అమిత్ షా.. అటో ఇటో తేల్చుకో -రైతుల అల్టిమేటం -6వ రౌండ్ అజెండా -రాత్రి హైడ్రామా
వ్యవసాయ రంగంలో గొప్ప సంస్కరణలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను అన్నదాతలు వెతిరేకిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో వేల సంఖ్యలో పోగైన రైతులు 13 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ రైతాంగం ఆందోళనలబాటపట్టింది. వ్యవసాయ చట్టాలు వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ మంగళవారం ముగిసింది. పోరాటాన్ని మరితగా ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించిన దరిమిలా కేంద్ర ప్రభుత్వం మళ్లీ దిగొచ్చింది...
'ఏపీలో గ్రామ వాలంటీర్ల తొలగింపు -35ఏళ్లు దాటితే వేటు’పై జగన్ సర్కారు వివరణ -అసలేమైందంటే..

అమిత్ షా హైడ్రామా..
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవేనని వాదిస్తోన్న కేంద్రం.. రైతు సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నది. ఇప్పటికే ఐదు దఫాల చర్చలు విఫలంకాగా, బుధవారం ఆరో రౌండ్ చర్చలకు కేంద్రం సిద్ధమైంది. కాగా, ఆరో దఫా చర్చల అజెండాను ఖరారు చేసేందుకుగానూ రైతు సంఘాల నేతలు మంగళవారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. తొలుత షా ఇంట్లో మీటింగ్ ఉంటుందని చెప్పడంతో అక్కడికి వెళ్లే విషయమై రైతు నేతల్లో భిన్నాభిప్రాయాలొచ్చాయి. దీంతో వేదిక ఐసీఏఆర్ ఆఫీసుకు మారింది. తీరా చూస్తే, మంత్రిగారు రాలేరు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని సూచించడంతో రైతులకు చిర్రెత్తుకొచ్చి నో చెప్పారు. ఇక చేసేదేమీ లేక షా స్వయంగా ఏసీఏఆర్ ఆఫీసుకు వచ్చారు. కాసేపటికే..
అమెరికాలో తెలుగు జంట భారీ మోసం -H-1B పేరిట రూ10కోట్లు టోకరా - బాధితులూ మనోళ్లే -ఏపీలో కలకలం

సడెన్ గా ప్రత్యక్షమైన తోమర్..
రైతుల నిరసనలు మొదలైనప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటోన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం రాత్రి సడెన్ గా ఐసీఏఆర్ ఆఫీసు వద్ద ప్రత్యక్షమయ్యారు. రైతు సంఘాలతో అమిత్ షా ఒక్కరే మాట్లాడుతారని తొలుత ప్రచారంకాగా, చివరి నిమిషంలో తోమర్ కూడా జాయిన్ అయ్యారు. గత ఐదు విడతల చర్చల్లో తోమర్ కూడా భాగం పంచుకున్న సంగతి తెలిసిందే. ఆరో దశ చర్చల సన్నాహకంగా ఇవాళ జరిగిన సమావేశంలోనూ ఆయన రైతుల ముందు ప్రభుత్వ వాదన వినిపించారు..

అటా? ఇటా? ఏదో ఒకటి తేల్చండి..
సాయంత్రం ఏడు గంటలకు అనుకున్న మీటింగ్ కాస్తా తొమ్మిది గంటలకు మొదలై, రాత్రి 10:30 వరకు కొనసాగింది. భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్, ఆలిండియా కిసాస్ సభ తరఫున హన్ మోలా, రుల్డూ సింగ్ మాన్సా తదితర 13 మంది నేతలు అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆరో దశ చర్చలకు సంబంధించి తమది సింగిల్ పాయింట్ అజెండా అని, వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? లేదా? ‘ఎస్ ఆర్ నో' మాత్రమే వినాలనుకుంటున్నామని రైతు నేతలు.. అమిత్ షా, తోమర్‌లకు స్పష్టం చేశారు. దీంతో బుధవారం నాటి చర్చలు కూడా ఇదే అంశంపై జరుగనున్నాయి. మంత్రులతో భేటీ తర్వాత సంఘాల నేతలు రైతులతో సమావేశమై చర్చల సారాంశాన్ని వివరించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేదాకా నిరసనలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

వ్యవసాయ చట్టాల్లో ఏముంది?
చలో ఢిల్లీ పేరుతో నవంబర్ 26న దేశరాజధానికి చేరిన వేలాది మంది రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంతో సరిహద్దుల్లోనే రోడ్లను దిగ్బంధించి నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతుల వాదనలు ఇలా ఉన్నాయి.. మూడు చట్టాల్లో మొదటిదైన ‘రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం' ద్వారా.. రైతులు పంట వేయకముందే తమ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలుదారుతో ఒప్పందాలు చేసుకోవచ్చు. కనీసం ఒక పంట నుంచి గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితితో డీల్ కుదుర్చుకోవచ్చు. వివాదాలు తలెత్తితే మూడంచెల్లో పరిష్కార వ్యవస్థ ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. కానీ దీనివల్ల ఒప్పంద సేద్యం బలపడుతుందని, రైతులతో కార్పొరేట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకుని.. ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయిస్తారని, తద్వారా దేశంలో పంటల వైవిధ్యం దెబ్బతింటుందని రైతులు వాదిస్తున్నారు. మరో కీలకమైన..

పన్నులు లేని ప్రైవేటు మండీలు..
మిగతా రెండు.. ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం', ‘నిత్యవసర సరకుల(సవరణ) చట్టం'పైనా రైతులు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. రైతు ప్రోత్సాహక, సులభతర చట్టం ద్వారా.. వ్యవసాయ మార్కెట్లు(మండీలు), మార్కెట్ కమిటీలతో సంబంధం లేకుండా రైతులుతమ పంటను ఎక్కడి నుంచి ఎక్కడికైనా అమ్ముకునే స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశం కల్పించారు. అదే సమయంలో ప్రైవేటు మండీలకు అవకాశం కల్పిస్తూ, వాటికి పన్నుల నుంచి మినహాయింపు కల్పించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన చట్టమని రైతులు వాదిస్తున్నారు. దీంతో రైతులకు కనీస మద్దతు ధర దక్కే చోటైన మార్కెట్ యార్డులు మూతపడతాయని, ప్రైవేట్ మండీలు బలోపేతం అవుతాయని, రైతులు ఒప్పంద సేద్యం నుంచి తప్పించుకున్నా, ప్రైవేటు మండీల చేతిలో బలికాక తప్పదని అంటున్నారు. ఇక మూడోదైన నిత్యవసర సరకుల(సవరణ) చట్టం ద్వారా నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, అమ్మకాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరిస్తామని, తద్వారా రైతులకు ఆదాయం పెరిగి, పంటల వ్యర్థం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ చట్టం ద్వారా దళారులు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించే ప్రమాదముందని రైతులు వాదిస్తున్నారు.