కొత్త ఇన్నింగ్స్: బీజేపీలోకి గంభీర్, సెహ్వాగ్?, కూతురు కోసం పవార్, కుంభమేళాకు వెజిటేరియన్ పోలీస్

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి. టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ నుంచి లోక్‌సభ స్థానాల నుంచి వారు పోటీ చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అవే దేశానికి పట్టిన చీడపరుగులు: కాంగ్రెస్‌పై నరేంద్ర మోడీ నిప్పులు
తాజాగా, రాఫెల్ వివాదంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతుగా వాదన వినిపించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. బీజేపీ ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటోందనే మరో వాదన కూడా వినిపిస్తోంది.

గంభీర్, సెహ్వాగ్‌లకు బీజేపీ ఎంపీ సీట్లు..
భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 30-40శాతం ఎంపీ స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఒక స్థానం తప్ప మిగితా స్థానాల్లో కొత్తవారినే బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. గుజరాత్, బీహార్‌లకు చెందినవారికి రెండు స్థానాలు, మరో రెండు స్థానాల్లో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ తాజాగా తీసుకున్న నిర్ణయం మంచిదేనని పార్టీ నేతలు భావిస్తున్నారు.

అలహాబాద్ కుంభమేళాలో వెజిటేరియన్ పోలీసులు
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే అలహాబాద్ కుంభమేళాలో శాఖహారులైన పోలీసులనే బందోబస్తుకు వినియగించుకోవాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శాఖాహారులైన పోలీసులను లెక్కించే పనిలో పడింది. కుంభమేళ పవిత్రమైన వేడుకను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఘనంగా నిర్వహించాలని యోగి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళా భద్రతా ఏర్పాట్లలో పాల్గొనే ఎస్పీ నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు కూడా శాఖాహారమే భుజించాలని సర్కారు స్పష్టం చేసింది.

బీజేపీతో కలిసి వెళ్లేందుకు ఎన్సీపీ సిద్ధమవుతోందా?
కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలు రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మాత్రం ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దుతగా నిలిచారు. రాఫెల్ ఒప్పందం గురించి ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవార్ తన కూతురుకు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఇప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్న శివసేన ఆ పార్టీతో అంటిముంటనట్లుగా ఉంటున్న విషయం తెలిసిందే.

విపక్షాల కంటే మంత్రుల వల్లే..
రాఫెల్ డీల్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్న తరుణంలో సంఘ్ పరివార్‌కు చెందిన ఓ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి వర్గంలో మంత్రుల మధ్య సయోధ్య అవసరమని అన్నారు. మోడీ ప్రభుత్వానికి విపక్షాల కంటే మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడమే పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత మంత్రే వివరించాల్సి ఉంటుందని తెలిపారు.