farmers protest rail roko punjab haryana uttar pradesh రైతుల నిరసన రైల్ రోకో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్
రైల్ రోకో: రైల్వే శాఖ అప్రమత్తం, పలు రైళ్ల మళ్లింపు, రద్దు, అదనంగా 20 కంపెనీల బలగాలు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలో భాగంగా గురువారం(ఫిబ్రవరి 18న) రైల్ రోకో ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వేశాఖ.. ప్రభావిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో పలు రైళ్లను మళ్లిస్తోంది.
ఈ రాష్ట్రాల్లో మరికొన్ని రైళ్లను రద్దు చేసింది. అంతేగాక, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 20 కంపెనీల అదనపు బలగాలను రంగంలోకి దింపుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్) తెలిపింది. ఆందోళన ప్రభావం ఎక్కువగా ఉండే.. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించింది.

ఇంటెలీజెన్స్ నివేదికలకు అనుగుణంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆయా ప్రాంతాల్లో 20వేల అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఆర్పీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రైతు సంఘాల నేతలు, రైతులు తమ ఆందోళనలు శాంతియుతంగా చేసుకోవాలని కోరారు.
పంజాబ్, హర్యానా రైతులు దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల మద్దతును కూడట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 18న నాలుగు గంటలపాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశ వ్యాప్తంగా రైలు రోకోను నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే, ఈ రైల్ రోకో ప్రభావం ఎక్కువగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లోనే ఉండే అవకాశం ఉంది. కాగా, సామాన్య రైతులు ఈ ఆందోళనలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు.