ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ మార్చ్ .. వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్.. ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
అన్నదాతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సమర నినాదం చేస్తున్న అన్నదాతలు ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టి కేంద్రంపై పోరు ఉధృతం చేశారు. 3500 కు పైగా ట్రాక్టర్ల ర్యాలీలతో రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ తెలిపారు .
వర్షంలోనూ రైతుల ఆందోళన తీవ్రతరం: ఢిల్లీ అష్ట దిగ్బంధం..వర్షంతో ట్రాక్టర్ మార్చ్ రేపటికి వాయిదా

3500 కు పైగా ట్రాక్టర్లతో ర్యాలీ చేస్తున్న రైతులు
ఈరోజు ఉదయం 11 గంటలకు రైతుల ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించి కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్ప్రెస్వే వైపు సాగారు . వేలాదిగా రైతులు 3500 కు పైగా ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. పంజాబ్ , హర్యానా ల నుండి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు . రైతుల ట్రాక్టర్ల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
నలభై మూడు రోజులుగా తీవ్రమైన చలి, ప్రస్తుతం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన సాగిస్తున్నారు.

ర్యాలీలో పాల్గొన్న 40 రైతు సంఘాల నేతలు
వేలాదిగా రైతులు దేశ రాజధాని ఢిల్లీకి నాలుగు సరిహద్దుల వైపు నుండి ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టారు.
రిపబ్లిక్ డే రోజు కిసాన్ పేరుతో నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఇది రిహార్సల్స్ ర్యాలీ గా ఉంటుందని రైతు సంఘాలు పేర్కొన్నాయి . సుమారు 40 రైతు సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రాక్టర్ల ర్యాలీ ద్వారా రైతులు తమ డిమాండ్లను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతున్నారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పకనే చెబుతున్నారు.

జనవరి 8వ తేదీన కేంద్రంతో ఎనిమిదవ విడత చర్చలు
ఈరోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి . రైతులు బుధవారమే ట్రాక్టర్ ర్యాలీ ని చేపట్టాలని భావించినప్పటికీ వర్షం కారణంగా వాయిదా పడటంతో నేడు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. జనవరి 8వ తేదీన రేపు మరోమారు కేంద్ర ప్రభుత్వం తో రైతు సంఘాలు చర్చలు జరపనున్నాయి. మరోమారు అన్నదాతలు, కేంద్రంతో చర్చలు జరుపనున్న సమయంలో ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు రైతులు.

రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం .. రైతు సంఘం నేతల వెల్లడి
రాబోయే రోజుల్లో, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మా ఆందోళనను తీవ్రతరం చేస్తాము. హర్యానా నుండి సుమారు 2,500 ట్రాక్టర్లు నేటి కవాతులో పాల్గొన్నారు. ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించకపోతే, రైతుల నిరసన ఉధృతంగా సాగుతుందని తాము హెచ్చరించాలనుకుంటున్నాము అని సంయుక్త్ కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు హర్యానాకు చెందిన అభిమన్యు కోహర్ చెప్పారు.