కుమారస్వామిలో ఎగ్జిట్ పోల్ వణుకు : యడ్డీ నుంచి ముప్పు ఉంటుందని ఆందోళన
న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంటే ... యూపీఏ కూటమిలో కాస్త నైరాశ్యం నెలకొంది. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ భాగస్వామ్య కూటమిలో అలజడి నెలకొంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా ? అని ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది.
28 సీట్లలో జయకేతనం
ఇక కర్ణాటకలో బీజేపీ 20 నుంచి 28 సీట్లు గెలుస్తుందనే అంచనాలతో కుమారస్వామి సర్కార్ కునుకుతీయని సిచుయేషన్ ఏర్పడింది. దీనికి తగ్గట్టు మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప బీజేపీ 22 సీట్లు గెలుస్తుందని చెప్పడం .. పోల్స్ కూడా సమానస్థాయిలో రావడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ఇబ్బంది పెట్టనుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తామని స్పష్టంచేశారు.

కుమారస్వామిలో వణుకు
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే బీజేపీ 104 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా .. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ స్థానాల్లోబీజేపీ కైవసం చేసుకుంటుందనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. దీనికితోడు తమకు కొందరు కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారనే వార్తలతో ... లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం మరింత బలాన్ని చేకూరుస్తోంది. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే సంకేతాలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ మాత్రం తమ విజయంపై ధీమాతో ఉన్నాయి.