కలకలం: రూ. 1000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, ఆఫ్ఘాన్ నుంచి ముంబైకి ఎలా తెచ్చారంటే..?
ముంబై: ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాటం చేస్తుంటే.. మరోవైపు అసాంఘిక శక్తులు తమ వ్యాపారాలను మాత్రం ఆపడటం లేదు. యథేచ్ఛగా సాగిస్తున్నారు. తాజాగా, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నవీ ముంబైలోని న్వా షెవా పోర్టులో 191 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇంత మొత్తంలో డ్రగ్స్.. ఇదే తొలిసారి
ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుపడటం ఇదే తొలిసారని పోలీసులు చెప్పారు. డ్రగ్స్ తీసుకెళుతున్న ఇద్దరు నిందితులను డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మాదక ద్రవ్యాలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముంబైకి తీసుకొచ్చినట్లు గుర్తించారు.

ఇరాన్ మీదుగా.. ప్లాస్టిక్ పైపులకు రంగులేసి..
ప్లాస్టిక్ పైపుల లోపల అమర్చిన ఈ మాదక ద్రవ్యాలను ఆఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా ఇక్కడికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు వెదురుబొంగుల్లా కనిపించే విధంగా ప్లాస్టిక్ పైపులకు రంగులను పూసినట్లు అధికారులు చెప్పారు. తమకు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. కస్టమ్స్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు.
ఢిల్లీ ఫైనాన్షియర్ తోపాటు పలువురి అరెస్ట్..
ఈ మాదక ద్రవ్యాలను ముంబై నుంచి దేశంలోని ఇతర ప్రముఖ నగరాలకు చేరవేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అరెస్టైన ఇద్దరు నిందితులకు కోర్టు 14 రోజుల కస్టడీని విధించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగమైన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిలో ఢిల్లీకి చెందిన ఓ ఫైనాన్షియర్ కూడా ఉన్నారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచే భారత్ తోపాటు ఇతర యూరోప్ దేశాలకు కూడా ఈ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుండటం గమనార్హం. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ లభ్యమైన విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ మాదక ద్రవ్యాలు తరచూ పట్టుడుతున్నాయి. కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.