటో స్పష్టంగా తెలియలేదు.

సింధు నాగరికత

మట్టి కుండలను ఎక్కడ సేకరించారు?

ఈ అధ్యయనం కోసం ప్రస్తుత హరియాణాలోని సింధు లోయ తవ్వకాల స్థలానికి ఆనుకొని ఉన్న ఆలమ్‌గిర్‌పూర్, మసూద్‌పూర్, లోహారీ రాఘో, కనక్, ఫర్మానాలలో తవ్వకాలు జరిపి సింధు నాగరికత కాలంనాటి మట్టి, పింగాణీ పాత్రలను సేకరించారు.

మొత్తం 172 కుండ పెంకులను సేకరించారు. మట్టి పాత్రాల నాళాల అంచులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆహారాన్ని ఉడికించేటప్పుడు పాత్ర అంచులవరకూ పొంగి పేరుకోవడం సహజం. పాత్ర అంచులపై ఉన్న ఆహర అవశేషాలలో ఉన్న కొవ్వు నమూనాలను సేకరించారు. అంతేకాకుండా పాత్రల లోపలి అంచులపై పేరుకుని ఉన్న ఆహార పదార్థాలను కూడా సేకరించారు. వీటిని పరిశీలించి అవి ఏ జంతువుకు చెందిన కొవ్వు పదార్థాలో గుర్తించారు.

సింధు నాగరికత

అధ్యయన విశేషాలు

కుండ పెంకులపై దొరికిన ఆహార అవశేషాల్లో పాల ఉత్పత్తులు, మాంసాహారంతో పాటూ మొక్కలనుంచీ వచ్చిన ఆహారపు ఆనవాళ్లు కూడా కనిపించాయి. బహుసా మొక్కలు, మాంసం కలిపి వండుకుని ఉండొచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినియోగంలో కూడా భేదం లేదని ఈ అధ్యయనాల్లో తేలింది. అలాగే, ఈ పాత్రలను ఆహారానికి మాత్రమే కాకుండా ఇతర అవసరాలకు కూడా వినియోగించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతాల్లో క్షీరదాల అవశేషాలు అధికంగా బయటపట్టినప్పటికీ, మట్టి పాత్రల్లో పాల ఉత్పత్తుల అవశేషాలు చాలా తక్కువగానే కనిపించాయి. అయితే, ఇటీవల ఒక అధ్యయనంలో గుజరాత్‌లోని పురావస్తు తవ్వకాల్లో లభించిన పాత్రల్లో పాల ఉత్పత్తుల జాడలు ఎక్కువగా కనిపించాయి. దీన్నిబట్టి ఆ ప్రాంతాల్లో పాల ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించేవారని ఈ అధ్యయనాల్లో వెల్లడైంది.

“తరువాతి దశ అధ్యయనాల్లో...సాంస్కృతిక, వాతావరణ మార్పులకు అనుగుణంగా కాలక్రమేణ ఆహారంలో వచ్చిన మార్పులను తెలుసుకునే దిశగా పరిశోధనలు జరుపుతామని” అక్ష్యేయ తెలిపారు.

“దక్షిణ ఆసియా ప్రాంతాలలో మరిన్ని తవ్వకాలు చేపట్టి, మట్టి పాత్రలను సంగ్రహించడం ద్వారా క్రీస్తు పూర్వం దక్షిణ ఆసియాలోని ఆహరపు అలవాట్లను మరింత సమగ్రంగా తెలుసుకోగలుగుతామని అక్ష్యేయ అభిప్రాయపడ్డారు.

సింధు నాగరికత

సింధు నాగరికత గురించి మరిన్ని వివరాలు

ఈ అధ్యయనంలో సింధు లోయ నాగరికత గురించి కొన్ని వివరాలను కూడా జత చేసారు.

సింధు లోయ నాగరికత ప్రస్తుత పాకిస్తాన్, వాయువ్య భారతదేశం, ఉత్తర భారతదేశం, అఫ్ఘానిస్తాన్‌లోని ప్రాంతాలలో విస్తరించిన అతి ప్రాచీన నాగరికత.

ఈ ప్రాంతాల్లోని లోయలు, మైదానాలు, పర్వత ప్రాంతాలు, ఎడారులు తీర ప్రాంతాలలో సింధు నాగరికత విస్తరించి ఉండేది.

క్రీ. పూ. 2600 నుంచీ క్రీ. పూ. 1990 మధ్య కాలంలో నగరాలు, పట్టణాల నిర్మాణంతో సింధు నాగరికత గొప్పగా అభివృద్ధి చెందింది. దీన్ని హరప్పా నాగరికతగా అభివర్ణిస్తారు. ఐదు పెద్ద నగరాలు, అనేక పట్టణాలు నిర్మించబడ్డాయి.

సింధు నాగరికత

గొలుసులు, గాజులలాంటి ఆభరణాలు, తూనిక కొలతలు, ముద్రలు ఈ నాగరికతకు చెందిన ముఖ్యమైన చిహ్నాలు.

వీరు వస్తుమార్పిడి వ్యవస్థను రూపొందించుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా అందరికీ అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేవి.

సింధు లోయ నాగరికత కాలంలో పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకన్నా మెరుగ్గా ఉండేవని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. వీటి మధ్య సంబంధం ఎక్కువగా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.

క్రీ.పూ 2100 బీసీ తరువాత, సింధు నాగరికతలోని పశ్చిమ ప్రాంతాలు వెనకబడిపోయి తూర్పు ప్రాంతాలు అభివృద్ధి చెందనారంభించాయి.

క్రీ.పూ 2150 తరువాత సింధు నాగరికత పతనం ప్రారంభమయ్యింది. దీనికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ వర్షాలు లేకపోవడం, కరువు కాటకాలు ప్రబలి సింధు నాగరికత అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Indus valley civilisation people use to eat beef
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X