2017 మార్చి 31 నాటికి 13 వేల గ్రామాలకు విద్యుత్తు వెలుగులు: కేంద్రం వెల్లడి
2017 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 13 వేల ఇళ్లకు విద్యుత్తు వెలుగులు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
న్యూఢిల్లీ: దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయూజీజేవై) పథకంలో భాగంగా 2017 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 13 వేల ఇళ్లకు విద్యుత్తు వెలుగులు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
2015 ఏప్రిల్ నాటికి దేశంలో విద్యుత్తు వెలుగుకు నోచుకోని 18,452 గ్రామాలను గుర్తించారు. వాటిలో మార్చి 31, 2017 నాటికి 13,002 గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించారు. ఇంకా 4,615 గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించాల్సి ఉంది.

గతంలో అమలులో ఉన్న రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. డీడీయూజీజేవై పథకంలో భాగంగా జరిగే పనులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక వెబ్ పోర్టల్ తోపాటు మరో మొబైల్ యాప్ ను కూడా కేంద్రం రూపొందించింది. ఆయా రాష్ట్రాలు అందించే సమాచారాన్ని వీటిలో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు.
గర్వ్ గ్రామీణ్ విద్యుదీకరణ్ పేరిట డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ 'గర్వ్'యాప్ ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు సంబంధించిన విద్యుదీకరణ పనులను తెలుసుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. విద్యుత్ వెలుగులకు దూరంగా ఉన్న 4,615 గ్రామాలకు కూడా 2018 మే నెల నాటికి విద్యుత్ సరఫరా అందించనున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్, ఐట్యూన్స్ యాప్ స్టోర్ నుంచి ఈ గర్వ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ గర్వ్ యాప్ కు తాజా వెర్షన్ అయిన గర్వ్-2 యాప్ ను 2016 డిసెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల విద్యుదీకరణకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వస్తున్నారు. ఇందులోని 'సంవాద్' పేజీ ద్వారా సామాన్యులు సైతం గ్రామీణ ప్రాంతాల ఇళ్ల విద్యుదీకరణకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications