BBC ప్రధానమంత్రి డాక్యుమెంటరీపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని నార్సింగి ఓం కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలుగు సంగమం- సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తాను పదవీ విరమణ మాత్రమే చేశానని, పెదవి విరమణ చేయలేదంటూ తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు.
భారతదేశం అత్యంత సెక్యులర్ దేశమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీమీద బీబీసీ చేసిన డాక్యుమెంటరీకి సంబంధించి వెంకయ్య తీవ్రంగా స్పందించారు. ఆ డాక్యుమెంటరీ ప్రధానమంత్రిని తక్కువ చేయడమే కాదని, దేశాన్ని కూడా తక్కువ చేసినట్లేననన్నారు. భాషను కాపాడుకోవడం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం అత్యంత దారుణమని, కన్నతల్లి, పుట్టిన ఊరు, మాతృ భాష, దేశాన్ని మరిచినవాడు మనిషి కాదన్నారు.

భారతదేశం మరో 10 సంవత్సరాల్లో ఆర్థిక శక్తిగా మారబోతోందని జోస్యం చెప్పారు. అలాగే నూతన విద్యా విధానంలో తల్లి భాషను కాపాడుకునే వీలు ప్రభుత్వం కల్పించిందన్నారు. కేంద్రం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో రాయడానికి అవకాశం కల్పించడం అత్యంత అభినందనీయమన్నారు. పరిపాలన కూడా మాతృభాషలోనే సాగాలని, ప్రభుత్వాలు విడుదల చేసే ఉత్తర్వులు కూడా మాతృభాషలోనే ఉండాలని ఆకాంక్షించారు.
కోర్టుల్లో, చట్టసభల్లో అందరూ మాతృభాషలోనే మాట్లాడాలని, కోర్టులో ఉత్తర్వులు, వాదనలు కూడా మాతృభాషలోనే జరగాలన్నారు. మమ్మీ, డాడీ అని పిలిపించుకుంటూ పిల్లల్ని చెడగొడుతోంది తల్లిదండ్రులేనని మందలించారు. కమ్మనైన తెలుగు భాషలో అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, పద్మశ్రీ శోభరాజు, ఆకెళ్ల విభీషణ శర్మ, బీజేపీ నేత మురళీధర్ రావు తదితరులు పాల్గొని మాట్లాడారు.












Click it and Unblock the Notifications