నాగచైతన్యతో విడాకులు.. సమంతపైనే రూమర్లు, విమర్శలు ఎందుకు? వివాహాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా మహిళదేనా?

తెలుగు సినీ నటులు నాగ చైతన్య, సమంత అక్టోబరు 2వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కానీ, ఈ ప్రకటన చేయడానికి కొన్ని రోజుల ముందు సమంత ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి తన పేరులో ''అక్కినేని'' ఇంటిపేరును తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు మొదలయ్యాయి.
కొన్ని యూట్యూబ్ చానెళ్లు కూడా ఈ విషయాన్ని కొండంత చేసి చెప్పడం మొదలుపెట్టాయి. ఈ వాదనలను ఇరుపక్షాలూ ఖండించలేదు.
ఎట్టకేలకు నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు అక్టోబరు 02న చేసిన అధికారిక ప్రకటనలో సారాంశం ఇలా ఉంది.
https://www.instagram.com/p/CUhawZvrPK9/
''చాలా చర్చలు, ఆలోచనల తర్వాత సమంత, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహ బంధం కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం'' అని సమంత ట్వీట్ చేశారు. ఇదే తరహాలో నాగ చైతన్య కూడా ట్వీట్ చేశారు.
''ఈ సంక్షోభ సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు అండగా నిలవాలని కోరుతున్నాం. మేం మా జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి' 'అని ఇద్దరూ కోరారు.
అయితే, ఈ ప్రకటన చేసిన మరుక్షణం నుంచీ వీరి విడాకులకు కారణాలివే అంటూ మీడియా, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, కథనాలు మొదలయిపోయాయి.
'ఫలానా వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే సమంత ఇలా చేసింది', 'ఆ సినిమాల్లో శ్రుతి మించి నటించడమే ఇందుకు కారణం', 'సమంత పిల్లలను వద్దనుకుంది' అంటూ ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు కథనాలు రాశారు.
నాగ చైతన్య, సమంత విడాకులకు కారణాలు ఇవే అంటూ మీడియా, సోషల్ మీడియాల్లో వస్తున్న కథనాలపై సమంత ట్విటర్ లో స్పందించారు.
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- దేవత విగ్రహానికి రామ్‌గోపాల్ వర్మ విస్కీ ఎందుకు తాగించారు?
https://twitter.com/Samanthaprabhu2/status/1446418402805837825/photo/1
''నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు.
''నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు''.
''విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం దారుణం. మీరనుకునే విధంగా ఎన్నడూ చేయను. మీరు నన్ను ఎంత బాధపెట్టినా చెదరను'' అని సమంత ట్వీట్ చేశారు.
ఈ వివరణ ఇవ్వడానికి ముందు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రచయిత్రి ఫరిదా చెప్పిన మాటల్ని కూడా సమంత పోస్ట్ చేశారు.
''మహిళలు చేసే పనులు ఎప్పుడూ నైతికంగా ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు... పురుషుల్ని ఎందుకు ప్రశ్నించరు? అవే పనులు పురుషులు చేస్తే అస్సలు ప్రశ్నించరు. ప్రాథమికంగా ఎటువంటి విలువలు లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం'' అని ఫరిదా చెప్పిన మాటల్ని సమంత షేర్ చేశారు.
సమంతకు మద్దతు తెలుపుతూ ఆమె డిజిటల్ మేనేజర్, స్నేహితురాలు శేషాంకా బినేష్ కూడా ఇన్‌స్టా వేదికగా సమంతపై వస్తున్న రూమర్లను ఖండించారు. ఆమెను లక్ష్యం చేసుకోవడం సులభం కావడంతో ఆమెను బలిపశువును చేస్తున్నారని విమర్శించారు.
https://www.instagram.com/p/CUz0lHepFfH/?utm_source=ig_web_copy_link
ఆమె రాసిన పోస్ట్ ఈ విధంగా ఉంది:
"ఆ జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఆగస్టు నుంచి సమంత తన పనులకు లాంగ్ బ్రేక్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుండటంతో, మేమిద్దరం కలిసి డిజిటల్ వ్యూహం గురించి చర్చించాం".
"మా టీమ్ అంతా కలిసి రకరకాల క్యాంపైన్ ఐడియాలు, ఆమె నటిస్తున్న శాకుంతలంకు సంబంధించిన కంటెంట్ గురించి విస్తృతంగా చర్చించాం. బ్రేక్ తీసుకోవడానికి ముందు ఆమె చేసే ఆఖరి ప్రాజెక్ట్ అదే".
