ఎవరినీ వదలిపెట్టం, మా వారైతే డబుల్ పనిష్మెంట్: అరవింద్ కేజ్రీవాల్, పరిహారం ఇలా..
న్యూఢిల్లీ: అల్లర్లకు కారణమైన వారిని ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరైనా ఇందుకు కారణమైతే వారికి శిక్ష రెండింతలు ఉంటుందని హెచ్చరించారు.
దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అల్లర్ల గాయపడిన క్షతగాత్రులకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులు కూడా ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఏ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా వైద్య ఖర్చులు చెల్లిస్తామని అన్నారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇంటెలీజెన్స్ బ్యూర్(ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్యలో కీలక పాత్ర పోషించింది ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ అంటూ వస్తున్న ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించారు. అల్లర్లకు కారణమైన వారిని ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందినవారు హింసకు కారణమైతే రెండింతల శిక్ష విధిస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పదార్థాలు అందించే కార్యక్రమం చేపట్టింది.
అల్లర్ల బాధితులకు కేజ్రీవాల్ ప్రకటించిన పరిహారం ఇలా..
మృతి చెందిన వారి కుటుంబానికి రూ. 10 లక్షలు
మృతి చెందిన మైనర్ కుటుంబానికి రూ. 5 లక్షలు
తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు
అనాథలుగా మారిన వారికి రూ. 3 లక్షలు
రిక్షాలు కోల్పోయిన వారికి రూ. 25వేలు
ఈ రిక్షాలు కోల్పోయిన వారికి రూ. 50వేలు
ఇళ్లు కోల్పోయిన(దగ్ధం చేయబడినవి)వారికి రూ. 5 లక్షలు
పాక్షికంగా తగలబడిన ఇళ్లకు రూ. 2.5లక్షలు
కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఆదివారం నుంచి బుధవారం వరకు జరిగిన ఘర్షణల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా ఉండటం గమనార్హం. పలు ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు తగలబెట్టారు ఆందోళనకారులు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులతోపాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగడంతో బుధవారం నాటికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.