కోవిడ్ వల్ల ఇంటిపెద్ద చనిపోవడంతో శ్మశానంలో తలదాచుకున్న కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు: ప్రెస్ రివ్యూ
కోవిడ్ వల్ల నిరాశ్రయులై శ్మశానంలో తలదాచుకున్న ఒక కుటుంబానికి మంత్రి హరీశ్ రావు డబుల్ బెడ్ రూం ఇల్లు అందించారని నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.
ఇంటిపెద్దను కోల్పోయి, సొంతిల్లు లేక శ్మశానవాటికలో తలదాచుకుంటున్న కొవిడ్ బాధిత కుటుంబానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొండంత అండగా నిలిచారు.
డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేయడంతోపాటు తక్షణసాయంగా రూ.10 వేలు, నెలకు సరిపడా సరుకులు ఇప్పించారని పత్రిక రాసింది.
సిద్దిపేట పట్టణానికి చెందిన కొత్వాల్ శ్రీనివాస్ క్షౌరవృత్తితో కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఇటీవల కరోనా బారినపడటంతో హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూ మూడురోజుల క్రితం మృతిచెందాడు.
ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదని యజమాని స్పష్టం చేయడంతో శ్రీనివాస్ భార్య సుజాత, కుమారుడు రుచిత్, కూతురు దీక్ష శ్రీరామకుంట శ్మశానవాటికలో తలదాచుకుంటున్నారు.
శనివారం ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు తక్షణమే స్పందించారు. సిద్దిపేట అర్బన్ తాసిల్దార్ విజయ్‌సాగర్‌ను అక్కడికి పంపించారు.
వారితో మంత్రి హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారని నమస్తే తెలంగాణ రాసింది.
సిద్దిపేట కేసీఆర్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేస్తున్నట్టు తెలిపారు.
అనంతరం మంత్రి ఆదేశాలతో అర్బన్ తాసిల్దార్ విజయ్‌సాగర్, డిప్యూటీ తాసిల్దార్ రాజేశం శ్మశానవాటికలో ఉంటున్న వారిని తీసుకెళ్లి, కేసీఆర్‌నగర్‌లోని 127వ బ్లాక్‌లో డబుల్ బెడ్రూం ఇల్లు అప్పగించారని నమస్తే తెలంగాణ వివరించింది.
- బండ్లపల్లి: ఉపాధి హామీ అమల్లోకి వచ్చిన తొలి గ్రామం ఎలా మారింది?
- పార్టీ కార్యాలయాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చిన సీపీఎం.. మిగిలిన పార్టీలు ఏం చేస్తున్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఆక్సిజన్ ధర
డిమాండ్ తగ్గడంతో ఏపీ, తెలంగాణల్లో ఆక్సిజన్ ధరలు తగ్గాయని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.
కొవిడ్ బాధితులకు ఊరట కలిగించే పరిణామమిది. ఏప్రిల్ మధ్య నుంచి విపరీతంగా పెరిగిన మెడికల్ ఆక్సిజన్, కాన్సన్ట్రేటర్ల ధరలు గణనీయంగా దిగివచ్చాయి.
కేసులు తగ్గుముఖం పట్టడం, ఆక్సిజన్ అందుబాటు సదుపాయాలు మెరుగవ్వడం ఇందుకు కారణమని చెబుతున్నారు.
పెద్ద సిలిండర్ రీఫిల్లింగ్ ధర రూ.2,000-3,000 నుంచి రూ.600కు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ధర రూ.60,000-70,000 నుంచి రూ.15,000-25,000కు తగ్గాయి.
కొవిడ్ మహమ్మారి మొదటిదశ కంటే రెండో దశలో బాధితులకు ఆక్సిజన్ అవసరాలు బాగా పెరిగాయి.
ఆసుపత్రులకు సిలిండర్లలో సరఫరా అయ్యే మెడికల్ ఆక్సిజన్ ధరతో పాటు, ఇంటి వద్ద స్వల్ప స్థాయిలో ఆక్సిజన్ వినియోగించుకునేందుకు దోహదపడే కాన్సన్ట్రేటర్ల ధరలూ కొన్నిరెట్ల మేర ఎక్కువయ్యాయి.
