సిగ్గు శరం ఉంటే ఆ పని చేయండి..పహల్గామ్ వీరుడి భార్య సంచలన కామెంట్స్
పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటంపై భారతీయులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాల వేదనను విస్మరించి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం తగదని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభమ్ ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈలో జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆమె ప్రజలను, క్రికెటర్లను కోరారు.
దేశభక్తిపై ప్రశ్నించిన ఐశాన్య ద్వివేది
ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఐశాన్య ద్వివేది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "దయచేసి ఈ మ్యాచ్‌ను బహిష్కరించండి. ఎవరూ స్టేడియంకు వెళ్ళి చూడొద్దు, కనీసం ఇళ్లలో టీవీలు కూడా ఆన్ చేయొద్దు" అని ప్రజలను కోరారు. బీసీసీఐ వైఖరిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. "ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల బీసీసీఐకి ఏమాత్రం సానుభూతి లేదా?" అని ఆమె ప్రశ్నించారు.

భారత క్రికెటర్ల దేశభక్తిపై కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. "మన క్రికెటర్లు ఏం చేస్తున్నారు? వారిని దేశభక్తులు అంటారు కదా. ఒకరిద్దరు తప్ప ఎవరూ పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడొద్దని ముందుకు రావడం లేదు. తుపాకీ గురిపెట్టి బీసీసీఐ వారిని ఆడించడం లేదు కదా? దేశం కోసం వారు గట్టిగా నిలబడాలి" అని విమర్శించారు.
ఉగ్రవాదానికి ఆదాయం అందించవద్దు
ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం ఉగ్రవాదానికే వెళుతుందని ఐశాన్య ద్వివేది ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ మ్యాచ్ స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లను నేను అడగాలనుకుంటున్నాను. ఆ 26 కుటుంబాల విషయంలో మీ దేశభక్తి ఏమైంది?" అని ప్రశ్నించారు. పాకిస్థాన్‌ను "ఉగ్రవాద దేశం"గా అభివర్ణించిన ఆమె, ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదం కోసం వాడుతుందని చెప్పారు. "మనం వారికి ఆదాయం అందించి, మళ్లీ మనపైనే దాడి చేయడానికి మనమే వారిని సిద్ధం చేసినట్లు అవుతుంది" అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.
సెప్టెంబర్ 14న జరగనున్న ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆమె చేసిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బహుళ దేశాల టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో ఆడేందుకు కేంద్రం అనుమతించినప్పటికీ, ద్వైపాక్షిక సిరీస్‌లపై నిషేధం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications