గాలి జనార్దన్ రెడ్డి కథ చూస్తున్నాం: సీఎం సిద్దు
బెంగళూరు: మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి కోసం పాత పెద్ద నోట్లుకు బదులుగా కొత్త నోట్లు భీమా నాయక్ ఇచ్చారని డ్రైవర్ రమేష్ చేసిన ఆరోపణలతో పాటు అతను రాసిన డెత్ నోట్ లోని అన్ని ఆంశాలపై విచారణ ప్రారంభిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.
ఈకేసుకు సంబంధించి సాక్షాధారాలు లభించిన తరువాత నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. భీమా నాయక్ విధులకు హాజరుకావడంలేదని, ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగరాజ రెడ్డిని నియమించామని బెంగళూరు జిల్లాధికారి వి, శంకర్ చెప్పారు.
బెంగళూరు జిల్లాధికారి కార్యాలయంలో నాగరాజ రెడ్డి సహాయ కమిషనర్ గా పని చేస్తున్నారు. భీమా నాయక్ స్థానంలో నాగరాజ రెడ్డి తాత్కాలికంగా విధులు నిర్వహిస్తారు. మొత్తం మీద భీమా నాయక్ మాయం కావడంతో ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి కోసం రూ. 100 కోట్ల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చి ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖలో ప్రత్యేక భూస్వాధీన అధికారిగా పని చేస్తున్న భీమా నాయక్ కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
బీమా నాయక్ అలియాస్ భీమ్లా నాయక్ ను త్వరలో పట్టుకుని విచారణ చేసి పూర్తి వివరాలు బయటకు లాగుతామని మండ్య జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి చెప్పారు. ఒక బృందం భీమా నాయక్ పని చేస్తున్న కార్యాలయంలో వివరాలు సేకరిస్తున్నారని ఆయన చెప్పారు.

మరో రెండు బృందాలు బళ్లారి, బెంగళూరులో భీమా నాయక్ కోసం గాలిస్తున్నాయని మండ్య జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు. భీమా నాయక్, ఆయన సొంత కారు డ్రైవర్ తనను హింసించారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని డ్రైవర్ రమేష్ సూసైడ్ నోట్ లో ఆరోపించి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
తమ బిడ్డ ఆత్మహత్యకు కారణం అయిన వారిని అరెస్టు చెయ్యాలని రమేష్ తల్లి సాకమ్మ, తండ్రి చిక్కహోంబాళే గౌడ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని మండ్య జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వివరించారు.
అదే విధంగా తన సోదరుడి ఆత్మహత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని రమేష్ సోదరుడు మహేంద్ర ప్రభుత్వానికి మనవి చేశాడు. ఇదే సమయంలో భీమా నాయక్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ఆయన మొబైల్ అందుబాటులో లేదని, స్విచ్ ఆఫ్ వస్తుందని మండ్య జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications