
ఆ మహాశక్తి బాలా సాహెబ్ అంటూ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్న ఏక్నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఇతర నేతలు రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవేమీ ఫలించడం లేదు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు, నేతలు నిరసనలు తెలియజేస్తూ మహారాష్ట్రలో ఆందోళనలు చేస్తున్నారు.

తన వ్యాఖ్యలపై ఏక్నాథ్ షిండే యూటర్న్
తమకు ఓ శక్తివంతమైన జాతీయ పార్టీ మద్దతు ఉందని, తమకు ఏ సహాయమైన చేసేందుకు సిద్ధమని తెలిపిందని శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే గురువారం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. ఏ జాతీయ పార్టీ తమకు కాంటాక్టులో లేదని శుక్రవారం ఓ మీడియా ఛానల్‌తో చెప్పారు. అంతేగాక, తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆ మహాశక్తి బాలా సాహెబ్ అంటూ షిండే
ఓ మహాశక్తి మా వెనుక ఉంది అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం శివసేన దివంగత నేత బాలా సాహేబ్ థాక్రే, ఆనంద్ డిఘేలా గురించే అని ఏక్ నాథ్ షిండే తెలిపారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు శుభం కార్డు పడుతుందని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. కొంత సమయం తర్వాత అన్నీ సర్దుకుంటాయన్నారు.

40 మంది ఎమ్మెల్యేలు తనవెంటే ఉన్నారంటూ షిండే
కాగా, రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా డిప్యూటీ స్పీకర్ వద్దకు వెళ్లాలని శివసేన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో షిండే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 55 మంది ఎమ్మెల్యేలకు గానూ 40 మంది గౌహతిలో నాతోనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ సంఖ్యా బలమే లెక్క. అందువల్ల మాపై చర్యలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు.

బీజేపీపై ఉద్ధవ్ విమర్శలు.. రెబల్ నేతలపై ఫైర్
మరోవైపు, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తమ పార్టీలో చీలికకు బీజేపీనే కారణమని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. ఇది ఇలావుండగా, రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు, నేతలు వారి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. అవసరమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు.