భజరంగ్‌దళ్‌పై నిషేధానికి భయపడిన ఫేస్బుక్- వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద వాణిజ్య మార్కెట్లు కలిగిన భారత్‌లో తమ వ్యాపారాల విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో సామాజిక దిగ్గజ సంస్ధలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తాము అనుసరిస్తున్న నిబంధనలు, వ్యాపార సూత్రాలను భారత్‌లో మాత్రం అమలు చేయలేక తలపట్టుకుంటున్నాయి. తాజాగా అమెరికన్ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్కూ కూడా ఇలాంటి పరిస్ధితే ఎదురైనట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తమ తాజా నివేదికలో తెలిపింది. ఈ నివేదికను గమనిస్తే వ్యాపారం కావాలంటే భారత్‌లో జరిగే వాటిని చూసీ చూడనట్లుగా వ్యవహరించాలనే సందేశం ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్ధలకు వెళ్తున్నట్లు అర్దమవుతోంది.

మైనార్టీలపై భజరంగ్‌దళ్ దాడులు..
ఈ ఏడాది ఢిల్లీలో ఓ చర్చిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు జరిపిన దాడి అంతర్జాతీయంగా భారత్‌కు అపఖ్యాతి తెచ్చిపెట్టింది. ఢిల్లీ వెలుపల ఉన్న పెంటెకోస్టల్ చర్చిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. గతంలో ఇక్కడ హిందూ దేవాలయం ఉండేదని, దానిపై చర్చి నిర్మించారని ఆరోపిస్తూ డజన్ల కొద్దీ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. దీనికి భజరంగ్ దళ్ బాధ్యత ప్రకటించుకుందని కూడా వెల్లడించింది. దళ్ ఇలాంటి దాడులు ఎన్నో చేసిందని ఈ నివేదికలో వెల్లడించింది. ఢిల్లీలో చర్చిపై దాడి తర్వాత ఈ వీడియోను భజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీన్ని 2.5 లక్షల మంది చూశారు.

నిషేధానికి సిద్ధమైన ఫేస్బుక్...
ఢిల్లీలో చర్చిపై దాడి తర్వాత భజరంగ్‌దళ్‌ను హిందూ అతివాద సంస్ధగా గుర్తించి వారు పోస్టు చేసే సమాచారాన్ని నిషేధించాలని ఫేస్బుక్ భావించింది. భారత్‌లో మైనార్టలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు మద్దతిస్తున్న భజరంగ్‌దళ్‌పై ఫేస్బుక్ భద్రతా విభాగం ఓ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా భజరంగ్‌దళ్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుంచి నిషేధించాలని ఫేస్బుక్ భావించింది. అయితే ఇదే భద్రతా విభాగం భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తే చోటు చేసుకునే పరిణామాలను కూడా తన నివేదికలో సంస్ధకు సమర్పించింది. ఇందులో ఫేస్బుక్ భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తే భారత్‌లో సంస్ధ వ్యాపార అవకాశాలు దెబ్బతింటాయని, భారత్‌లో తమ సిబ్బందిపైనా దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించింది.

భజరంగ్‌దళ్‌పై వెనక్కి తగ్గిన ఫేస్బుక్...
భారత్‌లో భజరంగ్‌దళ్ మైనార్టీలపై హింసకు మద్దతిస్తూ ఫేస్బుక్ నుంచి నిషేధించాల్సిన ప్రమాదకర సంస్ధగా అర్హత సాధించినప్పటికీ వ్యాపార ప్రయోజనాలు, సిబ్బంది కోణంలో మాత్రం ఇది సరైన చర్య కాబోదనే నివేదిక ఈ సోషల్ మీడియా దిగ్గజాన్ని ఆలోచనలో పడేశాయి. ముఖ్యంగా భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తే అది కేంద్రంలోని తమకు అనుకూలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వ సాయంతో తమను టార్గెట్ చేసే ప్రమాదముందని ఫేస్బుక్ భావించింది. దీంతో భజరంగ్‌దళ్‌పై చర్యల విషయంలో ఫేస్బుక్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తమ కథనంలో పేర్కొంది.

భారత్‌లో ఫేస్బుక్ వ్యాపారాలు..
భారత్‌లో ఫేస్బుక్ ఢిల్లీ, ముంబైతో పాటు ఐదు చోట్ల కార్యాలయాలు కలిగి ఉంది. అలాగే రిలయన్స్ జియోలో 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. తిరిగి రిలయన్స్ వంటి సంస్ధలు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో భజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తే సమస్యలు తప్పవని ఫేస్బుక్ భావించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు తమ సభ్యులు చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని భజరంగ్‌దళ్ ప్రతినిధి వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. ఇతర మతాల సంస్ధలు, వ్యక్తులతో తమకు ఎలాంటి విభేదాలు కూడా లేవని వివరణ ఇచ్చారు.