సహనాన్ని పరీక్షించొద్దు .. ఆర్మీ డే సందర్భంగా చైనా , పాకిస్థాన్ లకు ఆర్మీ చీఫ్ నరవాణే వార్నింగ్
తమ సహనాన్ని పరీక్షించవద్దు అని చైనాకు పరోక్ష హెచ్చరిక చేశారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే. ఢిల్లీలో జరిగిన ఆర్మీ డే పెరేడ్ సందర్భంగా మాట్లాడిన ఆయన చైనా , పాకిస్థాన్ లపై విరుచుకుపడ్డారు. గాల్వాన్ దాడిలో అమరులైన వీరుల త్యాగాలు వృధాగా పోనివ్వమనీ భారత సరిహద్దుల్లో చైనా ఏకపక్ష మార్పులు చేసే కుట్రకు తగిన జవాబు చెప్పబడిందని, తూర్పు లడఖ్‌లో వీరుల త్యాగాలను వృధా కానివ్వమని ఆర్మీ చీఫ్ నరవాణే పేర్కొన్నారు.

భారత్ సహనాన్ని పరీక్షించొద్దు.. వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్
చర్చలు, రాజకీయ ప్రత్యామ్నాయ ద్వారా భారత్ - చైనా దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్న ఆయన మితిమీరి సహనాన్ని పరీక్షించవద్దని చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గాల్వన్ వీరుల త్యాగం వృధా కాదని నేను దేశానికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు నరవాణే. దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు భారత సైన్యం రక్షణగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

చైనా భారత్ ల మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న ప్రతిష్టంభన
గాల్వాన్ వ్యాలీలో గత ఏడాది జూన్ 15వ తేదీన జరిగిన భీకర పోరాటంలో 20 మంది భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఇక అప్పటి నుంచి చెలరేగిన వివాదం ప్రతిష్టంభన దిశగా సాగుతూనే ఉంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారత్, చైనాల మధ్య 8 రౌండ్ల సైనిక చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారం కోసం తాము ప్రయత్నాలు సాగిస్తున్నట్లు గానే ఇండియన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్థాన్ కి కూడా ఘాటుగానే హెచ్చరిక చేశారు నరవాణే.

పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషించటంపై మండిపడిన నరవాణే
పాకిస్తాన్ సరిహద్దు నుండి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది అని, పొరుగుదేశం ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామంగా మారిందని నరవాణే పేర్కొన్నారు. గతేడాది ఇరుదేశాల మధ్య కాల్పులు ఘటనలు 44 శాతం పెరిగాయని, అది పాకిస్తాన్ మోసపూరిత బుద్ధిని బయట పెడుతోందని ఆయన స్పష్టం చేశారు. శిక్షణా శిబిరాలలో, నియంత్రణ రేఖ వెంట సుమారు 300 నుండి 400 మంది ఉగ్రవాదులు చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అయినప్పటికీ అప్రమత్తంగా భారత్ సైన్యం ఉందని ప్రకటించారు నరవాణే.

ఆర్మీ డే సందర్భంగా అనేక విషయాలు వెల్లడించిన ఆర్మీ చీఫ్
నియంత్రణ రేఖ వద్ద గతేడాది రెండు వందల మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు గా ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది సుమారు ఐదు వేల కోట్ల ఖరీదైన ఆయుధాలను ఆర్మీ ప్రొక్యూర్ చేసినట్లుగా పేర్కొన్న నరవాణే సుమారు 13 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆధునికీకరణ కోసం ఆర్మీ అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్న ఆయన ఎమర్జెన్సీ ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఆ పనులు జరుగుతున్నట్లుగా తెలిపారు. మొత్తానికి ఆర్మీ డే సందర్భంగా అటు చైనాకు, ఇటు పాకిస్థాన్ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు నరవాణే.
మేం దేనికైనా సిద్ధమే..డ్రాగన్ సైన్యం వెనక్కు వెళ్ళటంపై స్పందించిన ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే