
శివసేన బతకాలంటే ఆ కూటమి నుంచి బయటపడాలి: ఉద్ధవ్‌కు ఏక్నాథ్ షిండే తేల్చేశారు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా, శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు(కాంగ్రెస్, ఎన్సీపీ) నుంచి బయటపడటం ఎంతో అవసరమని ఆ పార్టీపై ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. శివ సైనికులు, మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తులను వీడాల్సిందేనన్నారు.

ఆ కూటమి నుంచి బయటికి రావాల్సిందేనంటూ ఏక్నాథ్ షిండే
సీఎం ఉద్ధవ్ థాక్రే ఫేస్బుక్ లైవ్‌లో ప్రసంగించిన అనంతరం ఆయన ట్విట్టర్లో స్పందించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కేవలం కాంగ్రెస్, ఎన్సీపీలే లబ్ధి పొందాయని.. శివసైనికులు మునిగిపోయారన్నారు. పార్టీ, శివసైనికుల మనుగడ కోసం అసహజమైన కూటమి నుంచి బయటపడటం అవసరమని తేల్చి చెప్పారు.

మహారాష్ట్ర ప్రయోజనాలకోసమేనంటూ ఏక్నాథ్ షిండే
మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు.అంతకుముందు, పార్టీ ఎమ్మెల్యేలంతా బుధవారం సాయంత్రం సమావేశానికి రావాలని శివసేన జారీ చేసిన అల్టిమేటంపై స్పందించిన శిండే.. అవి చట్టపరంగా చెల్లవన్నారు. 'శివసేన శాసనసభా పక్ష చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే భరత్ గొగవాలే కొత్తగా నియమితులయ్యారు. అందువల్ల సునిల్ ప్రభు ఇచ్చిన ఆదేశాలు చెల్లవు' అని షిండే ట్వీట్ చేశారు.ఇదిలా ఉండగా.. ఏక్నాథ్ షిండే వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు నలుగురు స్వతంత్రులతో కలిపి 34మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు నిలవగా.. తాజాగా మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చార్టర్డ్ విమానంలో గౌహతి చేరుకున్నట్టు సమాచారం.

సీఎం నివాసం వీడిన ఉద్ధవ్ థాక్రే
ఇది ఇలావుంగా, తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన గంటల వ్యవధిలోనే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సీఎం నివాసాన్ని ఖాళీ చేసి.. తమ నివాసం మాతోశ్రీకి చేరుకున్నారు. సతీమణి, కుమారుడితో కలిసి బుధవారం రాత్రి సీఎం నివాసాన్ని వీడారు ఉద్ధవ్ థాక్రే. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. భారీగా చేరుకున్న శివసేన కార్యకర్తలు, నేతలు ఉద్దవ్ థాక్రేకు మద్దుతగా నినాదాలు చేశారు. ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే.. తమ అనుచరులకు అభివాదం చేస్తూ అక్కడ్నుంచి కదిలారు. ఇది ఇలావుండగా, శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే క్యాంపునకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరడం గమనార్హం. దీంతో షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య 40కిపైగా ఉన్నట్లు తెలుస్తోంది.