యోగీని అయోధ్య పంపేందుకు మోడీ-షా విఫలయత్నం ? పట్టుబట్టి గోరఖ్ పూర్ లోనే పోటీ
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం ఖాయమనేది నానుడి. ఉత్తర్ ప్రదేశ్ లోనూ ఇదే జరుగుతోంది. గతంలో ఎంపీగా ఉన్న హార్డ్ కోర్ నేత యోగీ ఆదిత్యనాథ్ ను తీసుకొచ్చి యూపీ సీఎం పీఠంపై కూర్చోబెట్టిన ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఆయన షాకులు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఆయన నేతృత్వంలో యూపీలో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం వారిద్దరికీ సవాలుగా మారింది. అయోధ్యలో రామమందిరం వివాద పరిష్కారంతో అన్నీ అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నా.. యోగీని కట్టడిచేసేందుకు బీజేపీతో అంతర్గతంగా జరుగుతున్న ప్రయత్నాలు చర్చకు తావిస్తున్నాయి. తాజాగా అయోధ్య బరిలో దిగుతారని భావించిన యోగీ గోరఖ్ పూర్ కే పరిమితమయ్యారు.

యోగీ సీటు వివాదం
యూపీ సీఎం, బీజేపీ హార్డ్ కోర్ నేత యోగీ ఆదిత్యనాథ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చకు తాజాగా ఆ పార్టీ విడుదల చేసిన అభ్యర్ధుల తొలిజాబితా సమాధానం ఇచ్చింది. ఇందులో ఎమ్మెల్సీగా ఉంటూ ఐదేళ్లు సీఎంగా నెట్టుకొచ్చిన యోగీని ఈసారి గోరఖ్ పూర్ నుంచే బీజేపీ బరిలోకి దింపింది. అయితే దీనికి ముందు ఆయన అయోధ్యనుంచి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగినా బీజేపీ మాత్రం గోరఖ్ పూర్ సీటునే కేటాయించింది. దీని వెనుక ఏం జరిగిందేదానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

అయోధ్య నుంచే పోటీ అంటూ ప్రచారం
యోగి అయోధ్య నుంచి పోటీ చేస్తున్నట్లు ఎక్కడా కనిపించకపోయినా, తన ప్రత్యేక దూతను మాత్రం అక్కడికి పంపారని, పోటీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను రహస్యంగా ప్రారంభించారని వివిధ టీవీ ఛానెల్‌ళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం జరిగింది. అందుకే ఆయన నిత్యం అయోధ్యను సందర్శిస్తున్నారని, ఆలయ పట్టణంలో ప్రత్యేక దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారని కూడా ప్రచారం జరిగింది. అయోధ్యలోని బూత్ వాలంటీర్లకు యోగీ టీమ్ స్మార్ట్ఫోన్లను కూడా ఇస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అవన్నీ నిజమైతే, అతను శక్తివంతమైన నాయకుడవుతాడని, భవిష్యత్ నాయకత్వం కోసం ఆరెస్సెస్ అతనిని తీర్చిదిద్దుతోందని అంతా భావించారు.

మోడీ-షాతో యోగీకి విభేధాలు ?
యూపీ సీఎం కాక ముందు మోడీ-షాలకు విధేయంగా ఉన్నట్లు కనిపించిన యోగీ ఆదిత్యనాథ్... ఆ తర్వాత మాత్రం సొంత పంథాలో వెళ్లడం మొదలుపెట్టారు. యూపీలో తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో పరిస్ధితులు చక్కబెట్టేందుకు అక్కిడికి ప్రధాని మోడీ ఇన్ ఛార్జ్ గా పంపిన ఏకే శర్మను ఆయన పక్కనబెట్టారు. ఆయన్ను కేబినెట్ లో తీసుకోవాలని మోడీ-షా సూచించినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. చివరికి ఆయనకు యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మాత్రం ఛాన్స్ ఇచ్చారు. దీంతో యోగీని సీఎంగా మార్చేందుకు మోడీ-షా ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. చివరికి ఆయన్ను గోరఖ్ పూర్ నుంచి అయోధ్యకు పంపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ దశలో ఆరెస్సెస్ రంగంలోకి దిగి వీరి మధ్య రాజీ కుదిర్చినట్లు ప్రచారం జరుగుతోంది.

కంచుకోట గోరఖ్ పూర్ నుంచే పోటీ
యోగీ బలమంతా గోరఖ్ పూర్ లోనే ఉంది. 1998 నుంచి అక్కడి నుంచి ఎంపీగా గెలుస్తున్న యోగీ ఆదిత్యనాథ్ కు సాధువుగా గోరఖ్ నాథ్ ఆలయంతో బలమైన పునాదులున్నాయి. వీటిని వదులుకుని అయోధ్యకు వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. అలాగే గోరఖ్ పూర్ అర్బన్ సీటు కూడా బీజేపీ 1991 నుంచి గెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తనకు అన్నివిధాలా కలిసొచ్చే కంచుకోట గోరఖ్ పూర్ నుంచే పోటీ చేసేందుకు యోగీ ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు మోడీ-షాల ప్రతిపాదనను కూడా అధిగమించి ఆరెస్సెస్ సాయంతో ఆయన ఆ సీటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.