2017-18: పీఎఫ్ వడ్డీ రేటు 8.65శాతం-8.55శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీరేటును 2017-18 సంవత్సరానికి గాను 8.55 శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. 2016-17లో ఇది 8.65 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణయాత్మక వ్యవస్థ అయిన కేంద్ర ధర్మకర్తల బోర్డు (సీబీటీ) బుధవారం సమావేశమైంది.
ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ యాప్ వినియోగిస్తున్న వారు ఆధార్‌ను అనుసంధానం చేసుకునే సౌకర్యాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భవిష్యత్తును అంచనా వేయడం కష్టమని అన్నారు.
గత ఆర్థిక సంవత్సరం వడ్డీరేటుకు అనుగుణంగా రూ. 695 కోట్లు మిగలగా.. ఈసారి రూ. 586 కోట్లు మాత్రమే మిగులుతుందని వెల్లడించారు. కాగా, సీబీటీ నిర్ణయాన్ని అనంతరం ఆర్థికశాఖ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వడ్డీని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈమేరకు తమ నిర్ణయాన్ని ఆర్థికశాఖ ఆమోదిస్తుందని.. కార్మిక సంఘాలు కూడా అంగీకరిస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

బాండ్లలో పెట్టుబడుల ద్వారా ఈపీఎఫ్ఓ 8 శాతం రాబడి మాత్రమే పొందుతున్నట్లు వివరించారు. అయితే 8.55 శాతం వడ్డీ ఇవ్వడానికి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల(ఈటీఎఫ్)లోని కొన్ని పెట్టుబడులను విక్రయించినట్లు వివరించారు. అలాగే జీపీఎఫ్, పీపీఎఫ్ ఖాతాదారులకు అందిస్తున్న వడ్డీరేటు(7.6%) కంటే కూడా ఇది ఎక్కువని తెలిపారు.
ఇంతవరకు 20మంది, ఆపైన ఉద్యోగులున్న చోట ఈపీఎఫ్ వర్తింపజేస్తుండగా.. ఆ పరిమితిని 10మందికి తగ్గిస్తూ సీబీటీ సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈపీఎఫ్ఓలో ప్రస్తుతం 6 కోట్ల మంది ఖాతాదారులుండగా.. దీనిద్వారా ఆ సంఖ్య 9 కోట్లకు పెరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణ జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.