నడుస్తున్న కారు నుండి దూకిన యువతి, ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఫోన్ నెంబర్ ఇవ్వాలని ఓ యువతిని క్యాబ్ డ్రైవర్ బలవంతపెట్టడంతో కారులో నుండి ఆమె దూకేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకొంది. క్యాబ్ లో ప్రయాణీస్తున్న యువతిని డ్రైవర్ పదే పదే ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు. అయితే ఫోన్ నెంబర్ ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. డ్రైవర్ ఒత్తిడిని భరించలేక ఆ యువతి క్యాబ్ నుండి బయలకు దూకేసింది.
న్యూఢిల్లీలోని కంటోన్మెంట్ పరిధిలో ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. ఢిల్లీలోని కపషెరకు చెందిన 19 ఏళ్ళ యువతి మండి హౌస్ నుండి తన ఇంటికి వెళ్ళేందుకు క్యాబ్ ఎక్కింది. క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఆ యువతిని డ్రైవర్ ఫోన్ నెంబర్ అడిగాడు. ఆమె స్పందించలేదు.
అంతేకాదు ఆమె ఫోన్ నెంబర్ ను క్యాబ్ డ్రైవర్ పదే పదే అడిగాడు. అంతేకాదు తనతో స్నేహం చేయాలని కోరాడు. అతడి నుండి ఒత్తిడి పెరిగిపోయింది. క్యాబ్ డ్రైవర్ నుండి ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో ఆ యువతి కంగారు పడి కారు నుండి దూకేసింది. కారు దౌలాకానా బస్టాప్ వద్దకు చేరుకోగానే ఆమె ధైర్యం చేసి కారు నుండి దూకింది.
అయితే కారు నుండి కిందకు దూకడంతో ఆమెకు గాయాలయ్యాయి. కానీ, సురక్షితంగా ఈ ప్రమాదం నుండి బయటపడింది.అయితే క్యాబ్ డ్రైవర్ పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నిందితుడిని విచారిస్తున్నారు.