వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంట రుణాల మాఫీ ప్రగతి అవరోధం: 7.5 % వృద్ధి కష్టమే?

రైతులను మనస్సు చూరగొనేందుకు రాష్ట్రాలు పోటీలు పడి మరీ వ్యవసాయ రుణాలు రద్దు చేస్తున్నాయి. కానీ 2016 - 17 ఆర్థిక సర్వే మాత్రం ఇది ప్రగతికి అవరోధంగా మారుతుందని ఆక్షేపించింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైతులను మనస్సు చూరగొనేందుకు రాష్ట్రాలు పోటీలు పడి మరీ వ్యవసాయ రుణాలు రద్దు చేస్తున్నాయి. కానీ 2016 - 17 ఆర్థిక సర్వే మాత్రం ఇది ప్రగతికి అవరోధంగా మారుతుందని ఆక్షేపించింది. అన్ని రాష్ట్రాలూ పంట రుణాల్ని రద్దుచేస్తే ఆ ఆర్థికభారం రూ.2.7 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని అంచనావేసింది.

అదే జరిగితే ధరలు ఘోరంగా పతనమవుతాయని, ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోని ఆర్థికవ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి అవరోధంగా మారుతుందని పేర్కొన్నది. అయితే వ్యవసాయ సంక్షోభ పరిష్కారాలపై ప్రధానంగా దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.

2016-17 ఆర్థికసర్వే రెండో భాగాన్ని శుక్రవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. తొలి భాగం ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సర్వే తొలి భాగంలో అంచనావేసినట్లుగా.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధిరేటును సాధించడం కష్టమని మలి విడత సర్వే తేల్చేసింది.

పార్లమెంట్‌లో వ్యవసాయ మంత్రి ఇలా ప్రకటన

పార్లమెంట్‌లో వ్యవసాయ మంత్రి ఇలా ప్రకటన

కానీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గీటురాయిగా ప్రధాని నరేంద్రమోదీ పదేపదే పంటల రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించారు. గెలిచిన తర్వాత అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్.. యూపీలో పంట రుణాల మాఫీకి కేంద్రం సాయం అందిస్తుందని ప్రకటించి మోదీ సర్కార్ ను ఆత్మరక్షణలో పడవేశారు. విపక్షాలు నిలదీయడంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం పని అని, కేంద్రం సహకరిస్తుందని దాట వేశారు. తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి కోరినా ససేమిరా అన్నది. ఆర్థిక సర్వేను బహిర్గతం చేసినట్లే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్ సభలో ఇప్పటివరకు తమ ప్రభుత్వం కార్పొరేట్లకు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదని సెలవిచ్చారు. రుణ మాఫీ బ్యాంకులు తీసుకునే వాణిజ్య నిర్ణయమని పరోక్షంగా తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. పంట రుణాల మాఫీకి కేంద్రం వద్ద ఎటువంటి పథకం సిద్ధంగా లేదని కూడా కేంద్రం తేల్చేసింది.

Recommended Video

Narendra Modi is dangerous says K Narayana - Oneindia Telugu
జీఎస్టీ, నోట్లరద్దుతో ఆశావహ దృక్పథానికి ఊతమట?

జీఎస్టీ, నోట్లరద్దుతో ఆశావహ దృక్పథానికి ఊతమట?

గమ్మత్తేమిటంటే కేంద్రం తన ఆలోచనలను ఆర్థిక సర్వే ద్వారా ప్రజలకు తెలియజేస్తుందని చెప్తుంటారు. ఆర్థికవ్యవస్థకు జవజీవాలు అందించాలంటే వడ్డీరేట్లలో మరిన్ని కోతలు అవసరమని పేర్కొంది. రూపాయి మారకపు విలువలో తీవ్ర ఒడిదుడుకులు, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్, టెలికాం తదితర రంగాల ఆస్తి-అప్పుల పట్టీలపై పెరుగుతున్న ఒత్తిడి, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులో ఉత్పన్నమవుతున్న సమస్యలు సవాలుగా మారిన విషయాన్ని గుర్తుచేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో చేపట్టిన కొన్ని సంస్థాగత సంస్కరణలు భవిష్యత్‌పై ఆశల్ని రేకెత్తిస్తున్నాయని పేర్కొంది. జీఎస్టీని అమల్లోకి తేవడం, పెద్దనోట్ల రద్దువల్ల సానుకూల ప్రయోజనాలు, ఎయిరిండియా ప్రైవేటీకరణ, ఇంధన రాయితీల హేతుబద్దీకరణలాంటి చర్యలు ఈ ఆశావహ దృక్పథానికి ఊతమిస్తున్నాయన్నది. 2017-18లో ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం ఉండొచ్చని విశ్లేషించింది.

ధరలు పడిపోతాయని ఆందోళన

ధరలు పడిపోతాయని ఆందోళన

వ్యవసాయ రుణాల రద్దు వల్ల ఆర్థికవ్యవస్థకు కలిగే నష్టాల్ని సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది. ‘‘వాస్తవానికి రుణ మాఫీ వల్ల ధరలు పెరగాలి. కానీ స్వల్పకాల పరిణామాల్ని చూసినట్లయితే ధరల ఘోరంగా పడిపోయేలా ఉన్నాయి. ఈ జాఢ్యం(రుణ మాఫీ) ఇతర రాష్ట్రాలకూ పాకే అవకాశం ఉంది'' అని సర్వే హెచ్చరించింది. రుణ మాఫీ విషయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ అడుగుజాడల్లో ఇతర రాష్ట్రాలూ నడిచినట్లయితే దేశ వ్యాప్తంగా ఆ మొత్తం రూ.2.7 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని సర్వే అంచనాకట్టింది. వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకంటించిన రుణమాఫీ మొత్తం రూ.1.25 లక్షల కోట్లున్న విషయాన్ని గుర్తుచేసింది.

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కూనారిల్లుతున్న దశలో రుణమాఫీ డిమాండ్లు వెల్లువెత్తుతుండడం ప్రమాదకరమంది. రుణమాఫీలకు కేంద్రం బాధ్యత తీసుకోదు కాబట్టి- రాష్ట్రాలు సొంతంగా ఈ భారాన్ని భరించినట్లయితే- సగటు డిమాండు జీడీపీలో 0.7 శాత మేర తగ్గుతుందని, ఆ మొత్తం రూ.1.14 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనావేసింది. వ్యవసాయ సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో రుణమాఫీ డిమాండ్లు ఎక్కువయ్యాయంది. వ్యవసాయ రాబడులు తగ్గిపోవడం, తృణధాన్యేతరాల ధరలు పడిపోవడం, పంటలకు తగిన గిట్టుబాటు ధరలు లభించకపోవడం లాంటివి వ్యవసాయ రంగంలో సంక్షోభానికి కారణాలని విశ్లేషించింది.

మహిళలపై వివక్ష తగ్గించాలని సూచన

మహిళలపై వివక్ష తగ్గించాలని సూచన

దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, అపహరణలు, దాడుల వంటి నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వారిలో అభద్రత అధికమవుతోంది. మహిళా సాధికారత, వారికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించేందుకు న్యాయపరంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. బాధితులకు సత్వర న్యాయం అందించే చర్యలు తీసుకోవాలంది. జాతీయ నేర నమోదు విభాగం సమాచారం ప్రకారం మహిళలపై నేరాలకు పాల్పడిన కేసుల్లో తీర్పులు వెలువడినవి 2015లో 22 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. మహిళలకు ఆస్తి హక్కు కల్పించటం, వరకట్న వేధింపుల నుంచి విముక్తి, ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో వివక్ష లేకుండా చూడటం వంటివి అవసరమని పేర్కొంది.

సామాజిక రంగానికి తగ్గిన కేటాయింపులు

సామాజిక రంగానికి తగ్గిన కేటాయింపులు

విద్య, ఆరోగ్య రంగాలపై పెట్టుబడులను మరింత పెంచాల్సి ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 2014-15లో విద్య కోసం వెచ్చించిన వ్యయం జీడీపీలో 2.8శాతం కాగా 2017 ఆర్థిక సంవత్సరానికి ఇది 3.2శాతానికి పెరిగింది. ఆరోగ్య రంగంలో చేసిన వ్యయం 2014-15లో 1.2శాతం కాగా 2017లో 1.5 శాతం. విద్య, వైద్యంతో పాటు సామాజిక సేవలు, కుటుంబసంక్షేమం, గృహనిర్మాణం, పట్ణణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమానికి 2015-16లో వెచ్చించిన మొత్తం నిధులు రూ.10,02,591 కోట్లు. ఇవే రంగాల్లో 2016-17లో వెచ్చించిన మొత్తం రూ.11,18,094 కోట్లు. అంటే అంతకు ముందు ఏడాది కన్నా 11.5 శాతం అధికం. సామాజిక రంగంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధుల వ్యయ నిష్పత్తి జీడీపీలో 2011-12 నుంచి 2014-15 వరకూ 6 శాతం వద్దే నిలిచి పోయింది. అయితే, 2015-16, 2016-17లలో ఈ నిష్పత్తిలో మరో ఒక శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో వ్యయం 7.4శాతంగా ఉంది.

బహుముఖ వ్యూహాలు అమలుచేస్తున్న కేంద్రం

బహుముఖ వ్యూహాలు అమలుచేస్తున్న కేంద్రం

మౌలిక వసతుల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అమలుచేస్తోంది. రహదారుల నిర్మాణం, అనుసంధానం ప్రాజెక్టుల్లో పెట్టుబడుల పెంపునకు కృషితో పాటు జలమార్గాల అభివృద్ధి, రైల్వేలు, వైమానిక రవాణాల విస్తరణకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రవాణా వసతుల్లో మన దేశం ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌లో 2014లో ఉన్న 58వ స్థానం నుంచి 2016కి 36వ స్థానానికి చేరకుంది. అయినప్పటికీ మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరంగానే ఉందని సర్వే అభిప్రాయపడింది. లాజిస్టిక్‌ పార్కులు, వలయ రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని తగ్గించాలని సూచించింది.

పంటల సాగులో సమస్యలు తీర్చాలి

పంటల సాగులో సమస్యలు తీర్చాలి

పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను నియంత్రిస్తామన్న స్వీయ ప్రతిన లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులేస్తోందని ఆర్థికసర్వే పేర్కొంది. మరో మూడేళ్లలో 2005నాటి కాలుష్యాల తీవ్రత స్థాయిని 20-25 శాతం మేర తగ్గించే కసరత్తును ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర విద్యుత్‌ ప్రాధికారసంస్థ ప్రణాళిక(2016) ప్రకారం బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదన కేంద్రాల సామర్థ్య వృద్ధి 2017-22 మధ్య దాదాపు 50 గిగావాట్లు ఉంటుంది. తర్వాత అయిదేళ్ల వరకూ థర్మల్‌ విద్యుదుత్పాదన స్థాపక సామర్థ్యంలో అదనంగా ఎలాంటి వృద్ధి ఉండదు. పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఎదురవుతున్న అన్ని సమస్యల్నీ పరిష్కరించాల్సి ఉందని సర్వే నొక్కిచెప్పింది. విత్తనాలు వేయడానికి చాలా ముందుగానే... జన్యు మార్పిడి పంటల్ని స్వీకరించడం, వ్యవసాయ వాణిజ్య నిర్ణయాలు తీసుకోవడంలాంటివి చేయాలంది.

చిన్న, సన్నకారు రైతులకు అందుబాటు వడ్డీరేట్లలో సంస్థాగత రుణాల్ని సకాలంలో అందివ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. మాగాణిని పెంచడం, మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడం, పాడిరంగంలో ఉన్న మహిళలకు నిధులు అందుబాటులో ఉంచడంపై దృష్టిపెట్టాలంది. ఉత్పాదకత, మార్కెటింగ్‌, ధరల సంబంధ సమస్యల వల్ల వ్యవసాయ రంగంలో ఆదాయాలు అస్థిరంగా మారాయని పేర్కొంది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి తగిన విధాన పరమైన నిర్ణయాల్ని చాలా ముందుగానే తీసుకోవాల్సిన అవసరమంది. అదే జరిగితే 2017వ సంవత్సరంలో వ్యయసాయ ఉత్పత్తుల్లో మిగులు ఏర్పడుతుందని అభిప్రాయపడింది.

ప్రగతికి అవరోధంగా భూసేకరణ

ప్రగతికి అవరోధంగా భూసేకరణ

పెరుగుతున్న అవసరాలు, వాహనాల రద్దీ దృష్ట్యా రహదారుల విస్తరణ ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. జాతీయ రహదారులతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణానికి ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టింది. ఈ రంగంలో పెట్టుబడులను 2016-17లో రూ.లక్ష కోట్లతో పునర్వ్యవస్థీకరించారు. భారతమాల, సేతు సముద్రం పథకాలకు ఇవి అదనం. అయితే, ఈ ప్రాజెక్టులు భూసేకరణ, భూలభ్యత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు భూసేకరణ ధర భారీగా పెరిగింది. అభివృద్ధిదారులతో సమస్యలు, జాతీయరహదారుల్లో అవరోధాలు, జీఎస్టీ, రుణభారం పెరుగుదల వంటివి అదనపు సవాళ్లుగా ఆర్థిక సర్వే పేర్కొన్నది.

English summary
The Economic Survey made a strong case for monetary easing and fiscal adjustments, flagging multiple new risks and deflationary impulses that could hinder the country achieving the higher end of the projected growth band of 6.75% to 7.5% for this fiscal year. A structural reform push to growth will come from implementation of the goods and services tax (GST), privatising national carrier Air India and steps to address the twin balance-sheet problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X