వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హౌరా బ్రిడ్జిపై బస్సు

"యమహా నగరీ, కలకత్తా పురీ... నమహో హూగిలీ హౌరా వారధి... చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి!".... అంటూ బెంగాల్ బతుకు చిత్రాన్ని రెండు పల్లవులు, నాలుగు చరణాల్లో తెలుగు పాటలో బంధించారు సినీ కవి వేటూరి సుందర రామమూర్తి.

అయితే, బెంగాల్ రాష్ట్రంతో తెలుగు అనుబంధం ఈ పాట కన్నా చాలా ముందే... కొన్ని వందల ఏళ్ల క్రితమే మొదలయింది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలుగును అధికార భాషగా గుర్తిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఎన్నికలకు ముందు చేసిన ఈ ప్రకటన వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రయోజనం ఏదైనా, ఈ నిర్ణయం తెలుగు వారికి కూడా మేలు చేస్తుందని తెలుగు భాషా సంఘం సభ్యులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో బెంగాల్ రాష్ట్రంతో తెలుగు ప్రజలకు, సంస్కృతికి ఉన్న సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ తెలుగు.

కోల్‌కతా

18వ శతాబ్దంలో మొదలు

బెంగాల్‌కు తెలుగు ప్రజలకు ఉన్న అనుబంధం ఈ నాటిది కాదని, ఇది సుమారు 150 సంవత్సరాల పురాతనమైనదని అంటారు.

కోల్‌కతా రేవు, పరిశ్రమలు నడిచేందుకు కావల్సిన బొగ్గు, మానవ వనరుల లభ్యత, అంతర్జాతీయ ఎగుమతులకు అనువుగా ఉండటంతో హూగ్లీ నది ఒడ్డున ఉన్న రిష్ర దగ్గర 1855లో తొలి జ్యూట్ మిల్లు స్థాపన జరిగింది.

దీంతో, బ్రిటిష్ కాలంలోనే ఈ పరిశ్రమల్లో పని చేయడానికి తెలుగు వారి రాక మొదలయిందని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్ళపల్లి సుందర్ రావు చెప్పారు. ఆయన రైల్వే శాఖలో పని చేశారు. పదవీ విరమణ తరువాత కోల్‌కతాలోనే స్థిరపడ్డారు.

బెంగాల్‌కి, తెలుగు ప్రజలకు అప్పుడే సంబంధ బాంధవ్యాలు మొదలయ్యాయని ఆయన అంటారు. ఇక్కడికి ఎక్కువగా ఉత్తరాంధ్రలోని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ప్రజలు వలస వచ్చారని వివరించారు.

మొదట్లో జ్యూట్ పరిశ్రమకే పరిమితమైన తెలుగు వారి రాక 1902లో ఖరగ్‌పూర్‌లో లోకో రైల్వే వర్క్ షాపు ప్రారంభించడంతో మరింత పెరిగిందని ఆయన చెప్పారు.

కోల్‌కతా

పిఠాపురం నుంచి విశ్వభారతికి వెళ్లిన వీణ

బెంగాల్ విశ్వభారతి విశ్వవిద్యాలయంలో వీణకు ఒక సంగీత పాఠ్యాంశంగా స్థానం కల్పించింది తెలుగు వ్యక్తి తుమరాడ సంగమేశ్వర రావు అని చెబుతారు.

''రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంధ్ర దేశ పర్యటనలో భాగంగా పిఠాపురం మహారాజ ఆస్థానంలో సంగీత విద్వాంసుడు సంగమేశ్వరరావు వాయించిన వీణా వాయిద్యం విన్నారు. ఆయనను కోల్‌కతా ఆహ్వానించి విశ్వభారతి విశ్వవిద్యాలయంలో వీణను ఒక సబ్జెక్టుగా తరగతులు ప్రారంభించారు’’ అని సుందర్ రావు వివరించారు.

భారత జాతీయ గీతం జనగణమనకు తెలుగు రాష్ట్రానికి విడదీయరాని అనుబంధం ఉంది.

జనగణ మనను ప్రముఖ కవి జేమ్స్ క్యూజిన్స్ భార్య మార్గరెట్ తొలిసారిగా 1919లో చిత్తూరు జిల్లా మదనపల్లెలోనే స్వరపరిచారు.

అప్పుడు ఆమె భర్త ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీసెంట్ థియోసోఫికల్ కాలేజీలో ప్రధానాచార్యులుగా పని చేస్తున్నారు.

కోల్‌కతా

ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టింది కూడా కోల్‌కతా నుంచేనని సుందర్ రావు అంటారు. ఆయన మొదట్లో ఆంగ్లంలో రచనలను చేసేవారు.

''కానీ, శంభునాథ్ ముఖర్జీ అనే సంపాదకులు ఆయన రచనలను చూసి మీరు కవిత్వం బాగా రాస్తున్నారు. కానీ, మీ మాతృ భాషలో రాస్తే మీరు బాగా రాణిస్తారు’ అని సలహా ఇవ్వగా, అప్పటి నుంచే ఆయన తెలుగులో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారని చెబుతారు’’ అని సుందర్ రావు చెప్పారు.

హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణ దాసును కూడా ఠాగూర్ ఇంటికి పిలిపించుకుని సంస్కృతంలో హరికథా గానం చేయించుకున్నారని, విశాఖపట్నంలో జరిగిన కవి సమ్మేళననానికి కూడా ఠాగూర్ హాజరయ్యారని అన్నారు.

శరత్, ఠాగూర్ లాంటి కవులు రచించిన బెంగాలీ సాహిత్యం తెలుగులోకి అనువాదం జరిగి తెలుగు సాహిత్యాభిమానుల ప్రశంసలు అందుకుంది.

కోల్‌కతా

తెలుగు విద్యాలయాలు

పశ్చిమ బెంగాల్‌లో తెలుగు బోధించే 133 ప్రైమరీ పాఠశాలలు, 9 హై స్కూళ్ళు ఉన్నాయని సుందర రావు తెలిపారు.

వీటిని తెలుగు వారే నిర్వహిస్తున్నారు. అయితే, బెంగాల్‌లో విద్యా వ్యవస్థ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. టిటాగఢ్ , శ్రీ రామ్ పూర్ ప్రాంతంలో కూడా కొన్ని తెలుగు మీడియం స్కూళ్ళు ఉన్నాయి.

కోల్‌కతాలో 1936లో ఆంధ్ర సంఘాన్ని స్థాపించారు. ఆంధ్ర అసోసియేషన్ స్కూలులో 12వ తరగతి వరకు తెలుగు బోధనాంశంగా ఉంది. ఇందులో 1000 మంది పిల్లలు చదువుతున్నట్లు కోల్‌కతా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ వేదుల చెప్పారు. ఆయన 1980 నుంచి కోల్‌కతాలోనే నివాసం ఉంటున్నారు.

కోల్‌కతా

పశ్చిమ బెంగాల్ అంతటా సుమారు 5 లక్షల మంది తెలుగు వారు ఉండగా, వారిలో లక్ష మంది ఖరగ్‌పూర్‌‌లో ఉన్నారని సుందర్ రావు అన్నారు.

ఖరగ్‌పూర్‌‌లో ఏడో తరగతి వరకు పూర్తిగా తెలుగులో చెప్పే కొన్ని పాఠశాలలు ఉన్నాయి.

"తెలుగుకు అల్ప సంఖ్యాక భాష హోదా కావాలని ఇక్కడ ఉపాధ్యాయులు గత మూడేళ్ళుగా పోరాటం చేశారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. దీని వల్ల తెలుగు వారికి గుర్తింపు లభించి ప్రయోజనం చేకూరుతుందనే భావిస్తున్నాం" అని సుందర్ రావు అన్నారు.

కోల్‌కతా ఆంధ్ర సంఘంలో 1000 మంది వరకు సభ్యులుగా ఉన్నట్లు శ్రీనివాస్ వేదుల చెప్పారు.

ఇన్నేళ్ల తరువాత అకస్మాత్తుగా తెలుగుకు అధికార భాష హోదా కట్టి పెట్టడం ఆశ్చర్యంగా ఉందని బ్రహ్మానంద కేశవ చంద్ర కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ నిషి పులుగుర్త అన్నారు. ఆమె కూడా తెలుగు వారే.

ప్రయోజనం ఎవరికి?

''తెలుగుకు అల్ప సంఖ్యాక భాషగా అధికారిక హోదా లభిస్తే టీచర్ ట్రైనింగ్ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, కోల్‌కతా యూనివర్సిటీలలో తెలుగును ఒక భాషగా పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. తెలుగు బోధించే టీచర్లు దొరికితే పాఠశాలలు కొనసాగించవచ్చు" అని శ్రీనివాస్ వేదుల అభిప్రాయపడ్డారు.

బెంగాల్‌లో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే స్థానిక నివాసిగా ధ్రువీకరణ ఉండాలని, తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగం రావాలంటే అది అధికారిక భాష అమలుతోనే సాధ్యం అవుతుంది అని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిధులు కూడా రావొచ్చని అన్నారు.

''ఎన్నికల ముందు ప్రకటన చేయడంలో రాజకీయం ప్రయోజనం కూడా ఉండి ఉంటుంది. కానీ, ఈ నిర్ణయం ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూర్చేదే. నూతన జాతీయ విద్యా విధానం కూడా మూడు భాషలను ప్రవేశపెట్టాలని సూచిస్తుండటంతో మాతృ భాషను నేర్చుకోవడం చాలా అవసరం’’ అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

కోల్‌కతా

మినీ ఆంధ్ర - ఖరగ్‌పూర్‌

ఖరగ్‌పూర్‌ను మినీ ఆంధ్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని తరాలుగా స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఉన్నాయి.

"మేమున్న ప్రాంతం బెంగాల్‌లో ఉన్నట్లు కాదు, ఆంధ్రలో ఉన్నట్లే అనిపిస్తుంది’’ అని ఖరగ్‌పూర్‌లో పోలీసుశాఖలో ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్ అన్నారు.

తన తండ్రి రైల్వే ఉద్యోగం కోసం బెంగాల్‌కు వలస వచ్చారని, తాను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నానని ఆయన చెప్పారు. ఖరగ్‌పూర్‌ను తమ సొంత ఊరిగా భావిస్తామని, పరాయి రాష్ట్రంలో ఉన్న భావన తమకు కలగదని అన్నారు.

స్థానిక రాజకీయాల గురించి మాట్లాడుతూ ఖరగ్‌పూర్‌లో కూడా కౌన్సిలర్ల స్థాయిలో తెలుగు వారు ఉన్నారని చంద్రశేఖర్ చెప్పారు.

హరియాణా రాష్ట్రంలో 50 ఏళ్ల క్రితమే తెలుగు భాషను ద్వితీయ భాషగా ప్రవేశ పెట్టాలని అప్పటి ముఖ్యమంత్రి బన్సీ లాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం. ఆ రాష్ట్రానికి పంజాబ్‌తో ఉన్న వివాదాల వల్ల, దక్షిణాన తమిళ నాడులో హిందీ భాష వ్యతిరేకోద్యమం నడవడం వలన కూడా ఇలా నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తారు.

అయితే, ఈ నిర్ణయం ఊహించిన రీతిలో విజయవంతం కాలేదు.

హరియాణాలో పలువురు తెలుగు ప్రజలు ఉండటంతో యూనివర్సిటీలలో, విద్యాలయాలలో తెలుగును తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన ఉందని, హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ 2017లో హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు.

హరియాణాలోని ప్రతి జిల్లాలో 10 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం తెలుగును బోధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telugu people have a lot of connection with west bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X