• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలవరం ప్రాజెక్టును కేంద్రం పట్టించుకోవడం లేదా...ఏపీ ప్రభుత్వ ప్రణాళిక ఏంటి, పునరావాస ప్యాకేజీకి నిధులు ఎలా ?

By BBC News తెలుగు
|

స్పిల్ వే గుండా నీటిని విడుదల చేస్తూ నదీ ప్రవాహం మళ్లించిన నేపథ్యంలో కొంత ఆశావహ పరిస్థితులు కనిపించినప్పటికీ, ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నేటికీ పునాదుల దశలోనే ఉంది.

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టు హోదా సాధించిన పోలవరం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదు.

ఈ మధ్య, స్పిల్ వే గుండా నీటిని విడుదల చేస్తూ నదీ ప్రవాహం మళ్లించిన నేపథ్యంలో కొంత ఆశావహ పరిస్థితులు కనిపించినప్పటికీ, ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నేటికీ పునాదుల దశలోనే ఉంది.

విద్యుత్ ఉత్పాదన కేంద్రం నిర్మాణమే మొదలుకాలేదు. దాంతో పాటు పునరావాసం పది శాతం కూడా పూర్తికాలేదు. ఒకపక్క భారీ ఖర్చు కనిపిస్తుండగా, ఇటీవల కేంద్రం కొన్ని బిల్లులను వెనక్కి పంపించడంతో ఆందోళన నెలకొంది.

పోలవరం నిర్మాణం విషయంలో జరిగిన జాప్యం కారణంగా అంచనా వ్యయం పెరిగిపోతోంది. అయితే, దాన్ని సవరించడానికి కేంద్రం నుంచి ఇప్పటి వరకూ సానుకూల స్పందన రాలేదు.

తాజాగా దిల్లీలో జరిగిన కీలక సమావేశంలో కూడా కేవలం చర్చలే తప్ప, హామీలు ఇవ్వకపోవడంతో ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు నిరాశ చెందారు.

ఈ నేపథ్యంలో, పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన వ్యవహారంలో ఏం జరుగుతోందనే దానిపై స్పష్టత కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

పోలవరానికి భారీ ఖర్చులు ముందు కనిపిస్తుండగా, కేంద్రం కొన్ని బిల్లులను వెనక్కి పంపడంతో నిధులపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే కానీ...

అంతర్రాష్ట్ర వివాదాలతో కూడిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2013 సెక్షన్ 90(1) ప్రకారం, జాతీయ హోదా దక్కించుకున్న ఈ ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేయాల్సి ఉంది.

అదే చట్టంలోని సెక్షన్ 90(4) ప్రకారం, నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడంతో కావలసిన నిధులను కేంద్రం సమకూరుస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వ హయంలో పోలవరం నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం నాబార్డ్ ద్వారా రీయింబర్స్‌మెంట్ చేసేందుకు అంగీకరించింది.

అప్పట్లో ట్రాన్స్ ట్రాయ్, ఆ తర్వాత నవయుగ కంపెనీల ఆధ్వర్యంలో నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం చూసింది.

ప్రస్తుతం జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చి, రివర్స్ టెండరింగ్ పద్ధతిలో మిగలిన పనులు పూర్తి చేసేందుకు మేఘ కంపెనీని రంగంలోకి తెచ్చింది.

2019 నవంబర్ నుంచి మేఘ సంస్థ ఈ పనులు సాగిస్తోంది. రూ.4,358 కోట్ల‌కు కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న ఈ సంస్థ ఇటీవల స్పిల్ వే, స్పిల్ ఛానల్‌తో పాటు అప్రోచ్ ఛానల్‌, పైలట్ ఛానల్‌‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

పోలవరం ప్రాజెక్టు పునరావాసం 10 శాతం కూడా పూర్తి కాలేదు.

అంచనా వ్యయం విషయంలో అంతరం

పోలవరం నిర్మాణానికి అంచనా వ్యయం విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య అంతరం కనిపిస్తోంది. వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటనలో కూడా కేంద్ర మంత్రులను కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనా వ్యయం సవరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తొలుత నిర్ణయించిన ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాక‌పోవ‌డం, 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌ల్లోకి రావ‌డంతో అంచ‌నాలను స‌వ‌రించాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం అంటోంది.

2013-14 నాటి అంచనాలను మార్చి తాజాగా పోల‌వ‌రం నిర్మాణ వ్య‌యాన్ని రూ.55,548.87 కోట్లుగా లెక్కించింది. ఇందుకు కేంద్రం అనుమతి కోసం ఎదురు చూస్తోంది.

ప్రాజెక్టుపై సవివర నివేదిక(డీపీఆర్)-2కు పోల‌వ‌రం టెక్నిక‌ల్ అడ్వైజరీ క‌మిటీ నుంచి ఇప్పటికే ఆమోదం లభించింది. ఇక, కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉంది.

దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం ల‌భిస్తే రూ.34,489 కోట్లు అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. పెరిగిన మొత్తంలో అత్యధికం పునరావాసానికే ఖర్చు అవుతుందని ఏపీ ప్రభుత్వం అంటోంది.

పోలవరం ప్రాజెక్టుతో మొత్తం 371 ఆవాసాల‌కు చెందిన 1,05,601 కుటుంబాలు ప్ర‌భావితమవుతాయి. వాటిలో ఇప్ప‌టి వరకు 3,922 కుటుంబాల‌కు మాత్రమే పున‌రావాసం క‌ల్పించారు.

పున‌రావాసం కోసం ఇప్ప‌టివరకు రూ.6,371 కోట్లు ఖ‌ర్చుచేయ‌గా, ఇంకా రూ.26,796 కోట్లు అవ‌స‌రం ఉందన్నది డీపీఆర్-2 అంచనా.

కానీ, 2017 మార్చిలో జరిగిన క్యాబినెట్ తీర్మానాన్ని అనుసరించి 2014 తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరిగితే, కేంద్రానికి బాధ్యత లేదని వాదిస్తోంది.

పైగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కూడా 2013 ముందు నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటామని ఆనాటి క్యాబినెట్ నోట్‌లో పేర్కొన్న అంశాన్ని కేంద్రం ప్రస్తావిస్తోంది.

ప్రాజెక్టును వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి అనుగుణంగా పనులు సాగుతున్నాయి

బిల్లులు వెనక్కు పంపించారు

పోలవరం ప్రాజెక్టు కోసం 2013-14 అంచనాల ప్రకారం రూ.20,398 కోట్లు మాత్రమే పరిగణలోకి తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

జాతీయ హోదా రావడానికి ముందు ఖర్చు చేసిన రూ.4730 కోట్లు లెక్కల్లోకి తీసుకోవడం లేదని చెబుతోంది. మిగిలిన రూ.15,668 కోట్లు మాత్రమే తాము చెల్లించాల్సిన మొత్తంగా చెబుతోంది.

విద్యుత్ కేంద్ర నిర్మాణం, ఇతర కాలువల నిర్మాణాలకు సంబంధించిన ఖర్చు చెల్లించడానికి ససేమీరా అంటోంది.

ఎడమ కాలువ నిర్మాణానికి అయిన ఖర్చు రూ.169.1 కోట్ల బిల్లుతో పాటుగా, కుడి కాలువ కోసం చేసిన ఖర్చు రూ.57.18 కోట్లకు సంబంధించిన బిల్లులను ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కేంద్రానికి పంపించారు.

కానీ వాటిని తాము చెల్లించబోమంటూ కేంద్రం వెనక్కు పంపించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం లేఖ కూడా రాశారు. అయినా కేంద్రం నుంచి హామీ రాలేదు.

పోలవరం నిర్మాణానికి అంచనా వ్యయం విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య అంతరం కనిపిస్తోంది. వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

పోలవరం కోసం కేంద్రం ఏమిచ్చింది?

2016 సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన F.NO.1(2)PF-1/2014(PT) ప్రకారం, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి బదిలీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రమే ప్రాజెక్ట్ నిర్మిస్తుందని ప్రకటించారు. 2014 జనవరి 1 నాటికి ఇరిగేషన్ వాటా మొత్తం కేంద్రం అందిస్తుందని ఒప్పందం. 2014 నుంచి ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం రూ.950 కోట్లు మాత్రమే కేటాయించింది.

వీటితోపాటూ నాబార్డ్ నుంచి వచ్చిన నిధులను కూడా పరిగణనలోకి తీసుకుంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా రూ. 2414.16 కోట్లు విడుదల చేశారు.

2017లో నాలుగు విడతల్లో నాబార్డ్ నుంచి ప్రాజెక్ట్ కోసం రెండు వేల కోట్లు నిధులు వచ్చాయి. 2018లో రూ.1400 కోట్లు, 2019లో రూ.1850 కోట్ల చొప్పున విడుదలయ్యాయి. దాంతో నాబార్డ్ నుంచి మొత్తం రూ.7664.16 కోట్ల నిధులు వచ్చాయి.

ఇక కేంద్రం నుంచి నేరుగా వచ్చిన రూ.950 కోట్లు కలుపుకుంటే గత ఏడేళ్లలో పోలవరం కోసం వచ్చిన మొత్తం నిధులు రూ.8614.16 కోట్లు. మిగిలిన రూ. 7053 కోట్లు మాత్రమే నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తామని కేంద్రం అంటోంది.

