• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్నాల్‌లో రైతుల మహాపంచాయత్, సెక్రటేరియట్ ముట్టడి: ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్ అమలు

|

ఛండీగఢ్: ఆగస్టు 28న పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌కు వ్యతిరేకంగా హర్యానాలోని కర్ణాల్‌లో వందలాది మంది రైతులు మంగళవారం మహాపంచాయత్ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించింది.

అంతేగాక, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా 144 సెక్షన్ విధించింది. కర్నాల్ తోపాటు మరో నాలుగు జిల్లాల్లోనూ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను మంగళవారం రద్దు చేశారు. కురుక్షేత్ర, కైథల్, జింద్, పానిపట్ జిల్లాల్లో మంగళవారం ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

Farmers protest against lathicharge in Karnal, mobile Internet suspended, 144 section imposed

10 కంపెనీల సెంట్రల్ పారామిలిటీ బలగాలతోపాటు 40 కంపనీల సెక్యూరిటీ సిబ్బందిని జిల్లాలో రంగంలోకి దించారు. స్థానిక అధికారులు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. హర్యానా బీకేయూ చీఫ్ గుర్నమ్ సింగ్ చదునీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 6 వరకు తమ డిమాండ్లు నెరవేర్చేందుకు గడువు ఇచ్చామని తెలిపారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రానందునే తాము మంగళవారం మహా పంచాయతీ నిర్వహించి, మిని సెక్రటేరియట్ ఘెరావ్ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు.

తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతామని, అధికార యంత్రాంగం రెచ్చగొట్టేలా చేస్తే మాత్రం బారికేడ్లను బద్దలు కొట్టుకుని దూసుకెళ్తామని గుర్నమ్ సింగ్ వ్యాఖ్యానించారు. జాతీయ రహదారులను నిర్బంధించాలని తాము పిలుపునివ్వలేదని ఆయన తెలిపారు.

రైతుల మహాపంచాయతీ నేపథ్యంలోనే అధికారులు, పోలీసులు ఆంక్షలు విధించారు. నలుగురు లేదా ఐదుగురు కంటే ఎక్కువగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రైతు నిరసన కారణంగా ట్రాఫిక్ మార్గాలను మళ్లించారు. జాతీయ రహదారి నెంబర్ 44 (అంబాలా-ఢిల్లీ)పై రైతు నిరసన ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సాధారణ ప్రజలు కర్నాల్ పట్టణంలో ప్రయాణించే బదులు మరో మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. కర్నాల్ తోపాటు పొరుగు జిల్లాల్లోనూ భారీగా బలగాలు మోహరించాయి.

కాగా, కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్(పశ్చిమ) రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మహాపంచాయత్ కు రైతు నేతలు పిలుపునిచ్చారు. మినీ సెక్రటేరియట్ ముట్టడించాలని నిర్ణయించారు. లాఠీఛార్జ్‌కు కారణమైన ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హాపై హత్యా నేరం కింద కేసు పెట్టాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆ తర్వాత సదరు అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది.

నిరసనల్లో మరణించిన రైతు లాఠీ ఛార్జీ కారణంగా చనిపోలేదని, గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతుండగా.. లాఠీ ఛార్జ్ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని రైతు నేతలు అంటున్నారు. మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారంతోపాటు అతని కుటుంబంలోని ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Farmers protest against lathicharge in Karnal, mobile Internet suspended, 144 section imposed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X