india delhi farmers protest central govt talks భారత్ ఢిల్లీ రైతుల నిరసన ఐదు రాష్ట్రాల ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం చర్చలు
చర్చలపై కేంద్రం మౌనం- రైతు సంఘాల అనుమానాలు- ఎన్నికల కోసమేనా ?
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. వీటిని అణచివేసేందుకు కేంద్రం సామ,దాన,భేద, దండోపాయాలను ప్రయోగిస్తోంది. మరోవైపు చర్చల పేరుతో రైతులతో పలుమార్లు మాట్లాడింది. అయినా వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే వరకూ తాము ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు కుండబద్దలు కొట్టారు. ఇదంతా కొనసాగుతున్న సమయంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చిపడ్డాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రైతు నిరసనలపై కేంద్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. విపక్షాలు కవ్విస్తున్నా కేంద్రం మాత్రం నోరుమెదపడం లేదు. ఉత్తర భారతంలో ఎన్నికలు జరుగుతున్న అసోం, బెంగాల్ వంటి రాష్టాల్లో రైతు నిరసనల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తేలకపోయినా బీజేపీ మాత్రం వ్యవసాయ చట్టాల ప్రస్తావన తెచ్చేందుకు భయపడుతోంది. అయితే కేంద్రం అటు తమతో చర్చలు జరగకుండా మౌనం వహించడంపై రైతు సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

కేంద్రం దాదాపు 15-20 రోజులుగా చర్చలు జరపకుండా మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ అనుమానాలు వ్యక్తం చేశారు. రైతు ఉద్యమాలను అణగదొక్కేందుకు కేంద్రం కొన్ని చట్రాలు సిద్దం చేస్తోందని తికాయత్ ఆరోపించారు. రైతు సంఘాలతో చర్చలు ఆగిపోయినప్పుడు వాటిని తిరిగి కొనసాగించేందుకు కేంద్రం మరిన్ని ప్రతిపాదనలు తీసుకురావాల్సి ఉండగా.. అదంతా వదిలిపెట్టి మౌనం వహించడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. పరిష్కారం దొరికే వరకూ రైతులు వెనక్కి వెళ్లరని, రైతుకు వ్యవసాయం, ఆందోళనలు రెండూ ముఖ్యమేనని తికాయత్ స్పష్టం చేశారు.