Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనే టాపిక్ వచ్చినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అనే పదాన్ని తరచూ వింటుంటాం. ఇది బహుశా సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు. అసలు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అంటే ఏంటి..?

క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నిర్వచనం
ఒక వ్యక్తి అధిక సంపాదన కలిగి ఉంటే ప్రభుత్వానికి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ఏడాదికి అధిక సంపాదన కలిగిన వ్యక్తులు ఈక్విటీస్‌లో లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్ చేసిన వాటిపై వచ్చే రిటర్న్స్ పై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అని అంటారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15శాతం పన్ను
ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర షేర్లపై ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక, ఆ షేర్లు కొనుగోలు చేసిన ఏడాది లోపే విక్రయించి లాభాలు కనుక పొందినట్లయితే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (short term capital gains)అని పిలుస్తాము.వచ్చే లాభంపై పన్ను వర్తిస్తుంది. దీన్నే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అని పిలుస్తారని నిపుణులు వివరిస్తున్నారు. వచ్చే లాభాలపై 15శాతం పన్ను విధించడం జరుగుతుంది. ఈ లాభాలపై పన్ను విధింపునకు పన్ను శ్లాబ్‌కు ఎలాంటి సంబంధం లేదు. అంటే మీరు ఏ టాక్స్ శ్లాబ్‌లోకి వస్తారన్నది సంబంధం లేకుండా... క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 15శాతం విధిగా చెల్లించాల్సి వస్తుంది.

లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అంటే ఏంటి..?
ఇక లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చూసినట్లయితే ఇక్కడ కొంత భిన్నంగా ఉంటుంది. ఇది ఒక ఏడాది క్రితమే అమల్లోకి రావడం జరిగింది.అంతకుముందు దీనిపై ఎలాంటి పన్ను విధింపులు లేవు.అంటే ఇన్వెస్ట్ చేసిన షేర్లను మీరు ఏడాది తర్వాత విక్రయించినట్లయితే దానిపై వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను విధించేవారు కాదు. గతేడాది నుంచే ప్రభుత్వం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధానంను తీసుకొచ్చింది. ఒక ఏడాది కంటే ఎక్కువగా హోల్డ్‌లో చేసి ఉంచిన షేర్లపై కూడా పన్ను విధిస్తోంది. అయితే లక్ష రూపాయలు మేరా లాభం వస్తే దీనిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. లక్ష రూపాయలకంటే ఎక్కువగా లాభం వస్తే మాత్రం 10శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా గత కొంత కాలంగా ఇన్వెస్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పై ఏమైనా ప్రకటన చేస్తారా అని ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.