ఆక్సిజన్ శాచురేషన్ (ఎస్పీఓ2) స్థాయులు 90 కంటే తగ్గిన వారికి కనీసం నిమిషానికి 5 లీటర్ల సామర్థ్యంతో మెడికల్ ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి.
ఈ సదుపాయం ఉన్న పడక కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు రూ.20,000-30,000 కూడా వసూలు చేశారు.
వాస్తవానికి ఏప్రిల్ మొదటివారం వరకు 150 క్యూబిక్ మీటర్ మెడికల్ ఆక్సిజన్ ఉండే పెద్ద సిలిండర్‌ను నింపి ఇచ్చేందుకు తయారీ సంస్థలు రూ.350 మాత్రమే తీసుకునేవి.
గిరాకీ పెరిగి పోవడంతో ఏప్రిల్ మధ్య నుంచి రూ.600 తీసుకోవడం ప్రారంభించాయి. అదేనెల 20 కల్లా రూ.1,000కు, మే మొదటి వారానికల్లా రూ.2,500-3,000కు కూడా ఈ ధర ఎగబాకింది.
కేసులు తగ్గుముఖం పడుతుండటానికి తోడు... విశాఖ ఉక్కు, మేఘా ఇంజినీరింగ్ వంటి సంస్థలు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయని పత్రిక చెప్పింది.
ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్రైవేటు సంస్థలు కూడా రీఫిల్లింగ్ ఛార్జీలను తగ్గిస్తూ వస్తున్నాయి.
ప్రస్తుతం ఆసుపత్రులలో వినియోగించే పెద్ద సిలిండర్ రీఫిల్లింగ్‌కు హైదరాబాద్‌లో కనిష్ఠంగా రూ.600, గరిష్ఠంగా రూ.1000 వసూలు చేస్తున్నారని ఈనాడు వివరించింది.
- కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పీఎం కేర్స్ ఫండ్‌తో ఉచిత విద్య
- కోటి రూపాయల మోసం.. బిచ్చగాడి అవతారం.. 13 ఏళ్లుగా 3 రాష్ట్రాలలో అజ్ఞాతవాసం
తెలంగాణలో లాక్ డౌన్ పై నేడు నిర్ణయం
తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ విషయాన్ని ఆదివారం జరగనున్న కేబినెట్ సమావేశంలో తేల్చనుంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లాక్‌డౌనే ప్రధాన చర్చనీయాంశం కానుంది.
దీంతోపాటు వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది.
అయితే లాక్‌డౌన్‌పై ఇప్పటికే ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించింది.
లాక్డౌన్ విధింపు వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వ పెద్దలే ప్రకటిస్తున్నారు. సెకండ్ వేవ్ విజృంభించిన మొదట్లో కరోనా కేసులు 10 వేల మార్కును దాటాయి.
ఇప్పుడు ఒక్కో రోజు 90 వేలకు పైగా టెస్టులు చేసినా.. మూడు వేల పైచిలుకు కేసులే నమోదవుతున్నాయి. ఇది లాక్డౌన్ ఫలితమేనని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ దృష్ట్యా లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిద్దామన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందని పత్రిక రాసింది.
లాక్డౌన్ పొడిగిస్తేనే మంచిదని కొంత మంది అభిప్రాయపడగా.. మరికొందరు పొడిగింపు వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని, ఇప్పటికే 20 రోజులకు పైగా నానా తిప్పలు పడుతున్నారని ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.
- తిరుపతి: అప్పుడు 11 మంది చనిపోయారని చెప్పి, ఇప్పుడు 23మందికి ఎందుకు పరిహారం ఇస్తోంది..
- కరోనావైరస్: ఊరంతా కలిసి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు

50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో 50 పడకలు దాటిన ఆస్పత్రులు కచ్చితంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్‌లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
రాష్ట్రంలో 16 చోట్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.
దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామని సింఘాల్ చెప్పినట్లు సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- అంగారక గ్రహం మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- మేడ మీదే విమానం తయారీ
- చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది
- స్కైల్యాబ్: 'అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- 'నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)