దిల్లీ సమావేశంలోనూ ఏపీకి నిరాశ

కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్‌తో సహా ఇరిగేషన్ శాఖకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. డీపీఆర్-2ను ఆమోదించి, నిర్మాణ అంచనాలు సవరించాలని కేంద్రాన్ని కోరారు.

అయితే, కేంద్ర అధికారుల నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో అసంతృప్తి చెందారు.

కేవలం సమాచారం తెలుసుకున్నారని, వచ్చే ఏడాదికి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలపై చర్చ సాగిందని ఏపీ ఇరిగేషన్ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి, బీబీసీకి తెలిపారు.

"ప్రాజెక్ట్ అంచనా వ్యయం సవరించాల్సి ఉంది. దాని కోసం ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి స్థాయిలోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు, సీఎస్ సారధ్యంలో కేంద్రంతో ఈ విషయాన్ని ప్రస్తావించాం. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. ప్రాజెక్టును వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి అనుగుణంగా పనులు సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు, సీడబ్య్లూసీ అధికారులు కూడా నిర్మాణానికి సంబంధించిన విషయాలను చర్చించారు" అని ఆయన వివరించారు.

పోలవరం నిర్మాణంలో జాప్యం కారణంగా అంచనా వ్యయం పెరిగిపోతోంది. దాన్ని సవరించడానికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.

స్పిల్ వే గుండా ప్రవాహం, మెయిన్ డ్యామ్‌కు ఆటంకాలు తొలగినట్టే

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వే సిద్ధమయ్యింది. ఇటీవల ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు మూసివేసి గోదావరి నదీ ప్రవాహం మళ్లించారు. 6.6 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం స్పిల్ వే గుండా సాగుతూ, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ నుంచి దిగువన సహజ ప్రవాహంలో చేరాయి.

దాంతో గోదావరి వరదల సమయంలో 25లక్షల క్యూసెక్కులకు ప్రవాహం పెరిగినా, అందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు అంటున్నారు.

అదే సమయంలో స్పిల్ వే ద్వారా మెయిన్ డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి రాకపోకలకు అవకాశం ఏర్పడింది. దాంతో వరదల సమయంలో కూడా పనులకు ఆటంకం లేకుండా పోయింది.

అయితే, మెయిన్ డ్యామ్ నిర్మాణం కోసం భారీగా నిధుల అవసరం ఉంటుంది. దానిని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా సేకరిస్తుందనే దానిపై ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

వచ్చే జూన్ నాటికి పోలవరం సిద్ధమవుతుందని ప్రకటనలు చేస్తున్నప్పటికీ మెయిన్ డ్యామ్‌తో పాటుగా టన్నెల్స్ కూడా అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. వాటికి ప్రభుత్వం నిర్దేశించిన గడువు సరిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చి, రివర్స్ టెండరింగ్ పద్ధతిలో మిగలిన పనులు పూర్తి చేసేందుకు మేఘ కంపెనీని రంగంలోకి తెచ్చింది.

నిర్వాసితులకు న్యాయం దక్కేనా?

పునరావాసం కేటాయించకుండా నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. 2007 నుంచి ప్రారంభించి ఇప్పటి వరకూ పునరావాసంలో 10శాతం మాత్రమే పూర్తి చేశారు.

మిగిలిన వారికి న్యాయం జరగాలంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సిందే. ఏపీ ప్రభుత్వం ఆదాయం కోసం ఆస్తులు తనఖా పెట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నందున పునరావాస ప్యాకేజీ బాధ్యత కేంద్రం తీసుకోవాల్సిందేనని కోరుతున్నారు.

నిర్వాసితుల విషయంలో ఏపీ ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేదని ఏపీ గిరిజన సంఘం నాయకుడు లోతా రాంబాబు అంటున్నారు.

"మార్చి నాటికి పునరావాస కాలనీలు సిద్ధం చేసి 41.5 అడుగుల ఎత్తులో ముంపు బారిన పడే వారందరికీ న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు వరదలు వచ్చేస్తున్నాయి. కానీ కాలనీలు లేవు. కనీసం ప్యాకేజీ కూడా అమలు చేయలేదు. అధికార పార్టీ నేతలకు మాత్రమే ప్యాకేజీ అందిస్తున్నారు. నిజమైన గిరిజనులను నిర్లక్ష్యం చేస్తున్నారు.’’ అని ఆయన విమర్శించారు.

ఎన్నికల ముందు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిధుల కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి తప్ప తమను ముంచేయడం సరికాదని నిర్వాసితులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Does the Center care about the Polavaram project,What is the AP government plan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X