రైతుల ఆందోళనతో కరోనా విజృంభణ, అత్యవసర సేవలకు విఘాతం: సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనపై ఓం ప్రకాశ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతుల నిరసనతో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడ్నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

రైతుల ఆందోళనతో కరోనా విజృంభణకు అవకాశం..
అంతేగాక, రైతుల ఆందోళనల కారణంగా అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలుగుతోందని పిటిషనర్ సుప్రీంకోర్టుకు వివరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కారణంగా వేలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. ఒకవేళ కరోనావైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశలోకి చేరుకుంటే.. దేశంలో భారీ వినాశనం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఓం ప్రకాశ్.

అత్యవసర సేవలకు విఘాతం..
న్యూఢిల్లీ సరిహద్దుల్లో రైతులు భారీ ఎత్తున బైఠాయించడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయని, దీని వల్ల అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే వారిని అకడ్నుంచి ఖాళీ చేయించి సరిహద్దులను తెరిపించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

మాస్కులు, భౌతిక దూరం పాటించేలా..
ఆందోళనచేస్తున్నవారు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. కాగా, కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత తొమ్మిది రోజులుగా రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

కేంద్రంతో చర్చలు విఫలం.. మరోసారి డిసెంబర్ 5న
కేంద్రం ఇప్పటి రెండు దఫాలుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే, రైతు సంఘాల ప్రతినిధులు కొత్త వ్యవసాయ చట్టాల రద్దునే డిమాండ్ చేయడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి. పంటకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదు. చట్టాల రద్దుకే డిమాండ్ చేశారు. దీంతో శనివారం మరోసారి రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కావాలని కేంద్రం పెద్దలు నిర్ణయించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే కేంద్రం పెద్దలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.