కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యండి .. షాక్ ఇచ్చిన ముంబై కోర్టు
కంగనా రనౌత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నుండి కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు . కంగణా రనౌత్ ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం తోనే యుద్ధానికి దిగారు . మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై ఆమె నేరుగా విమర్శలు గుప్పించారు . ఇక ఈ నేపధ్యంలో ఆమె వరుసగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది . తాజాగా కంగనా రనౌత్ కు మరో షాక్ తగిలింది.

మత విద్వేషాలు రగిల్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ లపై కోర్టు ఆదేశం
సోషల్ మీడియా పోస్టులతో హిందూ ముస్లింల మధ్య విభేదాలను సృష్టించడానికి ప్రయత్నించారని కంగనా రనౌత్ పై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరియు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది.
క్యాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ అయిన మున్నావరాలీ సయ్యద్ పిటిషన్ పై శనివారం విచారణ జరిపిన ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సోషల్ మీడియాలో కంగనారనౌత్ ఆమె సోదరి చేసిన పోస్టుల ద్వారా హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను సృష్టించడానికి ప్రయత్నించారని కోర్టు విశ్వసించింది.

కంగనా , ఆమె సోదరి రంగోలి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలని ముంబై కోర్టు ఉత్తర్వులు
దీంతో కంగనా రనౌత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై సమగ్ర దర్యాప్తు అవసరమని భావించిన కోర్టు ఆమె పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పేర్కొంది. ఈమేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయ్‌దేవ్ వైఘులే తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సయ్యద్ ఇండియన్ పీనల్ కోడ్ 34 లోని 153ఏ, 295ఏ, 124 కింద కంగనా రనౌత్ , ఆమె సోదరిపై కేసు నమోదు చేయాలని చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కంగనారనౌత్ ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చినప్పుడు కూడా కంగనా రనౌత్ వ్యతిరేకంగా సయ్యద్ ట్వీట్స్ చేశారు.

సుశాంత్ మరణం నుండి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు , ట్వీట్లు
జూన్ 14 న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, కంగనా బాలీవుడ్లో పలువురి ఆధిపత్యం, డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించడంతో కంగనా రనౌత్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును నీరు గార్చేందుకు బాలీవుడ్ ప్రముఖులకు మహా సర్కార్ అండగా ఉంటుందని ఆమె చేసిన ఆరోపణలతో మొదలైన రచ్చ చిలికి చిలికి గాలివానగా మారింది. ముంబై మున్సిపల్ అధికారులతో ఒకపక్క కోర్టులో కంగనా ఫైట్ చేస్తున్నారు . ఇదే సమయంలో ఆమె పలు అంశాలపై ట్వీట్ చేస్తున్నారు. ఆమె వివాదాస్పద ట్వీట్స్ ఇప్పుడు ఆమెకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి .