• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

1950లో మొదటి గణతంత్ర వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మౌంట్ బాటన్ దంపతులతో నెహ్రూ, రాధాక్రిష్ణ

జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం.

రిపబ్లిక్ డే రోజున దిల్లీలో ఎలాంటి సందడి ఉంటుందో టీవీల్లో చూస్తున్నారు. పేపర్లలో చదువుతున్నారు. కానీ 68 సంవత్సరాల క్రితం, మొదటి 'రిపబ్లిక్ డే’ ఎలా జరిగిందో మీకు తెలుసా?

ఆనాటి వేడుకలను కళ్లారా చూసిన వారు ఆరోజును ఎలా మరువగలరు?

ఆనాటి జ్ఞాపకాలను సీనియర్ వ్యాసకర్త ఆర్.వి.స్మిత్ బీబీసీతో పంచుకున్నారు.

1950 జనవరి 26న పురానా ఖిలా ఎదుట ఉన్న బ్రిటిష్ స్టేడియంలో రిపబ్లిక్ డే పెరేడ్ జరిగింది. డా. రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారి అక్కడే ఉన్నారు.

ఆ ఉదయం.. ఆ స్టేడియంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత పెరేడ్ ప్రారంభమయ్యింది. గాల్లోకి పేల్చిన తుపాకీ చప్పుళ్లు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి.

చివరి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లూయీస్ మౌంట్‌బాటన్ నుంచి గవర్నర్ జనరల్ బాధ్యతలను సి.రాజగోపాలాచారి అప్పటికే స్వీకరించి ఉన్నారు.

వీదేశీ పాలన పూర్తిగా అంతరించిపోయి, అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్ డే! స్వతంత్ర దేశంగా పురుడుపోసుకుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది.

అప్పటి బ్రిటన్ రాజు కింగ్ జార్జ్-Vl భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇండియాకు కామన్‌వెల్త్ దేశాల సభ్యత్వం కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

అప్పటికే అంతర్థానమైన నేతాజీ సుభాస్ చంద్రబోస్ 'దిల్లీ చలో' పిలుపునిస్తూ రిపబ్లిక్ డే వేడుకల్లో తిరిగి ప్రత్యక్షమవుతారన్న వార్తలు దావానంలా వ్యాపించాయి.

అప్పటికి రెండేళ్ల ముందే మహాత్మ గాంధీ మరణించారు. రిపబ్లిక్ వేడుకల్లో ఆయన లేకపోవడం లోటుగా కనిపించింది.

ఇప్పుడు జరుపుతున్నంత ఆర్భాటంగా ఆనాటి రిపబ్లిక్ డే వేడుకలు జరగలేదు. కానీ అప్పటికి ఆ వేడుకలు కూడా బ్రహ్మాండంగానే జరిగాయని చెప్పుకోవాలి.

రిపబ్లిక్ వేడుకల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్, సైనిక దళాలు పాల్గొన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాల శకటాలు ఆనాడు లేవు.

ఇప్పటిలా న్యూ దిల్లీ, ఎర్రకోటల మీదుగా పెరేడ్ సాగలేదు. ఆనాటి పెరేడ్ మొత్తం ఆ స్టేడియానికే పరిమితమైంది. కానీ 1951 నుంచి పెరేడ్ ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు.

2006లో రిపబ్లిక్ డే సంధర్భంగా జెట్ విమానాల విన్యాసాలు

వేడుకల్లో భాగంగా యుద్ధ విమానాల విన్యాసాలు జరిగాయి. కానీ ఆ విన్యాసాల్లో జెట్ విమానాలు, థండర్‌బోల్ట్ విమానాలు లేవు. అప్పటికి వినియోగంలో ఉన్న డకోటా, స్పిట్ ఫైర్స్ మాత్రమే విన్యాసాల్లో పాల్గొన్నాయి.

మొట్టమొదటి భారత సైన్యాధిపతి కరియప్ప. ఈయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఎంతో గౌరవం, కీర్తి సంపాదించిన వ్యక్తి.

''ఈరోజు నాకు, మీకు, మనతో పాటు మన కుక్కలకు కూడా స్వాతంత్ర్యం వచ్చింది'' అంటూ సైనికాధిపతి కరియప్ప బారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరియప్ప ప్రసంగం. అక్కడివారిలో ఆనందం, ఉత్సాహాన్ని నింపాయి.

ఇప్పటికీ నాకు గుర్తే. రిపబ్లిక్ డే సందర్భంగా జామా మసీద్ సమీపంలోని ఓ హోటల్ యజమాని అందరికీ స్వీట్లు పంచాడు. ఆ స్వీట్ల రుచి నాకింకా గుర్తుంది. అవి మహాద్భుతంగా ఉన్నాయి.

జెండాలతో బాలిక

చాందినీ చౌక్‌ను అందంగా ముస్తాబు చేశారు. వీధుల నిండా ప్రజలు. వారి చేతుల్లో చిన్నచిన్న జాతీయ జెండాలు. వారంతా చాలా ఉత్సాహంగా కనిపించారు. ఎక్కడచూసినా బంతిపూల హారాలు.

పూల వ్యాపారులు ఆ ప్రాంతమంతా రోజా పూలను చల్లారు. ఒకరికొకరు పువ్వులు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ఆగస్ట్ 15న పురుడుపోసుకున్న స్వతంత్ర భారతం.. 1950, జనవరి 26కు ఓ రూపం తీసుకుందన్న భావన వారిలో స్పష్టంగా కనిపించింది.

దిల్లీలో ప్రధాన కూడలి 'కన్నాట్ ప్లేస్‌’ను చాలా అందంగా ముస్తాబు చేశారు. నగరంలోని కొన్ని హోటళ్లు, ప్రధాన దుకాణాలు తమ అమ్మకాలపై డిస్కౌంట్లు కూడా ప్రకటించాయి.

ఇక ఆ రాత్రి చూడాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలన్నీ దీప కాంతులతో వెలిగిపోయాయి. రాష్ట్రపతి భవన్‌ను కొత్త పెళ్లికూతురిలా ముస్తాబు చేశారు.

ఎర్రకోట, పార్లమెంట్ భవనం, ఆల్ ఇండియా రేడియో కార్యాలయం, ఇండియా గేట్, అన్నిటి వైభవాన్ని ఆరోజు చూడాలి. ఆ అందమే వేరు!

మరోవైపు, క్లబ్బులు, రెస్టారెంట్లలో పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తూ.. ఒకటే కోలాహలం, సంబరం.. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే!

ఆ కాలంలో జీన్స్ ప్యాంట్లు లేవు. కానీ, పాశ్చాత్య దుస్తుల్లో కనిపించే అందమైన యువతులు క్లబ్బులు, రెస్టారెంట్లలో తళుక్కుమన్నారు. అమ్మాయిల విషయంలో యువకుల మధ్య ఒకట్రెండు చిన్నచిన్న గొడవలూ జరిగాయి.

ఎక్కడచూసినా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు గురించే చర్చలు నడిచాయి.

జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్ మరెందరో ఆ విందులో పాల్గొన్నారు.

చివరగా ఆ రాత్రి జరిగిన ముషాయిరాలు, కవిసమ్మేళనాలతో తొలి రిపబ్లిక్ డే వేడుకలు అలా ముగిశాయి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Do you know how the first Republic day celebrations took place in 1950
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X