తండ్రి అంత్యక్రియలకు డుమ్మా కొట్టిన జకీర్ నాయక్
ముంబై: వివాదస్పద మత బోధకుడు జకీర్ నాయక్ తన సొంత తండ్రి అంత్యక్రియలకు డుమ్మా కొట్టారు. భారత్ కు వస్తే తననను పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో తన తండ్రి అబ్దుల్ కరీం నాయక్ అంత్యక్రియలకు జకీర్ నాయక్ డుమ్మా కొట్టారు.
జకీర్ నాయక్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీం నాయక్ (87) ఆదివారం వేకువజామున ముంబైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మరణించారు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న జకీర్ నాయక్ తన తండ్రి మరణించారని తెలుసుకున్నా ఆయన భారత్ లో అడుగుపెట్టలేదు.
ప్రస్తుతం మలేసియాలో జకీర్ నాయక్ ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. జకీర్ నాయక్ తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. జకీర్ నాయక్ తండ్రి అబ్దుల్ కరీం బాంబే సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. ప్రస్తుతానికి జకీర్ నాయక్‌పై ఎఫ్ఐఆర్ ఏదీ నమోదు కాలేదు.
కేంద్రం ప్రభుత్వం మాత్రం జకీర్ నాయక్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటించాలని భావిస్తోంది. జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. జకీర్ నాయక్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నడిపించే పీస్ టీవీ మతపరమైన కార్యక్రమాలనే ప్రసారం చేస్తూ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపణలు ఉన్నాయి.
మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో జన్మించిన జకీర్ నాయక్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీమ్ మంచి వైద్యుడిగాను, విద్యావేత్తగాను పేరు సంపాధించారు. కొన్ని రోజుల క్రితం డాక్టర్ అబ్దుల్ కరీమ్ ను మజ్గావ్లోని ప్రిన్స్ అలీఖాన్ ఆస్పత్రిలో చేర్చారు.
ఆయనకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం వేకువ జామున 3.25 గంటల సమయంలో మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
డాక్టర్ అబ్దుల్ కరీమ్ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. పలువురు వైద్యులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు వచ్చారు. అయితే జకీర్ నాయక్ మాత్రం భారతదేశంలో అడుగు పెట్టలేదు. భారత్ కు వస్తే తనను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన ఇక్కడికి రాకుండా అక్కడే ఉండిపోయారు.
ముంబై సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు, జాతీయ నిఘా సంస్థ అధికారులు, స్థానిక పోలీసులు, జాతీయ నిఘాసంస్థ అధికారులు, స్థానిక పోలీసులు కూడా జకీర్ కోసం అంత్యక్రియలు జరిగిన ప్రాంతాల్లో జకీర్ నాయక్ గట్టి నిఘా వేసి గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు.