పంజాబ్ సీఎంను టార్గెట్ చేసిన కేంద్రం-చన్నీ మేనల్లుడిని అరెస్టు చేసిన ఈడీ- ఎన్నికల వేళ
పంజాబ్ లో అధికార కాంగ్రెస్ ను ఎన్నికల్లో ముందుండి నడిపిస్తున్న సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీని కేంద్రం టార్గెట్ చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల్ని ఆయన కుటుంబంపైకి ఉసిగొల్పింది. ఎన్నికల వేళ ప్రత్యర్ధుల్ని నైతికంగా దెబ్బతీసేందుకు కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ఈ అస్త్రాన్ని కేంద్రం మరోసారి బయటకి తీసింది.
రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా అర్జించిన సొమ్ముతో మనీలాండరింగ్ చేసిన అభియోగాలతో సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద భూపీందర్ ను అరెస్టు చేసినట్లు ఈడీ అదికారులు ప్రకటించారు. ఈ కేసులో భూపీందర్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. దాదాపు 8 గంటలుప్రశ్నించిన తర్వాత నిన్న అర్ధరాత్రి అరెస్టు చేశారు.

గత నెలలో ఈడీ అధికారులు... భూపీందర్ తో పాటు సీఎం చన్నీ బంధువులకు చెందిన మొహాలీ, లూధియానా, రూప్ నగర్, ఫతేఘర్ సాహిబ్, పఠాన్ కోట్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో 10 కోట్లకు పైగా నగదు, రూ.21 లక్షల విలువైన బంగారం, 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్, ఇసుక తవ్వకాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రూ.10 కోట్ల నగదులో రూ.8 కోట్లు భూపీందర్ నివాసంలోనే దొరికినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో భూపీందర్ తో మరో ఇద్దరు బంధువులపైనా ఈడీ మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది.
పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఫిరోజ్ పూర్ పర్యటనలో ప్రధాని మోడీ పర్యటనకు రైతులు, ఖలిస్తాన్ తీవ్రవాదులు ఆటంకాలు కల్పించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. అదే సమయంలో పంజాబ్ లో బీజేపీ పుంజుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. దీంతో పంజాబ్ సీఎం చన్నీని ఈడీ టార్గెట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలకు ముందు ప్రత్యర్ధుల్ని కేంద్ర దర్యాప్తు సంస్ధలతో టార్గెట్ చేయిస్తుందన్న అపప్రదను ఎన్డీయే సర్కార్ మూటగట్టుకుంటోంది.