"ఆమె పిల్లల్ని కనాలనే ఉద్దేశ్యంతోనే రెండేళ్ల లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు నాతో నవ్వుతూ చెప్పారు".
"ఈ నేపథ్యంలో సమంత పిల్లలని కనడానికి సిద్ధంగా లేదని, సరోగసీ ద్వారా బిడ్డలను కనాలని అనుకుంటున్నారనే అబద్ధపు ప్రచారం ఎలా సాగుతుందో నాకర్ధం కాలేదు".
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- బైసెక్సువల్ సూపర్ మ్యాన్
"ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ, గట్టిగా అరుస్తున్న వారికెవరికీ ఆమెతో కానీ, నాగ చైతన్యతో కానీ ఎటువంటి పరిచయం లేదు. అంతే కాకుండా వారు మాట్లాడుతున్న విషయాలేవీ సన్నిహితులుగానీ, స్నేహితులుగానీ చెప్పినవి కావు".
"స్వతంత్రంగా ఎదిగి తన జీవితాన్ని నిర్మించుకుని, తన బంధాన్ని కొనసాగించాలని కోరుకున్న ఒక అమ్మాయిపై తమని తాము లైఫ్ కోచ్ అని, ఫ్యామిలీ కౌన్సెలర్లు అని చెప్పుకుంటున్న కొంతమంది కావాలని బురద చల్లి తమ వీడియోలకు కొన్ని వ్యూస్ పొందాలనే తపనతో ప్రవర్తించారు".
"ఆధునిక యుగంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట తప్పులు జరిగే అవకాశం ఉంది. ఇది సెలెబ్రెటీలకు మాత్రమే కాదు. సాధారణ ప్రజలకు కూడా జరగవచ్చు. ఏదేమైనా ఒక బంధం గురించి నిర్ణయించుకునే అధికారం పూర్తిగా ఆ బంధంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఉంటుంది."
"ఒక అమ్మాయిని నిందించటానికి ఇన్ని కారణాలు వెతుక్కుంటున్న వారికి అబ్బాయిని నిందించేందుకు ఒక్క కారణం కూడా ఎందుకు కనిపించడం లేదో నాకర్ధం కావడం లేదు".
"ఒక అబ్బాయి నెమ్మదిగా ఉండటం వల్ల అతనిది ఏ విధమైన తప్పూ లేదని, అమ్మాయి సోషల్‌గా యాక్టివ్ గా ఉండటం వల్ల ఆమెదే తప్పు అని అనుకునేట్లు చేస్తారా?"
"ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఏ మాత్రం నిజానిజాలు తెలియకుండా అంతా అమ్మాయిదే తప్పు అన్నట్లు మాట్లాడే పాత కాలపు ఆదర్శాలు ఎంత మాత్రం పనికిరావు" అంటూ పోస్టు చేశారు.
ఇదే తరహాలో సమంత ఇటీవల నటించిన శాకుంతలం సినిమా ప్రొడ్యూసర్ నీలిమ గుణ కూడా సమంత తమ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసుకుని పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉన్నట్లు తమతో చెప్పిన విషయాన్ని వెల్లడి చేస్తూ పోస్ట్ పెట్టారు.
ఈ మొత్తం వ్యవహారంలో అబ్బాయిని నిందిస్తూ వచ్చిన పోస్టులు అరుదుగా కనిపించాయి.
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- నగరం వాలెంటైన్స్ డే జరుపుకొంటోంది.. ఆమె మాత్రం గదిలో ఒంటరిగా నిరీక్షిస్తోంది

"స్నేహితులూ, పార్టీలూ ఎక్కువ"
అయితే, శేషాంకా బినేష్ అంటున్నట్లుగా, ఒక బంధం నుంచి విడిపోతున్నప్పుడు నిందలన్నీ మహిళలకే ఎందుకు? ఈ పాత కాలపు ఆలోచనల నుంచి మనమెందుకు బయటపడటం లేదు? అనే సందేహం నాకు కూడా కలిగింది.
విడాకుల పత్రాలపై సంతకం చేసిన తర్వాత నా చిన్న ప్రపంచంలో నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను.
జరిగిన విషయం, నిజానిజాలు తెలియకుండానే, "సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్లే వదిలేసి ఉంటారు". "స్నేహితులు, పార్టీలు ఎక్కువ, అందుకే ఆ అబ్బాయికి విరక్తి వచ్చి ఉంటుంది" లాంటి రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
కాకపొతే, నేను సెలెబ్రిటీ కాదు కాబట్టి ఇవన్నీ ఫలానా వారు ఇలా అనుకుంటున్నారు అని సన్నిహితులు చెబుతుంటే తెలిసేది.
"కొందరు బంధువులు, నైట్ డ్యూటీలు చేస్తూ ఉండటం వల్లే విడిపోయారు" అని తీర్మానించేసారు కూడా.
"ఉద్యోగం మానేసి, ఇంటిపట్టునే ఉండి ఉంటే ఆ అబ్బాయి విడాకులు ఇచ్చి ఉండేవాడు కాదు" అంటూ తమకు తోచిన ఉచిత సలహాలు కూడా ఇచ్చారు.
ఇలాంటివి చాలా వినాల్సి వచ్చింది.
మరి నాలాంటి ఒక సాధారణ మహిళ పైనే ఇన్ని అనుమానాలు వ్యక్తమైతే, సమంత లాంటి సెలెబ్రిటీల గురించి ఊహాగానాలు రావడంలో ఆశ్చర్యం ఏముంది?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- 'విడాకులు తీసుకుంటే ఎందుకు సిగ్గుపడాలి? ఇదేమీ జీవితానికి ముగింపు కాదు'
సాధారణంగా మహిళనే ఎందుకు టార్గెట్ చేస్తారు?
పితృస్వామ్య సమాజం వివాహాన్ని కాపాడే బాధ్యతను పూర్తిగా మహిళ పైనే పెట్టడం వల్లే ఈ పరిస్థితులకు కారణమని స్వచ్చంద సంస్థ 'పాపులేషన్ ఫస్ట్' డైరెక్టర్ శారద అన్నారు.
ఒక మహిళ వైవాహిక బంధంలో ఎటువంటి పరిస్థితులు, వేధింపులు ఎదుర్కొంటున్నా కూడా అమ్మాయే పెళ్లిని నిలుపుకుని ఉండాల్సిందనే సూచనలిస్తారు తప్ప, అబ్బాయిలను మాత్రం ఎందుకు వేధిస్తున్నావు అని ప్రశ్నించడం అరుదుగా జరుగుతూ ఉంటుందని అన్నారు.
'సమంత పిల్లల్ని కనేందుకు అంగీకరించలేదు’ అంటూ వచ్చిన రూమర్ల గురించి మాట్లాడుతూ, "పిల్లల్ని కనాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. కనాల్సింది మహిళ కాబట్టి ఆ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మహిళకుంటుంది. అది దంపతులు ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం. విడిపోవాలని అనుకోవడం కూడా పూర్తిగా ఇద్దరికీ సంబంధించిన వ్యవహారం. ఒకరి వ్యక్తిగత విషయం గురించి మాట్లాడే అధికారం సమాజానికెక్కడిది" అని ప్రశ్నించారు.
"అమ్మాయి అంటే కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లలను కనాలి, కెరీర్‌కు ప్రాధాన్యత తగ్గించాలి అనే భావాలు నాటుకుపోవడమే ఇలాంటి రూమర్లు రావడానికి కారణం" అని అన్నారు.
'అమ్మాయి నచ్చకపోతే, వదిలిపడేయరా' అని చాలా సులభంగా అనేస్తారు. కానీ, అమ్మాయికి అలాంటి సలహా ఇస్తారా?' అని ప్రశ్నించారు.

"ఇందులో ఊహించడానికేముంది?"
అయితే, సమంత విషయంలో ఊహాగానాలేమున్నాయి? ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్లే కదా ఇదంతా మాట్లాడుతున్నాం. అంటూ మరి కొంత మంది నెటిజెన్లు తాము ఊహించడాన్ని సమర్ధించుకుంటున్నారు.
ఇటువంటి వ్వాగ్వాదం అంతా నా వ్యక్తిగత సోషల్ మీడియా టైం లైన్ లోనే చోటు చేసుకుంది.
"సుమారు 10ఏళ్ల స్నేహబంధం, నాలుగేళ్ల వైవాహిక జీవితం, ఎంతో మంది యువత అభిమానించే ప్రేమ జంట విడిపోయినప్పుడు, వారు కూడా అనేక భావోద్వేగాలకు లోనయి ఉండవచ్చు. అయితే, అవన్నీ బయటకు ప్రదర్శించాల్సిన అవసరం లేదు" అని రచయత సత్యవతి పోచిరాజు అన్నారు. ఆమె సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత.
"కానీ, ఆమె అభ్యర్థనకు విలువ ఇచ్చి తన ప్రైవసీకి విలువ ఇచ్చేంత హుందాతనాన్ని సమాజం ప్రదర్శించలేదు" అని ఆమె అన్నారు.
https://twitter.com/Samanthaprabhu2
"ఇంటి పేరు తీస్తే బంధానికి పగుళ్లు వారినట్లేనా"?
"ఇంటి పేరు తీసినంత మాత్రాన బంధాలకు పగుళ్లు వారినట్లే అని ఊహిస్తే ఎలా, ఒకరి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఏ పేరు ఉండాలో వారిష్టం కాదా" అని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బిందు నాయుడు ప్రశ్నించారు.
భర్త లేకుండా పర్సనల్ ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేయాలనే ప్రశ్నలు కూడా వినిపించాయి. దీని చుట్టూ అనేక కథనాలు కూడా వెలువడ్డాయి.
"ఒక సినీ నటి ఎప్పుడూ భర్తతో ఉన్న ఫొటోలనే షేర్ చేయాలా? ఆమె షూటింగుల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఎవరితోనైనా ఫొటోలను పెట్టే అధికారం సదరు వ్యక్తికి ఉంటుంది. అందులో తప్పేముంది?" అని బిందు అడిగారు.
"సోషల్ మీడియాలో నవ్వుతూ పెట్టిన ఫొటోల వెనుక కూడా తెలియని దుఃఖపు పొరలు దాగి ఉండవచ్చు. విడాకులు తీసుకున్నంత మాత్రాన దిగులు పడుతూ, ఏడుస్తూ, మౌనంగా ఉండాలనే నియమం ఏమైనా ఉందా? ఇదంతా స్టీరియోటైప్ ఆలోచనా ధోరణికి, పురుషాధిక్య సమాజానికి నిదర్శనం పడుతోంది" అని బిందు అభిప్రాయపడ్డారు.
- పెళ్లైతే భర్త పేరు తగిలించుకోవాలా?': పాకిస్తాన్ అమ్మాయిల్లో మారుతున్న ట్రెండ్
- రేణూ దేశాయ్: స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు

"కౌగలింతలు భాగస్వామికి మాత్రమే పరిమితమా?"
సమంత డ్రెస్ డిజైనర్ తన ఇన్‌స్టా పేజీలో "ఐ వాంట్ టు హగ్ యూ యాజ్ ఇఫ్ దేర్ ఈజ్ నో టుమారో" అంటూ సమంతతో కలిసి ఉన్న ఫొటోను ఎందుకు షేర్ చేశారు? అని అడిగిన నెటిజన్ల ప్రశ్నకు...
"ఇద్దరు స్నేహితులు కలిసి ఫొటో తీసుకున్నా, పబ్లిక్‌గా షేర్ చేసినా అది తప్పుడు బంధమే అని అనడం సమాజం ఆలోచిస్తున్న తీరుకు అద్దం పడుతోంది. ఇలాంటి ధోరణి ప్రపంచమంతా ఉంది. ఒక్క భారతదేశంలోనే కాదు. ఈ ఆలోచనా విధానం మారాలి. ఇలా అయితే, ఇక కాలేజీలలో కూడా ఎవరూ తమ స్నేహితులతో ఫొటోలను పోస్ట్ చేయలేరు" అని బిందు అన్నారు.
"స్నేహితులు కౌగలించుకోకూడదా? కౌగలింతలు భాగస్వామికి మాత్రమే పరిమితమా" అని బిందు అడిగారు.
https://www.instagram.com/p/CU3xY4IpdXT/?utm_source=ig_web_copy_link
బంధం వీడితే మద్దతివ్వకూడదా?
అయితే, "సమంతను నేను ఒక సోదరిలా భావిస్తాను" అని ఆమె డిజైనర్ హైదరాబాద్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
"చైతన్య, సమంత నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు" అని అంటూ, ఇలాంటి అపవాదులను చైతన్య ఖండించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న మరొక సినీ నటి తన విడాకుల ప్రహసనం గురించి నాతో వ్యక్తిగత స్థాయిలో చర్చించారు.

"విడాకుల సమయంలో నేను భరణంగా చాలా డబ్బును తీసుకున్నాను" అనే రూమర్ వచ్చింది. ఆ సమయంలో నా మాజీ భర్తను నేనలా డిమాండ్ చేయలేదని, సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేయమని అభ్యర్ధించినప్పుడు, అందుకాయన అంగీకరించలేదు. అది నీ సమస్య. నాకు సంబంధం లేదని అన్నారు" అని చెబుతూ ఆమె బాధను నాతో వ్యక్తం చేశారు.
"ఒక్కసారి భార్యగా కాదనుకున్నాక, సమాజంలో వచ్చే అపవాదులను ఖండించే బాధ్యతను సదరు వ్యక్తి తీసుకుంటే తప్పేముంది? బంధం నుంచి బయటపడితే సహాయం చేయకూడదా?" అని ఆమె చాలా బాధతో ప్రశ్నించారు.
"నా ప్రపంచంలో నేనుంటున్నాను అని మీడియాకి కమ్యూనికేట్ చేయడం తప్పని, భర్త నుంచి ఎటువంటి ప్రకటనలూ లేనప్పుడు భార్య ఎందుకు సోషల్ మీడియాలో ప్రకటనలు చేయాలని సమంత విషయంలో కొందరు నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
అమ్మాయిలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం తప్పా?
ఇదే పరిస్థితిని నేను కూడా ఎదుర్కొన్నాను. నేను పెట్టే ప్రతీ పోస్ట్ అవతలి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని పెడుతున్నాననే నిందలు వేస్తూ ఉండేవారు.
"బంధాన్ని నిలబెట్టుకునేందుకు సోషల్ మీడియా డీయాక్టివేట్ చేసుకోవచ్చు కదా" అని సలహాలిస్తూ ఉండేవారు.
షేర్ చేసిన ప్రతీ విషయాన్ని తమకు అన్వయించుకుని తమ గురించే రాస్తున్నామని అనుకుంటే దానికి బాధ్యులెవరో ఇప్పటికీ నాకర్ధం కాని విషయం.
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!
"ఇదంతా పితృస్వామ్యం, అణిచివేతకు గురి చేసే ధోరణి ఎక్కువగా ఉన్న దృక్పథం నుంచి పుట్టింది. ఒక అమ్మాయి చేసే పనిని నిందిస్తే, రేపు మరో అమ్మాయి గొంతు విప్పదు అనే అభిప్రాయంతో ఇదంతా మహిళల పై చేసే దాడి" అని సత్యవతి పోచిరాజు అన్నారు.
"మహిళ ప్రవర్తన కొన్ని పితృస్వామ్య అభిప్రాయాల చట్రానికి లోబడే ఉండాలి. ఆ ఆలోచనా చట్రాన్ని దాటి మహిళ ఏ మాత్రం స్వతంత్రాన్ని ప్రదర్శించినా మన సమాజం ఆమోదించే పరిస్థితిలో లేదు. దీనికంతటికీ ఈ ఆలోచనా ధోరణే కారణం" అని ఆమె అన్నారు.
"ఎప్పుడూ అమ్మాయే సర్దుకుపోవాలి అనే తత్త్వం కొన్నేళ్లుగా మన సమాజంలో, మనసులో నాటుకుపోయింది. ఈ అభిప్రాయాలను రాత్రికి రాత్రే నిర్మూలించడం కూడా కష్టమే అని అంటూ, వ్యక్తిగత విషయాలను మీడియా కూడా కేవలం టీఆర్పీ కోసం, వ్యూస్ కోసం పెద్దవి చేసే రాసే పద్ధతిని మానుకున్నప్పుడే మార్పు సాధ్యం" అని శారద అభిప్రాయపడ్డారు.
"ఒక బంధం లోంచి బయటపడి నిలదొక్కుకుని, పరిస్థితిని ఆమోదించి ముందుకు సాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో కుటుంబం, స్నేహితులు, సమాజం నుంచి వ్యక్తి ఆశించేది కేవలం మద్దతు మాత్రమే" అని సత్యవతి అన్నారు.
నాకు కూడా ఇటువంటి పరిస్థితిని ఆమోదించి ధైర్యంగా మాట్లాడడానికి కనీసం ఒక రెండేళ్లు పైనే పట్టింది.
ప్రస్తుతం, సమంతకు కావల్సింది కూడా ఆ చిన్నపాటి ప్రైవసీ మాత్రమే అని నాకనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- 'ఇట్లు అమ్మ' సినిమా రివ్యూ: సమాజంలోని సమస్యలను అసామాన్యంగా నిలబెట్టి ప్రశ్నించిన తల్లి కథ
- కోట్ల సంపదను వదులుకుని సామాన్యుడిని పెళ్లి చేసుకుంటున్న జపాన్ రాకుమారి, అక్టోబరు 26న వివాహం
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
- మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ వస్త్రాలకు ఉన్న అనుబంధం ఎలాంటిది?
- గర్భస్రావం చేయించుకునే హక్కు విషయంలో అమెరికా కంటే భారత్ మెరుగ్గా ఉందా?
- ఈ ముస్లిం యువతి బాలకృష్ణుడి పెయింటింగ్స్ వేసి హిందూ ఆలయాలకు కానుకగా ఇస్తున్నారు
- శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
- ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారికి 'టూ ఫింగర్ టెస్ట్’
- ఆంధ్రప్రదేశ్: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా, కరెంటు కోతలు ఇంకా పెరుగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)