దద్దరిల్లుతున్న ఢిల్లీ .. బోర్డర్ లో 60 వేల మంది పైగా రైతుల నిరసన .. మారుతున్న సీన్ తో అధికారులకు టెన్షన్
అన్నదాతల నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ సరిహద్దులు మార్మోగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రోజు రోజుకు నిరసనకారుల సంఖ్య పెరుగుతుండటంతో, హర్యానా పోలీసుల ఉన్నతాధికారులు మాట్లాడుతూ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్న కారణంగా సరిహద్దుల వద్ద ఎక్కువ మంది ఉండటం మంచిది కాదంటూ పేర్కొంటున్నారు. ఒకపక్క కరోనా వ్యాప్తి జరుగుతుందని , సరిహద్దుల్లో 60,000 మందికి పైగా రైతు నిరసనకారులు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని హర్యానా పోలీసులు తెలిపారు.
పుట్టినరోజు నాడు రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ .. ఏం చెప్పారంటే

నిరసనల్లో పంజాబ్లోని సుదూర ప్రాంతాలతో పాటు, హర్యానా, ఎంపి, యుపి రైతులు
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రైతు నాయకులు తెలిపారు. నిరసనలో పాల్గొనడానికి పంజాబ్లోని సుదూర ప్రాంతాలతో పాటు, హర్యానా, ఎంపి, యుపి మరియు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి రైతులు వస్తున్నారని , కేంద్రం రైతులకు నష్టం చేకూర్చే చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విపరీతంగా తరలివస్తున్న రైతులను నియంత్రించడం కోసం పోలీసులు పంజాబ్ మరియు హర్యానా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

ఢిల్లీ నుండి అంబాల మరియు ఢిల్లీ నుండి హిసార్ రోడ్స్ బ్లాక్
ప్రస్తుతం ఢిల్లీ నుండి అంబాల మరియు ఢిల్లీ నుండి హిసార్ జాతీయ రహదారులు ప్రస్తుతం రైతుల ఆందోళనతో బ్లాక్ చేయబడ్డాయి. ఎవరైనా ఢిల్లీ లోకి ప్రవేశించాలి అనుకుంటే గ్రామాల లింకు రోడ్ల ద్వారా సుదూర ప్రయాణాలు చేయవలసి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. రైతు నాయకులతో ప్రభుత్వం సంప్రదిస్తోందని , సరిహద్దులలో నిరసనకారుల సంఖ్యను పెంచవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సరిహద్దులకు ఎక్కువ మందిని పంపవద్దని మేము పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసామని చెప్పారు.

పెరుగుతున్న ఆందోళనలతో అధికారులకు టెన్షన్ ..
ఒకపక్క విపరీతమైన శీతాకాలం, మరోపక్క కరోనా కేసులతో తీవ్ర ఇబ్బందికి గురి అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే ఆందోళనకారులు వివిధ అనారోగ్యాల కారణంగా 30-40 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు అని పేర్కొన్నారు. మరోవైపు, సింగు సరిహద్దులోని రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తాము వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. 6 నెలల రేషన్ కూడా తెచ్చుకుందామని, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే తిరిగి వెళ్తామని, ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత తిరిగి ఇంటికి వెళదామని ఆందోళనకారులు స్పష్టంగా తేల్చి చెబుతున్నారు.

సరిహద్దు శిబిరాల వద్ద వసతుల లేమి .. అయినా సరే ఉవ్వెత్తున ఆందోళన
సింఘూ సరిహద్దు తో పాటు తిక్రీ సరిహద్దు వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది.
రైతు వ్యతిరేక చట్టాలను త్వరలో రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రతరం అవుతుందని జమ్హూరి కిసాన్ సభ నాయకుడు పర్గత్ సింగ్ జమరాయ్ అన్నారు. సరిహద్దుల వద్ద మరిన్ని మొబైల్ మరుగుదొడ్ల ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను కోరారు, సౌకర్యాల కొరత ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు . ఆందోళన చేస్తున్న శిబిరాల వద్ద సౌకర్యాల కొరకు ఉన్నప్పటికీ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తానని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు.