దర్శనం ఇచ్చిన బద్రీనాథుడు
Badrinath dham: దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి- బద్రీనాథ్. దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. బద్రీనాథ్‌తో కలిపి చార్ ధామ్ యాత్రల్లో పాల్గొంటుంటారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరచుకున్నాయి.
ఈ తెల్లవారు జామున సరిగ్గా 6 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బద్రీనాథుడికి తొలి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి 10 వేల మందికి పైగా భక్తులు బద్రీనాథ్ క్షేత్రానికి చేరుకున్నారు.

ఆలయం తలుపులు తెరచుకున్న వెంటనే భక్తులు బద్రీనాథుడికి స్మరించుకున్నారు. జయజయధ్వానాలు చేశారు. ఆలయ ఘంటానాదంతో బద్రీనాథ్ ప్రాంతం మొత్తం పులకించిపోయింది. పండగ వాతావరణం నెలకొంది. ఆలయం, భక్తులపైనా హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు. ఆర్మీ బ్యాండ్ సంగీతాన్ని వినిపించింది.
శనివారం పాండుకేశ్వర్‌లోని యోగా ధ్యాన బద్రీ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆది గురు శంకరాచార్యుల సింహాసనాన్ని ఆలయ ప్రధాన పూజారి రావల్ అమర్‌నాథ్ నంబూద్రి, పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ తప్లియాల్, అర్చకులు.. బద్రీనాథ్ మందిరానికి తీసుకొచ్చారు. ఈ తెల్లవారు జామున ఆలయం తలుపులను తెరిచారు.
ఈ సంవత్సరం బద్రీనాథ్ తీర్థయాత్రకు పాలిథిన్‌ను నిషేధించినట్లు బద్రీనాథ్- కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఛమోలి జిల్లా అధికార యంత్రాంగం సైతం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణ ప్రయాగ్, గౌచార్, నందప్రయాగ్, పిప్పల్‌కోటి, జ్యోతిర్మఠ్, గోవింద్‌ఘాట్, పాండుకేశ్వర్‌లలో హోటల్ నిర్వాహకులు తప్పనిసరిగా రేట్ల జాబితాలను ప్రదర్శించాలని ఛమోలీ జిల్లా కలెక్టర్ సందీప్ తివారీ ఆదేశించారు.
కేదార్‌నాథ్ ఆలయం కూడా ఇదివరకే తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 2వ తేదీన ఈ ఆలయం ఓపెన్ అయ్యాయి. ఈ సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించారు. శివాష్టకం, శివతాండవాష్టకం, కేదారాష్టక మంత్రాలతో ఆలయ ప్రాగణం మొత్తం ప్రతిధ్వనించింది. మొత్తం 2,500 మంది భక్తులు తొలి పూజల్లో పాల్గొన్నారు. కేదారేశ్వరుడి నామస్మరణ చేస్తూ అఖండ జ్యోతిని దర్శించుకున్నారు.
కేదార్‌నాథ్ ఆలయం తలుపు తెరచుకోవడంతో చార్ ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైనట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. భక్తుల కోసం ఆయా ఆలయాలన్నీ తెరచుకున్నాయి. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల పరిసరాల్లో అంటే 50 మీటర్ల వరకు రీల్స్ చేయడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించింది.
వీడియోలు తీయడంపైనా నిషేధం జారీ అయింది. 200 మీటర్ల పరిధిలో సెల్ ఫోన్ వినియోగంపై కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆలయం పునఃప్రారంభ వేడుకలను ఇందులో నుంచి మినహాయించారు. చార్ ధామ్ యాత్రపై ఉద్దేశపూరకంగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉన్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు.












Click it and Unblock the Notifications