
లఖీమ్ పూర్ ఇష్యూ: రైల్ రోకో, మహా పంచాయతీ.. క్యాండిల్ ర్యాలీ.. నిరసనలు
లఖిమ్‌పూర్ ఘటనతో రైతు సంఘాలు/ నేతలు రగిలిపోతున్నారు. 8 మంది చావుకు కారణమయిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నెల 18వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తామని చెబుతున్నారు. 26వ తేదీన మహా పంచాయతీ నిర్వహిస్తామని తెలిపారు. అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అతని కుమారుడు ఆశీష్‌ను అరెస్ట్ చేయాలని కోరారు.
మరోవైపు 12వ తేదీన రైతుల అందరూ లఖీమ్ పూర్ చేరుకోవాలని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ తెలిపారు. అలాగే ఆ రోజు రాత్రి 8 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని కోరారు. ఈ నెల 15వ తేదీన దసరా.. అయినందున ఆ రోజు మోడీ, అమిత్ షా బొమ్మలు దగ్దం చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులకు మద్దతు ధర కోసం శాంతియుతంగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లఖింపూర్‌లో కూడా రైతులు నిరసన తెలియజేస్తుండగా.. కేంద్రమంత్రి కుమారుడు కారుతో తొక్కించాడు. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8 మంది చనిపోయారు.
లఖిమ్‌పూర్ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న రైతులు నల్లజెండాలతో నిరసన తెలుపాలని భావించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ కారు రైతులపైకి దూసుకొచ్చింది. అందరు చూస్తుండగానే రైతులను ఢీ కొని వెళ్లిపొయింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు స్వాగతం పలికి తీసుకొచ్చేందుకు ఆశీష్ మిశ్రా వెళ్తున్నట్లుగా సమాచారం.